సాక్షి, శ్రీకాకుళం : శ్రీకాకుళం నియోజకవర్గంలోని శాసనసభ బరిలో నిలిచిన అభ్యర్థులు, వారి అనుయాయులు లెక్కలు కట్టడంలో నిమగ్నమయ్యారు. పోలింగ్ పూర్తయిన వెంటనే ఇలా లెక్కలు వేసుకున్నా కౌంటింగ్ దగ్గర పడడంతో వారిలో ఉత్కంఠ నెలకొని మళ్లీ లెక్కలు కట్టుకుంటున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు.
వైఎస్సార్‌సీ పీ అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు, టీడీపీ అభ్యర్థిగా గుండ లక్ష్మీదేవి, జనసేన అభ్యర్థిగా కోరాడ సర్వేశ్వరరావు, బీజేపీ అభ్యర్థిగా చల్లా వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థిగా చౌదరి సతీష్, పిరమిడ్ పార్టీ అభ్యర్థిగా అములోజు మహేష్, జనజాగృతి తరఫున రాగోలు నాగశివ బరిలో నిలిచారు. అయితే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు, తెలుగుదేశం అభ్యర్థి గుండ లక్ష్మీదేవి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.
నియోజకవర్గంలో 2,55,177 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,81,970 మంది ఓట్లు హక్కును వినియోగించుకోవడంతో 71.31 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం ఓటర్లలో 1,28,170 మంది మహిళలు కాగా, వీరిలో 91,301 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో పసుపు–కుంకుమ పథకం తనకు కలిసి వస్తుందని తెలుగుదేశం అభ్యర్థి భావిస్తున్నారు. అయితే మహిళలతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయులు, రైతులు, మత్స్యకారులు, నిరుద్యోగులు జగన్ వెంట నడవడంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయంపై ధీమాతో ఉన్నారు.
నిన్నటి వరకు కాస్త స్తబ్ధతగా ఉన్న తెలుగుదేశం కేడర్ లగడపాటి సర్వేతో కాస్తంత ఉత్సాహంగా కనిపిస్తోంది. జాతీయ చానళ్లు, మెజారిటీ సర్వే సం్సథలు వైఎస్సార్‌సీపీ ప్రభంజనాన్ని ప్రకటించడంతో కొందరు తెలుగుదేశం నాయకులు డీలా పడగా వైఎస్సార్‌సీపీ కేడర్‌లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం శ్రీ శివాని ఇంజినీరింగ్ కళాశాలలో జరగనున్న ఓట్ల లెక్కింపు ఒకటో నంబర్ బూత్ నుంచి ప్రారంభం కానుండడంతో తొలిగా గార మండలం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అటు తరువాత శ్రీకాకుళం రూరల్, చివరిగా శ్రీకాకుళం పట్టణ ఓట్ల లెక్కింపుతో పూర్తవుతుంది. ఉదయం 11 గంటలకే ఫలితాలు తెలిసే అవకాశం ఉన్నప్పటికీ వీవీ ప్యాట్ల లెక్కింపు ఉండడంతో అధికారికంగా విజయాన్ని ప్రకటించేందుకు సాయంత్రం అయ్యే అవకాశాలున్నాయి. అయితే తెలుగుదేశంలో మాత్రం భయాందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment