సాక్షి, సంగారెడ్డి: వృద్ధులను రాష్ట్ర ప్రభుత్వం వంచిస్తోంది. కాస్తో, కూస్తో ఆదుకుంటున్న పింఛన్లను సైతం దక్కకుండా దూరం చేస్తోంది. మూడో విడత రచ్చబండ రద్దు కావడంతో పింపిణీ చేయడానికి మంజూరు చేసిన కొత్త పింఛన్లను రద్దు చేసింది. గత ఆగస్టు రెండో వారంలో ప్రభుత్వం రచ్చబండ-3 నిర్వహించాలని నిర్ణయించింది. కార్యక్రమాన్ని నిర్వహించడానికి అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న రచ్చబండ-2 దర ఖాస్తుదారులకు కొత్త పింఛన్లు, ఇందిరమ్మ గృహాలు, తాత్కాలిక రేషన్ కార్డులను మంజూరు చేసి రచ్చబండ-3లో పింపిణీకి శ్రీకారం చుట్టేలా చర్యలు తీసుకుంది. రచ్చబండ-2లో వచ్చిన 21,213 అర్జీలతో పాటు ఆయా సందర్భాల్లో వచ్చిన ఇతర అర్జీలు 8,993 కలుపుకుని మొత్తం 30,206 మందికి గత ఆగస్టులో పింఛన్లు మంజూరు చేసింది. అందులో 17,283 వృద్ధాప్య, 12,239 వితంతు, 381 చేనేత, 214 వికలాంగ, 89 గీత కార్మికులకు సంబంధించిన పింఛన్లున్నాయి. ఈ మేరకు పింఛన్ల ప్రతిపాదనలో వీరి పేర్లను సైతం చేర్చింది.
ఈలోగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతి తెలుపుతూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) తీర్మానం చేయడంతో రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితుల వల్ల రచ్చబండ-3ను విరమించుకోక తప్పలేదు. ఈ కార్యక్రమం రద్దు అయినా కొత్తగా మంజూరైనా పింఛన్లపై ప్రభావం ఉండదని అధికారులు భావించారు. సెప్టెంబర్ నుంచి కొత్త లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీకి ఏర్పాట్లు సైతం పూర్తి చేశారు. ఈలోగా పింఛన్ల ప్రతిపాదన నుంచి కొత్తగా మంజూరైన లబ్ధిదారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా తొలగించింది. ఆన్‌లైన్‌లో సైతం కొత్త లబ్ధిదారుల పేర్లు మాయమయ్యాయి. దీంతో అధికారులు సైతం ఖంగుతిన్నారు. కొత్త పింఛన్లను రద్దు చేసిన సర్కారు తమకు ఎలాంటి సమాచారం అందించలేదని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ) అధికారులు పేర్కొన్నారు. రద్దుకు సంబంధించి కారణాలు తెలియవని వారు చెబుతున్నారు. సీమాంధ్రలో కొనసాగుతున్న సమ్మె వల్ల.. ఓ ప్రాంతంలో కొత్త పింఛన్లు ఇచ్చి ఇంకో ప్రాంతంలో ఇవ్వకపోతే సమస్యలొస్తాయని భావించే ప్రభుత్వం రద్దు చేసి ఉండవచ్చని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. మరోవైపు ప్రభుత్వ అనాలోచిత చర్యతో లబ్ధిదారులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. నోటికాడికి వచ్చిన కూడును ప్రభుత్వం లాక్కుందని వృద్ధులు, వికలాంగులు ఆవేదనకు గురయ్యారు. దాదాపు ఏడాదిన్నరగా నిరీక్షిస్తున్న దరఖాస్తుదారులకు పింఛన్లు అందించడం కంటే ప్రచార ఆర్భాటాలకే ప్రభుత్వం పెద్దపీట వేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కొత్త పింఛన్లు రద్దు
Published Thu, Sep 12 2013 12:08 AM | Last Updated on Fri, Sep 1 2017 10:37 PM
Advertisement
Advertisement