సత్తా చాటిన విశాఖ జట్లు | Capabilities teams Visakhapatnam teams | Sakshi
Sakshi News home page

సత్తా చాటిన విశాఖ జట్లు

Published Mon, Sep 22 2014 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 1:44 PM

సత్తా చాటిన విశాఖ జట్లు

సత్తా చాటిన విశాఖ జట్లు

  • ముగిసిన రాష్ట్ర అర్చరీ పోటీలు
  •  రాష్ర్ట జట్ల ఎంపిక
  • విశాఖపట్నం : రాష్ట్ర స్థాయి ఆర్చరీ (విలు విద్య) చాంపియన్‌షిప్‌లో విశాఖ జిల్లా జట్లు సత్తాచాటాయి. ఇండియన్ రౌండ్, ఒలింపిక్ రౌండ్లలో విశాఖ క్రీడాకారులు, రికర్వ్, కాంపౌండ్ రౌండ్లలో కృష్ణా జిల్లా జట్లు ప్రతిభ చూపాయి. మహిళా విభాగంలో తూర్పుగోదావరి, కడప, కర్నూలు, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి వచ్చిన 28 మంది క్రీడాకారిణులు తలపడగా రికర్వ్ రౌండ్‌లో ఎనిమిది మంది పాల్గొన్నారు.

    పురుషుల విభాగంలో అనంతపురం, ప్రకాశం, చిత్తూరు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల నుంచి అర్చర్లు తలపడ్డారు. ఎలిమినేషన్‌లో మూడు రౌండ్ల పాటు పోటీలు సాగాయి. ఒలింపిక్ రౌండ్‌లో ఎలిమినేషన్ పద్ధతిలో పురుషుల విభాగంలో సాగిన పోటీల్లో చివరి వరకూ నిలిచిన నలుగురూ విశాఖ క్రీడాకారులే కావడం గమనార్హం. దూరమే లక్ష్యంగా సాగిన పోటీలను 360 పాయింట్లకు నిర్వహించి అత్యధిక పాయింట్లు సాధించిన తొలి నలుగుర్ని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. ఎలిమినేషన్‌లో విజేతకు తొలి ర్యాంక్ ఇవ్వగా మొత్తంగా నలుగుర్ని జట్టుకు ఎంపిక చేశారు.

    రికర్వ్‌లో నాగబాబుపై ధీరజ్, కొండలరావుపై రఘనాథ్, సుధాకర్‌పై రామ్‌చంద్ర, శ్రీసత్యపై రాజీవ్ విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్నారు. విజేతగా నిలిచిన ధీరజ్ స్వర్ణాన్ని అందుకోగా, రామచంద్ర రజతాన్ని, రాజీవ్ కాంస్యాన్ని సాధించారు. నాలుగో స్థానంలో నిలిచిన రఘు రాష్ట్ర జట్టుకు అర్హత సాధిం చాడు. కాంపౌండ్‌లో విజేత నవీన్‌కుమార్ స్వర్ణాన్ని అందుకోగా, ఫణిభూషణ్ రజతం సాధించాడు. ఇండియన్ రౌండ్‌లో డి.సంతోష్‌పై బైరాగి నాయుడు, ఖాదిర్‌పై ఎస్.సంతోష్, పిచ్చయ్యపై రమేష్, శివపై రాజబాబు సత్తాచాటి సెమీస్‌కు చేరుకున్నారు.

    జాతీయ రికార్డు సాధించిన బైరాగి నాయుడు స్వర్ణాన్ని అందుకోగా రాజబాబు రజతం, రమేష్ కాంస్యం అందుకున్నారు. నాలుగో స్థానంలో సంతోష్ నిలిచాడు. ది ఒలింపిక్ సంఘం విశాఖ, జిల్లా ఆర్చరీ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఏయూ గోల్డెన్ జూబ్లీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఏపీ స్టేట్ సీనియర్స్ తొలి అంతర జిల్లాల ఆర్చరీ పోటీలను ఏయూ వీసీ జి.ఎస్.ఎన్.రాజు ఆదివారం ప్రారంభించారు. పోటీల ప్రారంభ కార్యక్రమంలో విశాఖ సంఘం అధ్యక్షుడు టి.ఎస్.ఆర్.ప్రసాద్, కార్యదర్శి ఎం.శ్యాంబాబు, రాష్ట్ర అర్చరీ సంఘం కార్యదర్శి సిహెచ్.సత్యనారాయణ, జిల్లా ఆర్చరీ సంఘం కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

    పోటీల ముగింపు కార్యక్రమంలో ఏయూ రిజిస్ట్రార్ రామ్మోహన రావు విజేతలకు మెడల్స్ అందించారు. రికర్వ్, కాంపౌండ్, ఇండియన్ రౌండ్లలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన క్రీడాకారుల్ని ర్యాంక్‌ల వారీగా రాష్ట్ర జట్టుకు మహిళా, పురుషుల విభాగాల్లో ఎంపిక చేశారు. కాంపౌడ్ రౌండ్‌లో పర్వేషా షిండేకు రాష్ట్ర జట్టుకు నేరుగా అర్హత కల్పించారు. ప్రస్తుతం ఆమె ఆసియన్ గేమ్స్‌లో పాల్గొంటున్నందున ఈ పోటీల్లో హాజరుకాలేకపోయింది.
     
    ఆర్చరీలో మహిళా విజేతలు

    ఏపీ స్టేట్ అంతర జిల్లాల అర్చరీ చాంపియన్‌షిప్‌లో గీతిక, హరిత, వినీల విజేతలుగా నిలిచారు. కాంపౌండ్, రికర్వ్ రౌండ్లలో కృష్ణా జిల్లాకు చెందిన మహిళా ఆర్చర్లు రాణించగా ఇండియన్ రౌండ్‌లో విశాఖ ఆర్చర్లు ప్రతిభ చూపారు. కాంపౌండ్‌లో గీతిక లక్ష్మి, వై.అనూష, కె.జోత్స్న, ఇండియన్ రౌండ్‌లో జయ వినీల, వర్షాదాస్, వి.గాయత్రి  తొలి మూడు స్థానాల్లో నిలిచారు. రికర్వ్‌లో హరిత, నీలిమ తొలి రెండు స్థానాలు సాధించారు.  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement