గ్రూప్–2 మెయిన్స్ వాయిదా వేయలేం
ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ స్పష్టం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 982 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి సంబంధించి గతేడాది విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారమే నిర్ణీత తేదీల్లో మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ స్పష్టం చేశారు. గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలను ఈనెల 4న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలను మార్చి 20న ప్రకటిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారని, దాదాపు 15 రోజులు ఆలస్యమైనందున ఆ మేరకు మెయిన్స్ పరీక్షల తేదీలను పొడిగించాలని అభ్యర్థులు కోరుతున్నారు.
మెయిన్స్‌కు ప్రిపేర్ అయ్యేందుకు తగినంత సమయమివ్వాలని అభ్యర్థిస్తున్నారు. ఈ విషయాన్ని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లింది. ఆయన మాట్లాడుతూ.. ప్రిలిమ్స్ ఫలితాల విడుదల ఆలస్యమైనా, దీనికి సంబంధించిన ‘కీ’లను ముందుగానే వెబ్‌సైట్‌లో పెట్టామన్నారు. తద్వారా ఎన్ని మార్కులు వస్తాయో అభ్యర్థులు ఒక అంచనాకు వచ్చేందుకు అవకాశముందని చెప్పారు. దాని ప్రకారమే మెయిన్స్‌కు ప్రిపేరై ఉండొచ్చన్నారు. కొన్ని కోచింగ్ సెంటర్ల వారే మెయిన్స్‌కు మరింత సమయం కావాలన్న వాదనను తెరపైకి తెచ్చారని.. ఇలాంటి వాటిని తాము అనుమతించబోమని స్పష్టం చేశారు.
ముందుగా నిర్ణయించిన ప్రకారమే మే 20, 21 తేదీల్లోనే మెయిన్స్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇదిలాఉండగా, సుప్రీంకోర్టు తీర్పు మేరకు 1999 గ్రూప్ 2కు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇటీవల మెరిట్ జాబితా విడుదల చేసినా.. ఇందులో రీలింక్విషన్(రద్దు) లేఖలు ఇచ్చిన వారి స్థానాల్లో ఎంపికలు నిర్వహించాల్సి ఉందని ఉదయభాస్కర్ చెప్పారు. ఇది పూర్తయిన తర్వాతే ఎగ్జిక్యూటివ్ పోస్టుల జాబితాను ప్రభుత్వానికి అందిస్తామన్నారు. ఇదే గ్రూప్ 2కి సంబంధించిన నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల జాబితాను వారం పది రోజుల్లో వెల్లడిస్తామని ప్రకటించారు. వీటికి ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకానికి సంబంధం లేదని వివరించారు.