మద్యం షాపుల కోసం 80 దరఖాస్తులు
- మూడోరోజు బోణి
- 27 మధ్యాహ్నంతో ముగియనున్న గడువు
- నేడు, రేపు భారీగా దాఖలయ్యే అవకాశం
- 28న మచిలీపట్నంలో లాటరీ
సాక్షి, విజయవాడ : ఎట్టకేలకు మూడో రోజు జిల్లాలో బోణి అయింది. జిల్లాలోని వైన్‌షాపుల కేటాయింపుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ వెలువరించింది. జిల్లాలోని 326 వైన్‌షాపులకు దరఖాస్తులను స్వీకరించి లాటరీ ప్రకియ ద్వారా షాపులను కేటాయించనున్నారు. ఈ క్రమంలో ఈనెల 23న రాష్ట్ర ప్రభుత్వం నోటిపికేషన్ వెలువరించింది. 23 నుంచి 27 వరకు ఐదురోజులపాటు దరఖాస్తుల స్వీకరణ, 28న దరఖాస్తులు పరిశీలించి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన లాటరీ పద్ధతి ద్వారా షాపులను కేటాయించేలా షెడ్యూల్ ఖరారు చేశారు.
ఈ క్రమంలో మొదటి రెండు రోజులు మంచివి కాదనే కారణంతో వ్యాపారులు దరఖాస్తులు దాఖలు చేయలేదు. మూడో రోజు మంచి రోజు కావటంతో కాస్త బోణి అయినట్లుగా 80 దరఖాస్తులందాయి. జిల్లాలోని 25 ఎక్సైజ్ సర్కిళ్ల పరిధిలో 326 వైన్‌షాపులున్నాయి. ఈ క్రమంలో గుణదలలోని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో సర్కిళ్ల వారీగా బాక్సులు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించారు.
అత్యధికంగా ఉయ్యూరు మున్సిపాలిటీలోని వైన్ షాపుల కోసం 20 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఇంకా రెండు రోజులు మాత్రమే గడువుండడంతో గురు, శుక్రవారాల్లో వేల దరఖాస్తులు దాఖలయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు వాటికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కార్యాలయం సిబ్బందితో పాటు సర్కిళ్లలో పనిచేసే సిబ్బందిని ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ విధుల్లో నిమగ్నం చేశారు. గత వార్షిక సంవత్సరంలో జిల్లాలో 44 వైన్‌షాపులు ఖాళీలుగా మిగిలాయి. 30 వరకు పాత లెసైన్సు కాలపరిమితి ఉంది. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.