
స్టీల్‌ప్లాంట్‌కు క్యాప్టివ్ విద్యుత్ షాక్
యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్‌కు వరుస కష్టాలు తప్పడం లేదు. ట్రాన్స్‌కో రెండో లైను పునరుద్ధరించిన ఆనందం కొన్ని గంటలకే ఆవిరైంది. వివరాలిలా..తుపాను తర్వాత సోమవారం సాయంత్రం ట్రాన్స్‌కో రెండో లైను ద్వారా విద్యుత్ సరఫరా ప్రారంభమైంది. సుమారు 100 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌కు అందుబాటులోకి వచ్చింది. దీంతో ప్రధాన ఉత్పత్తి విభాగాల పనులు వేగవంతం చేయాలని యోచిస్తు న్న తరుణంలో రాత్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు నీటిని సరఫరా చేసే పంప్ హౌస్-4లోని రిలీవింగ్ వాల్వ్ పేలింది.
దీంతో క్యాప్టివ్ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. వెయ్యి మిల్లీ మీటర్ల వ్యాసం కలిగిన 6 పైపులు ఒక్కొక్కటి గంటకు 11వేల క్యూబిక్ మీటర్ల నీటిని విడుదల చేయడంతో కేవలం 20నిమిషాల్లో పంప్‌హౌస్‌లో సుమారు 10 అడుగుల ఎత్తులో నీరుచేరింది. దీంతో పంప్‌హౌస్‌లో ఉన్న 1350కెవి మోటార్లు పది, 780కెవి మోటార్లు నాలుగు మునిగిపోయాయి. వెంటనే నీటిని రాకుండా, ఉన్న నీటిని తొలగించే పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. మోటార్లను హీటింగ్ పనులు నిర్వహిస్తున్నారు. నిరంతరం పనులు కొనసాగుతున్నప్పటికీ మరో రెండు రోజుల వరకు పూర్తిస్థాయి విద్యుత్ చేసే పరిస్ధితులు కనిపించడం లేదు. మరమ్మతు పనులను సీఎండీ మధుసూదన్, డెరైక్టర్(ఆపరేషన్స్) డి.ఎన్.రావులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.