34 ప్రభుత్వ మద్యం దుకాణాలు!
- మూడో గజిట్‌లోనూ స్పందన నిల్
- ఆగస్టు మొదటి వారానికల్లా షాపుల ఏర్పాటు
- ఇప్పటికే రెండు దుకాణాల్లో మొదలైన విక్రయాలు
- బేవరేజెస్ నేతృత్వంలోని షాపుల నిర్వహణ
సాక్షి, విజయవాడ : జిల్లాలో ప్రభుత్వ మద్యం షాపులు ఏర్పాటు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో లాటరీ ప్రక్రియకు స్పందన రాని ప్రాంతాల్లో నేరుగా ప్రభుత్వమే షాపులు ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు సాగించాలని నిర్ణయించింది. తద్వారా ఆదాయం పెంపే ప్రధాన ఏజెండాగా ఎక్సైజ్‌శాఖ ముందుకు సాగుతోంది. జిల్లాలో 34 వైన్‌షాపులు ఖాళీలున్నాయి. వాటి స్థానంలో 34 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వచ్చే నెల మొదటి వారం కల్లా షాపుల ఏర్పాటు పనులు దాదాపుగా పూర్తయ్యే అవకాశం ఉంది.
జిల్లాలో ఇప్పటి వరకు మూడు గజిట్ల ద్వారా 301 వైన్‌షాపులను ఎక్సైజ్‌శాఖ వ్యాపారులకు కేటాయించింది. మిగిలిన 34 షాపుల కేటాయింపులకు సంబంధించి మూడో గజిట్‌ను ఈనెల 11వతేదీన జారీ చేశారు. మూడో గజిట్ ఈనెల 17తో ముగిసింది. అయితే మూడో గజిట్‌కు స్పందన రాలేదు. దీంతో జిల్లా అధికారులు పరిస్థితిని ఎక్సైజ్ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు.
ఇప్పటికే ఈ విషయమై ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దృష్టి సారించారు. ఈక్రమంలో మూడు రోజుల కిత్రం కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎక్సైజ్‌శాఖ అధికారులు ప్రభుత్వ విక్రయాల వైపే మొగ్గు చూపారు. దీంతో ప్రభుత్వ షాపుల ఏర్పాటు కోసం అన్ని సిద్ధం చేసి కమిషనర్ అనుమతి కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు.
34 షాపులు ఇవే....
విజయవాడ డివిజన్లో 10 షాపులు ఖాళీ ఉన్నాయి. వాటి లెసైన్సు ప్రాంతాల్లో ప్రభుత్వ దుకాణాలు రానున్నాయి. అలాగే మచిలీపట్నం డివిజన్లో 24 షాపులు ఖాళీ ఉన్నాయి. విజయవాడ నగరంలోని 6,16,48 డివిజన్లలో, 14,15 డివిజన్లలో షాపులు ఖాళీగాఉన్నాయి. అలాగే యనమలకుదురు, గంగూరు, చోడవరం, మైలవరం పరిధిలోని గంగినేనిపాలెం, నందిగామ పరిధిలోని కోనాయపాలెం, జగ్గయ్యపేట పరిధిలోని కంభంపాడులో షాపులున్నాయి.
మచిలీపట్నం డివిజన్లో అవనిగడ్డలో ఒక షాపు, మొవ్వ మండలంలో రెండుషాపులు, గుడివాడలో నాలుగు షాపులు, కైకలూరులో ఏడు షాపులు, మండవల్లిలో నాలుగుషాపులు, గన్నవరంలో ఐదు షాపులు, ఉయ్యూరులో ఒక షాపు ఖాళీ ఉన్నాయి. వీటి స్థానంలో నూతన ప్రభుత్వ షాపులను ఏపీ బేవరేజెస్ ద్వారా నిర్వహించనున్నారు. పడమట ప్రాంతంలోని చోడవరం, గొల్లపూడి సమీపంలోని గుంటుపల్లిలో ఇప్పటికే ప్రభుత్వ మద్యం దుకాణాలు కొనసాగుతున్నాయి.