కామవరపుకోటలో కొట్లాడుకుంటున్న టీడీపీ శ్రేణులు
రాష్ట్ర వ్యాప్తంగా కూటమిలో ప్రకంపనలు
కార్యకర్తల సమావేశంలో భావోద్వేగానికి గురైన బండారు
లాబీయింగ్‌కే టికెట్ అంటూ కిమిడి నాగార్జున కంటతడి
గిరిజనులంటే చంద్రబాబుకు చిన్నచూపన్న గిడ్డి ఈశ్వరి
అవినీతి గంటాకు భీమిలి టికెట్ ఇచ్చారని కోరాడ ధ్వజం
కామవరపుకోటలో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
టీడీపీ నమ్మకద్రోహంపై మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆవేదన
పరవాడ/చీపురుపల్లి/పాడేరు/కామవరపుకోట/తిరుపతి తుడా: విపక్ష కూటమిలో ఏర్పడిన నిరసన జ్వాలలు రాష్ట్రవ్యాప్తంగా ఎగిపిపడుతూనే ఉన్నాయి. ఐదేళ్లపాటు డబ్బు ఖర్చు చేయించి తీరా టికెట్ కేటాయింపు వంతు వచ్చేసరికి డబ్బు మూటలతో దిగి, లాబియింగ్ చేసినవారికే కూటమిలో టికెట్ కేటాయిస్తున్నారంటూ టీడీపీపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారాలు చేస్తూ ఇంట్లో కూర్చున్నవారికి టికెట్ ఇస్తున్నారని, కనీసం పార్టీ సభ్యత్వం లేని వ్యక్తులకు టికెట్‌లు కేటాయిస్తున్నారని తూర్పారబడుతున్నారు.
టీడీపీ తనకు తీరని అన్యాయం చేసిందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి భావోద్వేగానికి లోనయ్యారు. వెన్నలపాలెంలో బండారు స్వగృహంలో శనివారం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ తాను ఏ పాపం చేశానని టికెట్ కేటాయించలేదని ప్రశ్నించారు. కార్యకర్తల నిర్ణయం మేరకే తన భవిష్యత్తు ప్రయాణం ఉంటుందని చెప్పారు. నమ్మిన కార్యకర్తలకు అన్యాయం జరిగితే అండగా నిలుస్తానని బండారు వారికి హామీ ఇచ్చారు. దీంతో కార్యకర్తలు స్పందిస్తూ మీ బాటలోనే మేం కూడా నడుస్తామని స్పష్టం చేశారు.
ఐదేళ్ల పాటూ పార్టీకి దూరంగా ఉంటూ లాబీయింగ్ చేసుకుంటే టికెట్లు వచ్చే పరిస్థితి టీడీపీలో ఉన్నదని విజయనగరం జిల్లా చీపురుపల్లి టీడీపీ నాయకుడు కిమిడి నాగార్జున కంటతడి పెట్టుకున్నారు. చదువుకున్నప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకున్నా గానీ.. వచ్చాక తెలిసింది నమ్మించి గొంతు కోస్తారని, యువత రాజకీయాల్లోకి రావద్దని, పొరపాటున వస్తే జీవితాలను చంద్రబాబు చిదిమేస్తారని విమర్శించారు. ఆయన ఇంటి ముందు టీడీపీ భవిష్యత్‌కు గ్యారెంటీ, సూపర్ సిక్స్ కరపత్రాలను పార్టీ కార్యకర్తలు తగలబెట్టారు.
నిరసన వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి మణికుమారి తదితరులు
చెడు సంప్రదాయాలకు టీడీపీ తెరతీసింది: కోరాడ రాజబాబు ధ్వజం
చంద్రబాబు చెడు సంప్రదాయానికి తెరతీసి అవినీతి అనకొండ గంటా శ్రీనివాసరావుకు భీమిలి టికెట్ ఇచ్చారని కోరాడ రాజబాబు ధ్వజమెత్తారు. శనివారం ఆనందపురంలోని తన నివాసంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. పార్టీని పట్టించుకోకుండా వ్యాపారాలు చేసుకున్న గంటాకు టికెట్ ఇవ్వడం ఏమి సంప్రదాయమని ప్రశ్నించారు. వే లంలో టికెట్లు అమ్ముకోవాలనుకుంటే చంద్రబాబు ఒక రేటు పెడితే తాను కూడా టికెట్ కొనుక్కునేవాడినన్నారు.
మూడు రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ తెలియచేస్తానన్నారు. పాడేరు టీడీపీ అభ్యర్ధి కిల్లు వెంకట రమేష్‌నాయుడు ఓటమే ధ్యేయంగా పనిచేస్తామని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి స్పష్టం చేశారు. మూడు నెలల క్రితం పార్టీ కండువా కప్పుకున్న వ్యక్తికి టికెట్ ఎలా కేటాయిస్తారని గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. గిరిజనులంటే చంద్రబాబుకు ఎందుకంత చిన్న చూపని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు పాడేరు, కొయ్యూరులో చంద్రబాబు ఫ్లెక్సీలు, కరపత్రాలకు నిప్పంటించి నిరసన తెలిపాయి. మాజీ మంత్రి మణికుమారి డబ్బులు కోసం ప్రస్తావిస్తూ తన అభ్యర్థిత్వాన్ని ఈ ఎన్నికల్లో పరిశీలించాలని టీడీపీ పెద్దలను కోరానని, అయితే డబ్బు ఎంత ఖర్చు పెట్టగలవు అన్ని ప్రశ్నిస్తే డబ్బుతో తూగలేక ఈసారికి డ్రాప్ అవుతానని చెప్పానన్నారు.
కె.కోటలో కుమ్ములాటలు
ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలో టీడీపీ నాయకుల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. చింతలపూడి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ మండలంలో ఆ పార్టీ కార్యాలయ ప్రారంభానికి వచ్చిన సందర్భంగా గంటా మురళికి పార్టీలోని మరో వర్గానికి మధ్య వివాదం వచ్చింది. అప్పటికే రగిలిపోతున్న ఆ వర్గం గంటా మురళిపై దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.
గతంలో ఇక్కడ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కొత్తూరులో ఏర్పాటుచేసిన టీడీపీ జిల్లా నాయకుల సమావేశంలోనూ ఈ రెండు వర్గాలూ ఇదేవిధంగా కొట్లాటకు దిగాయి. పొత్తులో భాగంగా తిరుపతి ఎమ్మెల్యే స్థానాన్ని జనసేనకు, తిరుపతి పార్లమెంట్ స్థానాన్ని బీజేపీకి కట్టబెట్టడంతో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ విలేఖరుల సమావేశంలో కంటతడి పెట్టుకున్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి బయటకు తోసేసిన వ్యక్తులను కూటమి అభ్యర్థులుగా ప్రకటించడాన్ని తప్పుబడుతూ ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు టీడీపీ నాయకుల తన గొంతుగోశారని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment