భాకరాపేట(చిత్తూరు): చిత్తూరు జిల్లా యర్రావారిపాళెం మండలం తలకోన అటవీ ప్రాంతంలో రూ.కోటి విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిదిమంది స్మగ్లర్లును అరెస్టు చేసినట్లు పీలేరు రూరల్ సీఐ ఎం.మహేశ్వర్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం సాయంత్రం ఎర్రావారిపాళెం, రొంపిచెర్ల, కేవీపల్లె ఎస్‌ఐలు నరేంద్ర, రహీముల్లా, సుమన్, భాకరాపేట ఏఎస్‌ఐ వేణుగోపాల్‌రెడ్డి, సిబ్బందితో కలిసి తలకోన అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. అటవీ సరిహద్దు ప్రాంతమైన చిన్నరామాపురం సమీపంలోని మంగమ్మ చెరువు వద్ద ఎర్రచందనం దుంగలను తరలించేందుకు సిద్ధం చేస్తుండగా స్మగర్లపై దాడులు చేశారు. ఈ దాడుల్లో రెండు ద్విచక్రవాహనాలు, హోండా కారుతో పాటు టన్ను బరువు గల 37 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దుంగల విలువ రూ.కోటి, వాహనాల విలువ రూ.2లక్షలని సీఐ చెప్పారు. జిల్లాకు చెందిన స్మగ్లర్లు ఎల్.వాసుదేవప్రసాద్, డి.ముత్తుకుమార్, ఎం.ఆంజనేయులు, కె.దొరబాబు, వి.శ్రీనివాసులు, పి.బోయకొండ, కె.చెంచయ్య, డి. వెంకటయ్యలను అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ప్రధాన అనుచరులు పరారయ్యారు.