అండర్ డ్రైనేజీ పైప్‌లైన్‌పై రింగ్ రోడ్డు వేసిన దృశ్యం
శ్రీశైల క్షేత్రంలో మాస్టర్‌ప్లాన్ అమలులో భాగంగా చేపట్టిన రూ. కోట్ల అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాధ్యతలు కాంట్రాక్ట్ ఇంజినీర్లకు అప్పగింతలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్ర పరిధిలో దాదాపు రూ. 150 కోట్ల పనులు చేపట్టగా ఒక ఏఈఈకి రూ. వంద కోట్ల పనుల బాధ్యతలు అప్పగించడం చూస్తుంటే ఏదో రహస్యం దాగి ఉందా అంటే.. అవుననే సమాధానం వస్తోంది. ఓ రాజకీయ నేత, రాష్ట్ర స్థాయి అధికారి అండదండలతో ఆయన ఇంజినీర్ విభాగంలోనే కీలకంగా మారారు. పనుల నాణ్యత గాలికొదిలేసి..కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతూ అక్రమార్జనకుపక్కా ప్లాన్ గీశారు.
శ్రీశైలం టెంపుల్: భక్తుల సౌకర్యార్థం శ్రీశైలం పరిధిలో చేపట్టే అభివృద్ధి పనుల పర్యవేక్షణకు ఇంజినీర్ విభాగం కీలకం. ఇంజినీంగ్ విభాగంలో ఈఈ, డీఈ ఏఈఈలు ఉండగా ప్రధానంగా ఏఈఈ (అస్టిసెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్)లు పనుల పర్యవేక్షణ చేస్తుంటారు. పనులకు సంబంధించి వీరు ప్లాన్ రూపొందించడం నుంచి కొలతలు, ఎస్టిమేషన్, డ్రాయింగ్ వేయాల్సి ఉంటుంది. శ్రీశైల దేవస్థానం అభివృద్ధిలో భాగంగా 8 మంది కాంట్రాక్ట్ ఏఈఈలను దేవదాయ శాఖ నియామకం చేసింది. వీరిలో ఏడుగురు దాదాపు రూ. 50 కోట్ల పనులు పర్యవేక్షిస్తుండగా, ఒక ఏఈఈ మాత్రం రూ.వంద కోట్ల పనులు పర్యవేక్షిస్తుండటంతో పలు అనుమానాలకు తావ్విస్తోంది.
గుంటూరు జిల్లా నరసారావు పేటకు చెందిన ఆయనకు ఆ జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత సిఫారసు మేరకు ఇక్కడ ఉద్యోగం వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో నరసారావుపేట మున్సిపాల్టీలో పని చేసే సమయంలో కూడా ఆయనపై పలు ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. శ్రీశైల క్షేత్ర పరిధిలో చేపట్టిన పనుల్లో అధికార పార్టీ నేతకు చెందిన ఓ కాంట్రాక్ట్ సంస్థ భారీ పనిని దక్కించుకుంది. ఆ పనిని పర్యవేక్షించడానికి ఆ ఉద్యోగికే బాధ్యతలు అప్పగించారు. ఇలా క్షేత్రంలో జరిగే పనుల్లో అధిక శాతం ఆయనకు అప్పగించడం వెనుక దేవస్థానం ఉన్నతాధికారుల ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ముగ్గురు అనర్హులు?
2013 మార్చిలో అప్పటి ఈఓ ఆజాద్ సమయంలో ఐదుగురు ఒప్పంద ఏఈఈలను తీసుకున్నారు. వారి మూడేళ్ల కాల పరిమితి ముగియడంతో కోర్టును ఆశ్రయించారు. దేవస్థానంలో ఏఈఈలుగా అవసరం ఉంటే వారికి ప్రా«ధాన్యత కల్పించాలని కోర్టు సూచించినా దేవదాయ శాఖ పట్టించుకోలేదు. 2017 మార్చి నెలల్లో భవన్‌కుమార్, రాజారామ్, ప్రణయ్, విష్ణుబాబు, ఆనంద్, సురేష్‌రెడ్డి, మహేశ్వరరెడ్డి, ప్రవళికను కాంట్రాక్ట్ పద్ధతిపై ఐదేళ్ల కాల పరిమితితో తీసుకున్నారు. కాగా వీరిలో ముగ్గురు పరీక్షలో ఉత్తీర్ణత కాకపోయినా రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు విధుల్లోకి తీసుకున్నట్లు సమాచారం.
పనులపై పర్యవేక్షణ తప్పనిసరి
శ్రీశైల క్షేత్రపరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై పర్యవేక్షణ ఉంది. పనుల్లో నాణ్యత ఉండేలా చూస్తున్నాం. దేవస్థానం పరిధిలో 8 మంది ఏఈఈలు, ఇద్దరు డీఈలు, ఈఈ రామిరెడ్డి పర్యవేక్షణలో పనులు సాగుతున్నాయి. ఒక ఏఈఈకి రూ.100 కోట్ల పనులు అప్పగించడం పై స్థాయి అధికారుల నిర్ణయం మేరకే జరిగింది. – శ్రీనివాసరెడ్డి, డీఈ, శ్రీశైల దేవస్థానం
Comments
Please login to add a commentAdd a comment