బ్యాంకుల్లో వేస్తేనే తెల్లధనం కాదు
న్యూఢిల్లీ: కేవలం నల్లధనాన్ని బ్యాంకు ఖాతాల్లో వేసినంత మాత్రాన అది తెల్లధనం అయిపోదనీ, దానిపై పన్ను కట్టాల్సిందేనని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి సమావేశం శనివారం జరిగింది. అనంతరం జైట్లీ విలేకరులతో మాట్లాడారు. నగదు కోసం ప్రజల కష్టాల గురించి పాత్రికేయులు ప్రశ్నించగా ‘రూ.500 నోట్ల సరఫరాను రిజర్వు బ్యాంకు పెంచింది. త్వరలోనే ఇబ్బందులు తగ్గుతారుు’ అని అన్నారు. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ (ఎఫ్‌ఆర్‌బీఎం) నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని అనేక రాష్ట్రాలు కోరినట్లు జైట్లీ చెప్పారు. నోట్ల ఉపసంహరణ గురించి కూడా రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో చర్చించినట్లు తెలిపారు.
జీఎస్టీపై కుదరని ఏకాభిప్రాయం
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ)పై ప్రతిష్టంభన ఇంకా తొలగలేదు. నెల రోజుల్లో శనివారం మూడోసారి భేటీ అయిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం పన్ను మదింపుపై ఎలాంటి నిర్ణయానికి రాకుండానే ముగిసింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏయే పన్నులు, ఎంత మొత్తాల్లో రాష్ట్రాలు, కేంద్రం నియంత్రణలో ఉండాలన్నదానిపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ నెల 11, 12 తేదీల్లో మరోసారి భేటీ కానున్నారు.