నగదు భయం | Cash fear | Sakshi
Sakshi News home page

నగదు భయం

Published Mon, Nov 10 2014 2:34 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

నగదు భయం - Sakshi

నగదు భయం

  • ఈనెల 15 నుంచి ‘నగదు బదిలీ’  పథకం అమలు చేయనున్న కేంద్రం
  •  జిల్లాలో ఇప్పటికీ పూర్తి కాని ఆధార్ సీడింగ్
  •  అనుసంధానిస్తే మరో 26,416 మందికి పింఛన్ కోతే!
  •  ఉపాధి హామీలోనూ అదే తీరు
  •  గ్యాస్ వినియోగదారుల్లో మరింత గుబులు
  •  36 కేంద్రాల్లో ఆధార్ నమోదు ప్రక్రియ
  •  నాడు వ్యతిరేకించి.. నేడు జై కొడుతున్న ‘బాబు’పై విమర్శలు
  • ‘అనంత’వాసులకు నగదు బదిలీ భయం పట్టుకుంటోంది. ఆధార్‌కూ నగదు బదిలీకి లంకె పెట్టడంతో వినియోగదారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రెండేళ్ల క్రితం నగదు బదిలీతో గొల్లుమన్న జిల్లా వాసులు...మళ్లీ ఆ పేరు వింటేనే బెంబేలెత్తుతున్నారు. మొన్నటి వరకూ ఈ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు.. సీఎం పీఠం చేజిక్కగానే జై కొడుతున్నారు. మొత్తానికి ఆధార్ నమోదు ప్రక్రియ పూర్తి కాకుండానే నగదు బదిలీని అమలు చేయడంపై జిల్లా వాసుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
     
    సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఆధార్‌కార్డులను ప్రాతిపదికగా చేసుకుని సంక్షేమ పథకాలకు నగదు బదిలీ పథకాన్ని వర్తింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపక్రమిస్తోంది. ఈ నెల 15 నుంచి నగదుబదిలీ పథకాన్ని నిక్కచ్చిగా అమలు చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. నగదు బదిలీ పథకం అమలులో ‘ఆధార్’ కీలకం కానుంది. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఆధార్ అనుసంధానం చేస్తేనే నగదుబదిలీ వర్తిస్తుంది. లేదంటే పథకం ఫలాలు దరిచేరడం కష్టమే! అయితే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మాత్రం కొద్దికాలం ఆధార్‌తో సంబంధం లేకుండానే నగదు బదిలీని అమలు చేస్తామని చెబుతున్నారు. వాస్తవానికి జైట్లీ చెప్పినంత సులువుగా ఆధార్ లేకుండా నగదుబదిలీ అమలు కావడం అసాధ్యం.
     
    బ్యాంకు అకౌంట్ కీలకం

    సంక్షేమ పథకాలకు సంబంధించి నగదు బదిలీ కావాలంటే లబ్ధిదారులకు బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి. ప్రభుత్వం ఇచ్చే సొమ్ము బ్యాంక్‌ఖాతాలో జమ అవుతుంది. అయితే బ్యాంకర్లు ‘ఆధార్’లేకుండా ఖాతా ప్రారంభించేందుకు ససేమిరా అంటున్నారు.  ఇదివరకే ఉన్న అకౌంట్లకు కూడా ఆధార్ నెంబరును పొందుపరచాలని సూచిస్తున్నారు. ఈ పరిణామాలతో ‘ఆధార్’ లేకుండా నగదుబదిలీ అమలు కష్టసాధ్యమని స్పష్టమవుతోంది. గ్యాస్, పింఛన్లు, ఉపాధిహామీ పథకం కూలీల్లో ‘నగదుబదిలీ’ భయం తీవ్రంగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 40.83లక్షలు. ఇందులో ఆధార్ నమోదు 98 శాతం పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. కానీ జిల్లాలో ఇప్పటి వరకూ 36.43లక్షల మందికి మాత్రమే ఆధార్‌కార్డులు అందాయి. ఈ లెక్కన మరో 4 లక్షల మందికిపైగా ఆధార్‌కార్డులు అందాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాలో 36 మీ సేవా కేంద్రాల ద్వారా ఆధార్ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది.
     
    లబ్దిదారుల్లో తీవ్ర ఆందోళన

    జిల్లాలో ఆధార్‌కార్డుల ప్రాతిపదికన తొలి విడతలో గ్యాస్, జననీ సురక్ష యోజన, ఉపాధిహామీ, ఉపకార వేతనాలు, సామాజిక పెన్షన్లకు నగదు బదిలీ పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత సంక్షేమ పథకాలన్నింటినీ ఇదే గొడుగు కిందకు తేవడానికి కసరత్తు చేస్తోంది.

    జిల్లాలో 5.77, 538 గ్యాస్ కనెక్షన్లు ఉండగా 5.01 లక్షల మందికి ఆధార్‌కార్డులు అందాయి. ఈ నెల 15వ తేది నుంచి సిలిండర్ కొనుగోలు చేయాలంటే సబ్సిడీతో కలిపి పూర్తి మొత్తం చెల్లించాలి. ఆధార్ నమోదు కాని వారికి చెల్లించిన డబ్బులు ఖాతాలో జమకావు. ఆధార్ అనుసంధానం అయిన కనెక్షన్లలో 2012లో ఒక్కో సిలెండర్‌పై రూ.170 తక్కువగా జమ అయింది. మళ్లీ ఇది పునరావృతమవుతుందనే భయం వినియోగదారుల్లో నెలకొంది.

    జిల్లాలో ఉపాధిహామీ పథకం కింద 8, 36,245 మంది జాబ్‌కార్డులు పొందారు. ఇందులో 7,07,345 లక్షల మందికి ఆధార్‌కార్డులు జారీచేశారు. తక్కిన వారికి ఇప్పటికీ ఆధార్‌కార్డులు పంపిణీ చేయలేదు.

    జిల్లాలో సామాజిక భద్రతా పింఛన్లు (వృద్ధాప్య, వికలాంగ, వితంతు తదితర) పెన్షన్ల కింద 4,08,648 మంది లబ్ధి పొందుతున్నారు. వీరిలో 21 వేల మందికి ఆధార్ నమోదు కాలేదు. వీరిందరికీ పింఛను సొమ్ము అందదు. ఇప్పటికే పింఛన్ల తనిఖీ ప్రక్రియలో ఆధార్‌లో పేరు తప్పుందని 21,777మంది పింఛన్లు తొలగించారు. అలాగే కార్డుల్లో స్త్రీలకు బదులు, పురుషులుగా లింగనమోదు జరిగిందని మరో 4,639 మందికి పింఛన్లు ఆపేశారు.

    మన జిల్లాలో 99,497 మంది విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉపకార వేతనాలు పొందుతున్నారు. ఇందులో ఇప్పటిదాకా 7 8,500 వేల మందికి ఆధార్‌కార్డులను పంపిణీ చేసి 41,300 వేల మందికి బ్యాంకు ఖాతాలు తెరిపించారు. తక్కిన వారికి ఎప్పటిలోగా ఆధార్‌కార్డులు పంపిణీ చేస్తారన్న అంశంపై అధికారులే స్పష్టమైన సమాధానాన్ని చెప్పలేకపోతున్నారు.
     
    కొత్త రాగం ఆలపిస్తున్న బాబు

    నగదు బదిలీ పథకాన్ని, దానికి ఆధార్‌ను అనుసంధానం చేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గతంలో తీవ్రంగా వ్యతిరేకించారు. డ్వాక్రా మిహ ళలకు తాను దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు ఇస్తే...కాంగ్రెస్ నేతలు వాటికి గ్యాస్ ఇవ్వడం చేతగాక ఇలా ఆధార్‌తో వేధిస్తున్నారని విమర్శించారు. నగదు బదిలీకి ఆధార్ అనుసంధానాన్ని ఆపాలి...అసలు నగదుబదిలీ పథకాన్నే ఎత్తేయాలని ‘అనంత’పాదయాత్రలో ప్రతీ పల్లెలోనూ చెప్పారు. తీరా సీఎం పీఠం దక్కాక...అనర్హులను తొలగించేందుకు నగదుబదిలీ అని కొత్తరాగం ఆలపిస్తున్నారు. నాడొకమాట...ఇప్పుడు మరో మాట వల్లెవేస్తున్న చంద్రబాబు తీరుపై ‘అనంత’వాసులు మండిపడుతున్నారు.
     
    లెక్క రాక నష్టపోరునా

    గతంలో గ్యాస్‌కు పూర్తి లెక్క చెల్లించినాం. నగదు బదిలీ కింద డబ్బులు తిరిగి వస్తాయన్నారు. కానీ నాకు ఒక్క రూపాయి రాలేదు. ఇలా గ్యాస్ కోసం రెండు సార్లు వెయ్యిరూపాయలపైన చెల్లించినా! లెక్క రాక రెండు సార్లు నష్టపోయినా! మల్లా నగదుబదిలీ అంటాండారు. ఏమీ వద్దూ...ఇది అమలు చేస్తే బాగా నష్టపోతాం
     -సావిత్రి, గృహిణి, శింగనమల
     
     ఇప్పడిస్తున్న ధరకే ఇవ్వండి
     నగదు బదిలీ ద్వారా కాకుండా ఇప్పుడు ఇస్తున్న మాదిరిగానే గ్యాస్ అందించాలి. నగదు బదిలీ పెడితే నష్టపోతాం. గతంలో అమలు చేసినప్పుడు బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు పడతాయని చెప్పారు. కాని సరిగా డబ్బులు పడేవికావు. ఇప్పుడు ఇస్తున్న ధరకే గ్యాస్ ఇవ్వాలి.   
     - శ్రీలక్ష్మి, గృహిణి, శింగనమల
     
     చాలా మోసపోయాం  
     గ్యాస్‌కు నగదు బదిలీ పథకం ద్వారా చాలా మోసపోయాం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నగదు బదిలీ కింద గ్యాస్ సిలిండర్ దాదాపు రూ.1200కు కొనుగోలు చేస్తే సబ్సిడీ మొత్తం మా బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. ఇలా చాలాసార్లు జరిగింది.
     - ఎర్రమ్మ, గృహిణి గుంతకల్లు
     
     ఇబ్బంది పడతాం
     ప్రస్తుతం అందజేస్తున్న విధంగానే గ్యాస్ సిలిండర్లకు సబ్సిడీని ప్రభుత్వమే భరించి సామాన్య ధరలకు సిలిండర్లు విక్రయించాలి. రూ. 1200లు చెల్లించి గ్యాస్ సిలిండర్ కొంటే సబ్సిడీ మొత్తం అస్సలు రాలేదు. ఇలా వేలాది రూపాయలు నష్టపోయాం. మళ్లీ గ్యాస్‌కు నగదు బదిలీ అంటే ఇబ్బందులు పడుతాం.
     -కమలమ్మ, గృహిణి, గుంతకల్లు
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement