పల్లె గొంతెండుతోంది | Rural people water problems | Sakshi
Sakshi News home page

పల్లె గొంతెండుతోంది

Published Fri, Sep 4 2015 3:42 AM | Last Updated on Sun, Sep 3 2017 8:41 AM

పల్లె గొంతెండుతోంది

పల్లె గొంతెండుతోంది

మచిలీపట్నం : జిల్లాలో 370 తాగునీటి చెరువులు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీ అనంతరం వారం రోజుల పాటు కాలువలకు నీటిని విడుదల చేయగా అప్పట్లో తాగునీటి చెరువులను నింపారు. ఈ చెరువుల్లోని నీరు మే నెలలోనే సగానికి పైగా వాడుకున్నారు. గత నాలుగు నెలలుగా తాగునీటి చెరువుల్లోకి చుక్కనీరు చేరకపోవటంతో చెరువులు అడుగంటాయి. చల్లపల్లి మండలం కొత్తమాజేరులోని తాగునీటి చెరువులో నీరు కలుషితం కావటం, విషజ్వరాల బారినపడి 19 మంది మృతి చెందటంతో అడుగంటిన చెరువుల్లోని నీటిని తాగాలంటే ప్రజలు భయపడిపోతున్నారు.

కోట్లాది రూపాయలు తాగునీటి శుద్ధి కోసం, సరఫరా కోసం ఖర్చు చేస్తున్నా కలుషిత నీరే తాగాల్సిన దుస్థితి ప్రజలకు ఏర్పడింది. రక్షిత నీటి పథకాల ద్వారా సరఫరా అవుతున్న నీరు పచ్చగా ఉండటంతో వాటిని తాగలేక జనం అల్లాడిపోతున్నారు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే పంచాయతీల్లోని 13, 14వ ఆర్థిక సంఘ నిధులను ఖర్చుచేసి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తామని అధికారులు చెప్పటమే తప్ప ఆచరణలో చూపటం లేదు.

 గ్రామాల్లో దాహం కేకలు...
 మచిలీపట్నం మండలం కోన, పల్లెతుమ్మలపాలెం, తుమ్మలచెరువు, అరిసేపల్లి, పెదయాదర, రుద్రవరం తదితర గ్రామాల్లో తాగునీటి చెరువులు పూర్తిగా అడుగంటాయి. చెరువులను నింపేందుకు కాలువల ద్వారా నీరు రాకపోవటంతో పంచాయతీ పాలకవర్గాలు చేతులెత్తేశాయి. కోన గ్రామస్తులు చెరువు పక్కనే ఉన్న బావి, పంట కాలువ పక్కనే ఉన్న బోరు పంపు వద్దకు వెళ్లి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. ఈ గ్రామంలో ఆకుమర్రు మంచినీటి పథకం ద్వారా మూడు, నాలుగు రోజులకు ఒకసారి ఇంటికి రెండు బిందెలు చొప్పున తాగునీటిని సరఫరా చేస్తున్నారు.

నందివాడ మండలం ఇలపర్రు, ఎల్‌ఎన్‌పురం, వెన్ననపూడి, అరిపిరాల, కోరుకొండ పంచాయతీల్లోని చెరువులు పూర్తిస్థాయిలో అడుగంటాయి. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, తమిరిశ పీఏసీఎస్ అధ్యక్షుడు పిన్నమనేని బాబ్జిల సహకారంతో ఈ గ్రామాలకు తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. పామర్రు మండలం ఎలకుర్రులో తాగునీటి చెరువు అడుగంటింది. నీరు - చెట్టు కార్యక్రమం ద్వారా ఈ చెరువును తవ్వారు. అనంతరం చెరువును నింపకపోవటంతో గ్రామానికి నిమ్మకూరు నుంచి ఓ దాత సహాయంతో తాగునీటిని సరఫరా చేస్తున్నారు.

కోడూరు మండలం వి.కొత్తపాలెం, రామకృష్ణాపురం, ఊటగుండం, ఇరాలి, జరుగువానిపాలెం గ్రామాల్లో తాగునీటి పథకాలు మూలనపడ్డాయి. దీంతో ఇరాలి గ్రామస్తులు రెండు కిలోమీటర్ల దూరంలోని ఇరాలి డ్యాం వద్ద ఉన్న చేతి పంపు నుంచి, జరుగువానిపాలెం గ్రామస్తులు కోడూరు వచ్చి తాగునీటిని తీసుకువెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. నాగాయలంక మండలం సొర్లగొందిలో ఉన్న తాగునీటి చెరువు ద్వారా 10 పంచాయతీలకు సంగమేశ్వరం నీటి పథకం ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ చెరువు అడుగంటడంతో తాగునీటిని పొదుపుగా గ్రామాలకు సరఫరా చేస్తున్నారు.

 తరకటూరు సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో 1.90 మీటర్ల నీటిమట్టం
 మచిలీపట్నం, పెడన పురపాలక సంఘాలతో పాటు మచిలీపట్నం, గూడూరు మండలాల్లో 3.5 లక్షల మంది జనాభా ఉన్నారు. వీరందరికీ తరకటూరు సమ్మర్‌స్టోరేజీ ట్యాంకు ద్వారా తాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. ట్యాంకు నీటి మట్టం 5.19 మీటర్లు. ప్రస్తుతం అది 1.90 మీటర్లకు చేరింది. మూడు అడుగులకు నీరు చేరితే ఆ నీటిని ఉపయోగించడానికి వీలు లేకపోవటంతో పాటు దుర్వాసన వస్తుంది. ప్రస్తుతం ఉన్న నీటి మట్టం 40 రోజులకు సరిపోతుందని అధికారులు చెబుతున్నారు.

పెడన, మచిలీపట్నం పురపాలక సంఘాల్లో రోజు విడిచి రోజు తాగునీరు సరఫరా చేస్తుండగా గూడూరు మండలంలోని 15 పంచాయతీలకు, బందరు మండలంలోని 34 పంచాయతీలకు మూడు, నాలుగు రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. తాగునీటిని ఎంత పొదుపుగా వాడినా నెల రోజులకు మించి తరకటూరు సమ్మర్‌స్టోరేజీ ట్యాంకులోని నీరు రాదని అధికారులే చెప్పటం గమనార్హం.

 నందిగామ పట్టణంలో ఐదు రోజులకు ఒకసారి, పది రోజులకు ఒకసారి తాగునీటిని ఇష్టానుసారంగా సరఫరా చేస్తున్నారు. ఐతవరం వద్ద మూడు బోర్లు ఉన్నాయి. మోటార్లు మరమ్మతులకు గురైనా వాటిని బాగు చేయించటం లేదు. పాత పైప్‌లైన్‌ల కారణంగా నీరు వృథా అవుతోంది. జగ్గయ్యపేట పురపాలక సంఘంలో రెండు రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. బోర్ నుంచి సక్రమంగా నీరు రాకపోవటంతో పట్టణంలోని మినరల్ వాటర్ ప్లాంట్ల నుంచి స్థానికులు నీటిని కొనుగోలు చేస్తున్నారు.
 
 అక్కడ.. పొరుగు జిల్లా నుంచి తెచ్చుకోవాల్సిందే
 పశ్చిమగోదావరి జిల్లాకు సరిహద్దున ఉన్న కృత్తివెన్ను మండలంలో పల్లెపాలెం, లక్ష్మీపురం గ్రామస్తులు భీమవరం వెళ్లి తాగునీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 20 లీటర్ల టిన్ను కొనుగోలు, రవాణా ఖర్చులు కలిసి ఇంటికి చేరేసరికి రూ.50 అవుతోంది. తాగునీటి కోసం ఇంటికి ఒకరు పనులు మానుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కృత్తివెన్ను మండలంలోని శీతనపల్లి, నీలిపూడి, కొమాళ్లపూడి, మాట్లం, పల్లెపాలెం, నిడమర్రు తదితర ప్రాంతాల్లోని తాగునీటి చెరువుల్లోని నీరు పూర్తిగా అడుగంటింది. కైకలూరు మండలంలోని లంక గ్రామాల ప్రజలు దుంపగడప, ఆకివీడు గ్రామాలకు వెళ్లి తాగునీటిని కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు.

కైకలూరు, కలిదిండి మండలాల్లోని కొట్టాడ, సున్నంపూడి గ్రామస్తులు ఉప్పుటేరును దాటి పడవలో తాగునీటి తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కైకలూరులోని పెంచికలమర్రు, మండవల్లి మండలంలోని తక్కెళ్లపాడులలో మెగా తాగునీటి ప్రాజెక్టు పథకాలు ఉన్నాయి. ఈ రెండు పథకాల ద్వారా 16 పంచాయతీలకు తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంది. ఈ రెండు చెరువులకు గత నాలుగు నెలలుగా నీరు చేరకపోవటంతో 16 పంచాయతీల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. ఈ 16 పంచాయతీల చుట్టూ చేపల చెరువులు ఉండటంతో భూగర్భ జలాలు కలుషితమయ్యాయి.
 
 గుక్కెడు నీటి కోసం ఎన్ని తిప్పలో
 మా గ్రామంలో గుక్కెడు నీరు దొరకని పరిస్థితి నెలకొంది. చెరువు పక్కనే ఉన్న బావిలోని నీటినే వంట చేసుకునేందుకు ఉపయోగిస్తున్నాం. ప్రతిరోజూ తెల్లవారుజాము రెండు గంటల నుంచి ఈ బావి వద్ద క్యూ కట్టాల్సిందే. కొంతసేపటికే బావిలో నీరు అయిపోతోంది. నీరు ఊరే వరకు వేచి ఉండి మళ్లీ తోడుకోవాల్సిందే. గ్రామంలోని తాగునీటి చెరువు పూర్తిగా పాడైపోయింది.    
- కుమారి, కోన
 
 16 ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నాం
 జిల్లాలో 370 తాగునీటి చెరువులు ఉన్నాయి. వీటిలో 10 రోజులకు సరిపడా నీరు మాత్రమే ఉంది. జిల్లాలోని సముద్రతీరం, కాలువ శివారున ఉన్న 16 గ్రామాలకు 16 ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నాం. ఒక మనిషికి రోజుకు 10 లీటర్లు చొప్పున అందజేస్తున్నాం. ఏదైనా గ్రామంలో తాగునీటి ఎద్దడి నెలకొంటే ట్యాంకర్ల ద్వారా సరఫరాకు సిద్ధంగా ఉన్నాం.    - గోపాల్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement