నీటికుంట..రైతుకు అండ
– వర్షపు నీటిని ఒడిసిపడితేనే లాభసాటిగా వ్యవసాయం
– ఏఆర్‌ఎస్ ప్రధాన శాస్త్రవేత్తలు బి.రవీంద్రారెడ్డి, బి.సహదేవరెడ్డి
అనంతపురం అగ్రికల్చర్ : నీటి కుంటలు మెట్ట పంటలను రక్షిస్తాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వ్యవసాయం లాభసాటి కావాలంటే పొలాల్లో నీటి కుంటలు, కందకాలు ఏర్పాటు చేసుకుని పై నుంచి పడే ప్రతి వర్షపు చుక్కను ఎక్కడిక్కడ ఇంకించుకోవాలన్నారు.
9.65 లక్షల హెక్టార్లకు వర్షమే శరణ్యం
జిల్లావ్యాప్తంగా 9.65 లక్షల హెక్టార్లలో పంటలు పండించాలంటే వర్షమే శరణ్యం. రాష్ట్ర వ్యాప్తంగా 39.11 లక్షల హెక్టార్లు మెట్ట భూమి ఉండగా అందులో అత్యధికంగా 9.65 లక్షల హెక్టార్లలో జిల్లాలో ఉంది. అనిశ్చితి వాతావరణం, తక్కువ వర్షాలు, అననుకూల వర్షాలు, నెలల తరబడి బెట్ట పరిస్థితులు ఏర్పడటం (డ్రైస్పెల్స్), ఒక్కోసారి ఎడతెరపి లేకుండా వర్షాలు పడటం వల్ల పంటలు పండటం కష్టంగా మారింది.
నీటి కుంటలు అత్యవసరం
బెట్ట పరిస్థితుల నుంచి పంటలను కాపాడుకునేందుకు, కనీస పంట దిగుబడులు పొందేందుకు నీటి కుంటలు (ఫారంపాండ్స్) ఏర్పాటు చాలా అవసరం. అధిక వర్షాలు కురిసినప్పుడు నీరు ప్రవహించకుండా ఎక్కడిక్కడ నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలి. 1.50 లక్షల నుంచి 4 లక్షల లీటర్లు నిల్వ ఉండేలా తవ్వుకోవాలి. సాధారణంగా 10 మీటర్ల పొడవు, పది మీటర్లు వెడల్పు, 2.5 మీటర్లు లోతు (10“10“2.50 మీటర్లు) తవ్వుకుంటే 2.50 లక్షల లీటర్లు నిల్వ చేసుకోవచ్చు. నీటి కుంటలకు లైనింగ్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. నల్లరేగడి నేలల్లో లైనింగ్ లేకున్నా ఫరవాలేదు. నీటి కుంటలోకి నీరు వెళ్లే ముందు ఒక చిన్న తొట్టె లేదా గుంత (సిల్డ్ బేసిన్) ఏర్పాటు చేసుకోవాలి. దీని ద్వారా నీటి ప్రవాహంతో కొట్టుకువచ్చిన ఒండ్రుమట్టి ఫారంపాండ్‌లోకి వెళ్లకుండా ఇక్కడే అడ్డుకోవచ్చు.
ఫారంపాండ్‌కు రూ.35,400
ఉదాహరణకు 10“10“2.5 మీటర్ల ఫారంపాండ్ తవ్వుకుని దానికి లైనింగ్ వేయడానికి రూ.35,400 ఖర్చు అవుతుంది. జేసీబీతో గంటకు రూ.750 ప్రకారం 15 గంటల పాటు తవ్వడానికి రూ.11,250, లైనింగ్‌కు బస్తాకు రూ.350 చొప్పున 25 సిమెంట్ బస్తాలకు రూ.8,750, లైనింగ్ వేసేందుకు ఒక కూలీకి రూ.250 ప్రకారం 40 మంది కూలీలకు రూ.10 వేలు, తవ్విన మట్టిన బయటకు చేర్చడానికి రూ.5,400 ఖర్చు అవుతుంది. ప్రస్తుతం డ్వామా ఆధ్వర్యంలో ఉపాధిహామీ కింద నీటి కుంటలు నిర్మిస్తున్నారు. దానికి రైతులు లైనింగ్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. వేసవిలో నీటి కుంటలకు చిన్నపాటి మరమ్మత్తులు చేసుకోవాల్సి ఉంటుంది.
అధిక దిగుబడులు
నిల్వ చేసిన నీటిని సూక్ష్మసేద్య పద్ధతుల (డ్రిప్, స్ప్రింక్లర్లు, రెయిన్‌గన్లు) ద్వారా సున్నిత దశలో పంటలకు నీటి తడులు ఇస్తే పంట దిగుబడులు వస్తాయి. వేరుశనగ పంట ఊడలు దిగే సమయంలో 20 మి.మీ మేర స్ప్రింక్లర్ల ద్వారా రెండు తడులు ఇస్తే 33 శాతం దిగుబడులు పెరిగినట్లు పరిశోధనల్లో తేలింది. కంది పంట పూత, కాయ ఏర్పడే దశలో 20 మి.మీ చొప్పున రెండు తడులు ఇస్తే 66 శాతం దిగుబడులు వచ్చినట్లు రుజువైంది. నల్లరేగడి నేలల్లో పప్పుశెనగలో కొమ్మలు వేసే దశ, గింజ గట్టి పడే దశలో ఇస్తే 15 నుంచి 20 శాతం దిగుబడులు పెరుగుతాయి. నేల, నీటి సంరక్షణ చర్యలపై రైతులు దృష్టి పెడితే భవిష్యత్తులో వ్యవసాయం లాభసాటిగా మారుతుందనడంలో సందేహం లేదు.