ఆధార్ ఇవ్వకపోతే, 'అకౌంట్' క్లోజ్ | Aadhaar mandatory for opening bank account, financial transactions of Rs 50,000 and above | Sakshi
Sakshi News home page

ఆధార్ ఇవ్వకపోతే, 'అకౌంట్' క్లోజ్

Published Sat, Jun 17 2017 2:31 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

ఆధార్ ఇవ్వకపోతే, 'అకౌంట్' క్లోజ్ - Sakshi

ఆధార్ ఇవ్వకపోతే, 'అకౌంట్' క్లోజ్

బ్యాంకు ఖాతాకు ఆధార్‌ తప్పనిసరి
రూ.50,000, ఆపైబడిన లావాదేవీలకూ ఉండాల్సిందే
 
న్యూఢిల్లీ: కొత్త బ్యాంకు ఖాతాకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మేరకు కేంద్ర రెవిన్యూ శాఖ తాజాగా నోటిఫికేషన్‌ విడుదలచేసింది. బ్యాంకులో కొత్త ఖాతా తెరవాలంటే ఇకపై ఖచ్చితంగా ఆధార్‌ నంబర్‌ను తెలపాలి. అంతేకాకుండా రూ.50,000, అంతకు మించిన మొత్తాల లావాదేవీలకు సైతం ఆధార్‌ నంబర్‌ను తప్పనిసరి చేస్తూ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఇప్పటికే బ్యాంకు ఖాతా ఉన్న వినియోగదారులు ఈ ఏడాది డిసెంబర్‌ 31లోగా తమ ఆధార్‌ నంబర్‌ను తెలపాల్సి ఉంటుంది. అలా నంబర్‌ ఇవ్వని పక్షంలో సంబంధిత ఖాతాల లావాదేవీలను స్తంభింపజేస్తామని నోటిఫికేషన్‌లో స్పష్టంచేశారు.

వేర్వేరు పాన్‌ నంబర్ల సాయంతో కొందరు పన్నులను ఎగవేస్తున్న నేపథ్యంలో ప్రతీ పాన్‌ నంబర్‌తోపాటు ఆధార్‌ నంబర్‌నూ జతచేయాలని గతంలోనే ప్రభుత్వం సూచించింది. వ్యక్తులు, సంస్థలు, ఉమ్మడి వ్యాపార సంస్థలు పాన్‌ లేదా ఫారమ్‌ 60తోపాటు ఆధార్‌ నంబర్‌ ఇవ్వాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. సరైన కేవైసీ పత్రాలు లేకుండా కొత్త చిన్న మొత్తాల ఖాతా తెరవాలంటే గరిష్టంగా రూ.50,000 మాత్రమే డిపాజిట్‌ చేయాలని సూచించారు. ప్రధాన బ్యాంకుల శాఖల్లోనే ఇలాంటి ఖాతాలను తెరవాలని కొత్త నిబంధన పెట్టారు. ఏడాదిలోపు ఆయా ఖాతాకు సంబంధించిన కేవైసీ పత్రాలను ఖచ్చితంగా జతపరచాల్సి ఉంటుంది. కొత్తగా ఖాతా తెరిచే వ్యక్తి ఆధార్‌ నంబర్‌ లేకపోతే, ఆధార్‌ కోసం ఎన్‌రోల్‌ చేసుకున్న నంబర్‌ను తెలపాలి. ఆరు నెలల్లోపు ఆధార్‌ నంబర్‌ను బ్యాంకు శాఖకు అందజేయాలి. ఆయా ఖాతాల నెలవారీ, వార్షిక లావాదేవీలను, ఖాతాలోకి నగదు జమాలపై బ్యాంకుల ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement