రైతు ఆత్మహత్యలు బాబు పుణ్యమే..
ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ముల్లా
17,18 తేదీల్లో అసెంబ్లీ వద్ద 36 గంటల ధర్నా
విజయవాడ(భవానీపురం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో వ్యవసాయం నిర్లక్ష్యానికి గురవుతోందని ఆలిండియా కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ హన్నన్‌ముల్లా అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు పుణ్యమేనన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 22 నెలల కాలంలో 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఆ రైతు కుటుంబాలకు రూ.10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గవర్నర్‌పేటలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ల్యాండ్ పూలింగ్, భూసేకరణ, భూసమీకరణ పేరుతో రాజధాని ప్రాంతంలో మూడు పంటలు పండే వ్యవసాయ భూములను లాక్కోవడం దారుణమన్నారు. రూ.87,500 కోట్ల రైతు రుణమాఫీ చేయాల్సి ఉండగా కేవలం రూ.7,400 కోట్లు మాత్రమే ప్రభుత్వం బ్యాంక్‌లో జమ చేసిందన్నారు. ఈ కాలంలో రైతులపై రూ.18 వేల కోట్ల వడ్డీ భారం పడిందని వివరించారు. ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచి వారికి రోజుకు రూ.300 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 17,18 తేదీల్లో అసెంబ్లీ వద్ద 36 గంటలపాటు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బీ బలరాం, ప్రధాన కార్యదర్శి వంగల సుబ్బారావు పాల్గొన్నారు.