సాక్షి, అమరావతి: గ్రూప్–2 (2016) నియామకాలకు సంబంధించి ఎన్నో ఆశలు పెట్టుకొన్న వేలాది మంది అభ్యర్థులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీరుతో తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. 982 పోస్టుల భర్తీకి సంబంధించిన ఈ గ్రూప్–2పై ఆది నుంచి అనేక వివాదాలు నెలకొన్నాయి. ఈ పరీక్షల్లో లోపాలపై తమ అభ్యర్థనలను కమిషన్ వినలేదని, చివరకు పరీక్షలు, ఫలితాల వెల్లడి అనంతరం అభ్యంతరాలనూ పట్టించుకోవడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు న్యాయం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించామని, కేసులు పరిష్కారమై తమకు న్యాయం జరుగుతుందని ఎదురుచూస్తున్న సమయంలో కమిషన్ తమకు అన్యాయం చేస్తోందని వాపోతున్నారు. కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నా కమిషన్ తుది ఫలితాలను ప్రకటించడమే కాకుండా నియామకాలకు ముందుకు వెళ్లడంతో తమకు దిక్కుతోచడం లేదని వారంటున్నారు.
ఆది నుంచీ వివాదాలే..
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 25 వేల మంది దాటడంతో ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించింది. ఇందులో రిజర్వేషన్లు పాటించకపోవడంతో ఆయా వర్గాలకు నష్టం వాటిల్లుతుందని ముందే అభ్యంతరాలు వచ్చినా కమిషన్ పట్టించుకోలేదు. మెయిన్స్‌లో మెరిట్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నవారిని ఓపెన్ కేటగిరీ పోస్టుల్లో భర్తీ చేయాల్సి ఉండగా దీనికి భిన్నంగా ఏపీపీఎస్సీ వారిని రిజర్వుడ్ కోటాలోనే ఉంచేస్తోందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఆ రిజర్వుడ్ అభ్యర్థిని ఓపెన్ కేటగిరీలోకి పంపితే రిజర్వుడ్ కోటాలో ఆ తదుపరి అభ్యర్థికి అవకాశం దక్కుతుంది. కమిషన్ తీరు వల్ల రిజర్వుడ్ వర్గాల అవకాశాలు దెబ్బతింటున్నాయి. గ్రూప్–2 ప్రిలిమ్స్ నిర్వహణలో అనేక సమస్యలు, ఆన్‌లైన్లో పలు సాంకేతిక సమస్యలు తలెత్తి గందరగోళం ఏర్పడింది. చివరకు ప్రిలిమ్స్‌ను 3 నెలల వ్యవధి ఇచ్చి నిర్వహించారు. ప్రిలిమ్స్ కంటే అనేక సబ్జెక్టులు మెయిన్స్‌లో ఉన్నా కమిషన్ కేవలం 45 రోజుల సమయం మాత్రమే ఇవ్వడంతో ఆందోళనలు రేగాయి. ప్రామాణిక పుస్తకాలు కూడా లేక అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. గ్రూప్–2ను జోనల్ స్థాయి పరీక్షగా పేర్కొన్నా కటాఫ్‌ను నిర్ణయించేటప్పుడు రాష్ట్ర స్థాయిగా చూపడంతో రాష్ట్రానికి చెందిన పలువురు అభ్యర్థులు నష్టపోయారు.
మెయిన్స్‌లో మాస్ కాపీయింగ్ ఆరోపణలు
మెయిన్స్ పరీక్ష నిర్వహణలోనూ లోపాలు చోటు చేసుకున్నాయి. విశాఖపట్నంతో సహా కొన్ని కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. స్క్రీన్ షాట్లు కూడా బయటకు వచ్చాయి. ఈ సమస్యలపై తమ అభ్యర్థనలను కమిషన్ పట్టించుకోకపోవడంతో పలువురు ఆందోళనలు చేయగా అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని కమిషన్ వెబ్‌నోట్ విడుదల చేసింది. మెయిన్స్‌లో జరిగిన లోపాలపై పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు.
స్టే ఎత్తేయడం వల్లే నియామకాలు: ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్
గ్రూప్–2కు సంబంధించి న్యాయస్థానంలో దాఖలైన కేసులపై స్టేను ఎత్తేయడంతో నియామకాలు చేపట్టామని ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ తెలిపారు. ఆయా కేసులున్న పోస్టు కోడ్‌లకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక కోర్టు తుది తీర్పులకు లోబడి ఉంటుందన్న షరతులతోనే తుది జాబితాను విడుదల చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment