ఒంగోలు: గ్రేడింగ్ ప్రకటనతో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగుతాయనుకోవడం భ్రమే అవుతుందని ఏపీ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పారెడ్డి వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఏకేవీకే కాలేజీలో శుక్రవారం అసోసియేషన్ జనరల్ సెక్రటరీ తిప్పారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కార్యదర్శి కె.విశ్వనా«థబాబు, జోనల్ అధ్యక్షుడు కె.రాజేంద్రబాబు తదితరులు పాల్గొని పలు అంశాలపై తీర్మానించారు. అనంతరం తీర్మానించిన అంశాలను తిప్పారెడ్డి వెంకటేశ్వరరెడ్డి మీడియాకు వివరించారు. మార్కులు, ర్యాంకులే లక్ష్యంగా రోజుకు 16 నుంచి 18 గంటలు యాంత్రికంగా బట్టీపట్టించడం, లక్ష్యం చేరుకోలేదంటూ విద్యార్థుల పట్ల యాజమాన్య వికృత పోకడల కారణంగా మానసిక ఒత్తిడి శ్రుతిమించి విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికిలోనై ఆత్మహత్యలు చేసుకుంటారని పేర్కొన్నారు. ఆత్మహత్యలు పెరిగినపుడల్లా ప్రభుత్వాలు కమిటీలు వేయడం, నామమాత్రపు చర్యలతో చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారుతుందని, అందులో భాగమే నీరదారెడ్డి కమిటీ, మాజీ కమిషనర్ చక్రపాణి, కమిషన్ సూచనలు బుట్టదాఖలా అని పేర్కొన్నారు.
పదిరోజులుగా ఆత్మహత్యలపై ఆందోళనలు తీవ్రమైన నేపథ్యంలో విద్యాశాఖామంత్రి స్పందించి ఈ ఏడాది నుంచి ర్యాంకుల బదులు గ్రేడింగ్ అంటూ ప్రకటించడం కేవలం సమస్యను పక్కదారి పట్టించడంగానే భావిస్తున్నామన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో పనితీరు, పనిగంటలు, బోధనా పద్ధతులు మారనంత వరకు ఆత్మహత్యలు ఆగవన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగాల్సిన విద్యను తీవ్ర మానసిక ఒత్తిడితో విద్యార్థులను చదివించడం తగదని, ప్రతి గ్రూపుకు కేవలం 2 నుంచి 3 సెక్షన్లు మాత్రమే ఉండాలన్నారు. ఇంటర్ బోర్డు అకడమిక్ సిలబస్‌ను మాత్రమే బోధించాలని, ఎంసెట్, ఐఐటీ కోచింగ్‌లు సమాంతరంగా బోధించకుండా నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు. ఒంటరితనాన్ని పారదోలి ఒత్తిడి తగ్గించేటట్లు అకడమిక్ క్యాలెండర్ రూపొందించాలని ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వ జూనియన్ లెక్చరర్ల సంఘం విజ్ఞప్తి చేస్తుందని, ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శిని ఒకటి రెండు రోజుల్లో కలిసి తమ తీర్మానాలను అందిస్తామని వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment