భూ సమీకరణను వ్యతిరేకిస్తున్న రాజధాని ప్రాంత రైతులు తమ ఆందోళనను ఢిల్లీ స్థాయిలోనూ తెలియజేయాలని నిర్ణయించుకున్నారు.
సాక్షి, హైదరాబాద్: భూ సమీకరణను వ్యతిరేకిస్తున్న రాజధాని ప్రాంత రైతులు తమ ఆందోళనను ఢిల్లీ స్థాయిలోనూ తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ను కలిసి తమ గోడు వినిపించనున్నారు. భూ సేకరణ చ ట్టంలో సవరణలకు వ్యతిరేకంగా ఈ నెల 23, 24 తేదీల్లో అన్నా హజారే ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో రెండురోజుల పాటు నిరాహార దీక్ష చేయనున్నారు. దీంతో ఆ రోజుల్లో ఢిల్లీ వెళ్లి అన్నా హజారేను కలవాలని రాజధాని నిర్మాణం వల్ల భూములు కోల్పోతున్న రైతులు నిర్ణయించారు. దాదాపు 15 మంది రైతులు, రైతు కూలీలు ఈ నెల 21న విజయవాడ నుంచి రైలులో బయలుదేరి ఢిల్లీ వెళుతున్నారు. వారిలో కారుమంచి ఇంద్రనీల్, శ్రీనాథ్ చౌదరి, గద్దె శేఖర్, పాల్, జార్జి, బుజ్జి తదితరులున్నారు. మూడు పంటలు పండే తమ భూమిని బలవంతంగా లాగేసుకునేందుకు ప్రభుత్వం ఎలా ప్రయత్నిస్తోందో అన్నా హజారేకు సవివరంగా తెలియజేసేందుకు వీరు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఒకటి తయారు చేశారు. తమవి ఎంతటి సారవంతమైన భూములో, ఎలాంటి పంటలు పండుతాయో తెలిపేందుకు.. ఆ భూములన్నింటినీ వీడియో తీయించి ఓ షార్ట్ ఫిల్మ్‌ను కూడా రైతులు రూపొందించారు. ఇలావుండగా వీరు తమ సమస్యను అన్ని పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలకు సైతం వివరించనున్నారు. ఈ మేరకు అపాయింట్‌మెంట్లను కూడా ఇప్పటికే కోరారు.