
సాక్షి, అమరావతి బ్యూరో: ఓ వైపు సోషల్ మీడియాపై సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ వైఫల్యాలపై సాక్ష్యాలతో సహా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై కత్తికడుతూ వస్తోంది. అక్రమ కేసులు బనాయిస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేస్తోంది. మరోవైపు సోషల్ మీడియా సమ్మిట్ అవార్డుల పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం ప్రచారార్భాటానికి తెరలేపింది. అధికార పార్టీ నేతలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు.. ప్రతిపక్షానికి చెందిన సానుభూతిపరులపై ఫిర్యాదులొస్తే ఆగమేఘాల మీద స్పందించి అరెస్ట్‌లు చేస్తున్నారు. సోషల్ మీడియాపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న అణచివేతపై నెటిజన్లు మండిపడుతున్నారు.
అడుగడుగునా ఉక్కుపాదం: వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంపై తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ని విమర్శిస్తూ నెల్లూరుకు చెందిన జెడ్ల అశోక్‌గౌడ్, అలీ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టారు. దీనిపై టీడీపీ నేతలు ఫిర్యాదుచేయడంతో ఉయ్యూరు పోలీసులు ఐపీసీ సెక్షన్ 509 కింద కేసు నమోదుచేసి గురువారం అరెస్ట్ చేశారు.
అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు: ఫిరాయింపు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఫిర్యాదు మేరకు పామర్రు పట్టణం యాదవపురానికి చెందిన గొరిపర్తి నాగబాబును అక్టోబర్ 4న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు.
వాళ్లే టార్గెట్: కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన జి.శ్రీనివాస్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ఎండగడుతుంటారు. దీంతో టీడీపీ నేతలు.. తమ కార్యకర్త ద్వారా అతనిపై గుడివాడలో పోలీసులకు ఫిర్యాదు చేయించారు. శ్రీనివాసరెడ్డి ఓ జాతిని కించపరిచేలా పోస్ట్ చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో గుడివాడ పోలీసులు శ్రీనివాసరెడ్డిపై ఐపీసీ సెక్షన్ 153ఏ కింద కేసు నమోదుచేశారు.
నెల్లూరుకు చెందిన నవీన్‌కుమార్‌పై గుంటూరులో కేసు నమోదు: ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని నెల్లూరు జిల్లాకు చెందిన నవీన్‌కుమార్‌పై టీడీపీ నేత ఆర్.సాయికృష్ణ ఫిర్యాదు చేయడంతో మే 19న గుంటూరు అరండల్‌పేట పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదిన్నరలో వందల సంఖ్యలో అరెస్ట్‌లు చోటుచేసుకున్నాయి.
ఇంటూరు రవికిరణ్ అరెస్ట్‌తో ప్రారంభం: గతేడాది ఏప్రిల్‌లో ఇంటూరు రవికిరణ్ తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఫేస్‌బుక్‌లో పొలిటికల్ పంచ్ పేరుతో రవికిరణ్ ఓ పేజీని నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రభుత్వ వైఫల్యాలను సెటైరికల్‌గా ఆయన ఎత్తిచూపారు. దీన్ని ఓర్చుకోలేని టీడీపీ ప్రభుత్వం రవికిరణ్‌పై సెక్షన్ 67 ఆఫ్ ఐటీ యాక్ట్, ఐపీసీ సెక్షన్ 292 కింద కేసులు నమోదు చేసింది.
అవార్డుల పేరుతో ప్రచారార్భాటం: ఒకవైపు సామాజిక మాధ్యమాలపై ఉక్కుపాదం మోపుతూ మరోవైపు అదే సోషల్ మీడియాలో చురుగ్గా వ్యవహరించే నటీనటులకు అవార్డుల ప్రదానం పేరుతో టీడీపీ ప్రభుత్వం ప్రచారార్భాటాన్ని గతేడాది నుంచి ప్రారంభించింది. సోషల్ మీడియా సమ్మిట్ అవార్డ్స్ పేరుతో అవార్డులు అందిస్తూ వస్తోంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి అవార్డులను అందజేయడం లేదు. టీడీపీ ప్రభుత్వం దీన్ని ప్రచారానికి ఉపయోగించుకుంటూ.. ప్రజాధనాన్ని వృథా చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment