అనంతపురం: అనంతపురం జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి నలుగురి మృతిచెందారు. మరో ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. మన్నీల వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
అనంతపురం నుంచి ధర్మవరం వెళ్తున్న కారు... ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ధర్మవరంలోని పీఆర్‌టీ కాలనీకి చెందిన బిక్కేశ్వరరావు, అతడి చిన్నాన్న పామిశెట్టి గోపాల్, శ్రీనివాసులు ఆదివారం ఉదయం అనంతపురంలో వివాహానికి హాజరై తిరుగు ప్రయాణమయ్యారు. మన్నీల క్రాస్ వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ఆ కారు డ్రైవర్ భాస్కర్తో పాటు ముగ్గురూ మృతి చెందారు.
ఇదే ఘటనలో బాలవెంకటరెడ్డి, ఆయన కుమారుడు ఆనంద్‌రెడ్డి, మనమళ్లు వరుణ్‌కుమార్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలు గాయపడ్డారు. వీరు పీర్ల పండగ కోసం ధర్మవరం నుంచి వెళ్తుండగా..ప్రమాదం జరిగింది. మృతుల్లో గోపాల్ మగ్గం నేస్తుండేవాడు. బిక్కేశ్వరరావు, శ్రీనివాసులు చీరల వ్యాపారం చేసేవారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.