సాక్షి, విజయవాడ : రెండు జిల్లాల అభివృద్ధిలో 36 ఏళ్లపాటు ముఖ్యభూమిక పోషించిన విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ (వీజీటీఎం ఉడా) ప్రస్థానం ముగిసింది. ఉడా స్థానంలో క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ) పనిచేస్తుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ను మంగళవారం ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఉడా కథ ముగిసినట్లే. కేవలం నూతన రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన సీఆర్‌డీఏ ఉడా స్థానంలో ఏర్పాటైంది. ప్రభుత్వం జారీచేసిన జీవోలో ఉడా సరిహద్దుల్ని పెంచుతూ సీఆర్‌డీఏ పరిధిగా ప్రకటించారు. ప్రస్తుతం ఉడా చైర్మన్‌గా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేత వణుకూరి శ్రీనివాసరెడ్డి పదవి నుంచి మంగళవారం తప్పుకొన్నారు.
వీజీటీఎం ఉడాకు ఘనమైన చరిత్ర ఉంది. 1975 మున్సిపల్ చట్టం ప్రకారం 1978లో ఆవిర్భవించింది. అప్పట్లో కేవలం విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి పట్టణాలకే ఉడా కార్యకలాపాలు పరిమితమయ్యాయి. కాలక్రమేణా విజయవాడ, గుంటూరు నగరాలుగా మారడంతోపాటు గత ఏడాదే ఉడా పరిధి భారీగా పెరిగింది. తొలుత సుమారు 1,670 చదరపు కిలోమీటర్ల పరిధికే పరిమితమై ఉన్న ఉడా 2012లో 7,068 చదరపు కిలోమీటర్ల పరిధిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఉడాలో 10 మున్సిపాలిటీలు, 1520కి పైగా గ్రామాలు ఉన్నాయి.
పట్టణాభివృద్ధిలో కీలకపాత్ర
ప్రధానంగా విజయవాడ, గుంటూరు నగరాల్లో ఇన్నర్, అవుటర్ రింగ్‌రోడ్ల నిర్మాణం చేపట్టింది. ఉడా పరిధిలోని నగరాలు, పట్టణాల్లో పలు పార్కుల ఆధునీకరణ, వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణం చేపట్టింది. మంగళగిరి మండలం నువులూరులో 390.38 ఎకరాల భూమిని కొనుగోలు చేసి 2000లో అమరావతి టౌన్‌షిప్ పేరుతో భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు చేసింది. అమరావతి టౌన్‌షిప్ మినహా 162.81 ఎకరాల భూమి ప్రసుత్తం ఉడా ఆధీనంలో ఉంది. ఉడా ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.500 కోట్లు పైనే ఉంటాయి. సుమారు రూ.160 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. వీటి ద్వారా నెలకు రూ.12 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు వడ్డీ వస్తుంది. స్థిరాస్తులు కూడా బాగానే ఉన్నాయి. ఉడాకు ఇప్పటి వరకు 12 మంది చైర్మన్లుగా పనిచేశారు. మొదటి చైర్మన్ వి.నాగభూషణం కాగా, చివరిగా వణుకూరి శ్రీనివాసరెడ్డి వ్యవహరించారు. శ్రీనివాసరెడ్డి 2013 జూలై 2న చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన 18 నెలలు పదవిలో కొనసాగారు. ఉడా రద్దు నేపథ్యంలో ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. తమ భవితను తేల్చాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవాలని నిర్ణయించారు.
సీఆర్‌డీఏ పరిధి ఇలా..
కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని రెండు నగరపాలక సంస్థలు, పది మున్సిపాలిటీలు, 58 మండలాలు సీఆర్‌డీఏ పరిధిలో ఉంటాయి. ఉడాలో ఉన్నవాటితోపాటు నూతనంగా కృష్ణా జిల్లాలోని మొవ్వ, చల్లపల్లి, ఘంటసాల, పామర్రు, గుడ్లవల్లేరు, మోపిదేవి మండలాలు సీఆర్‌డీఏ పరిధిలోకి చేర్చారు. వీటితోపాటు గుంటూరు జిల్లాలోని వేమూరు, కొల్లూరు, అమృతలూరు, పెదకూరపాడు, ముప్పాళ్ల, అచ్చంపేట, క్రోసూరు మండలాలు పూర్తిగానూ, పెదనందిపాడు, నాదెండ్ల మండలాల్లో కొన్ని గ్రామాలు సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చాయి.
ముగిసిన ఉడా ప్రస్థానం
Published Wed, Dec 31 2014 2:51 AM | Last Updated on Tue, Aug 14 2018 3:30 PM
Advertisement