‘రాష్ట్రం పరువు తీశారు. లంచం కేసులో అడ్డంగా దొరికిపోయి రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా చిత్రీకరిస్తున్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చేందుకు తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారు. నీతులు వల్లించే టీడీపీ అధినేత అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయి, దాని నుంచి బయటపడలేక ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపైనా, మీడియాపైనా అక్కసు వెళ్లగక్కుతున్నారు. ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో కీలక సూత్రధారైన చంద్రబాబు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి. ఆ ఘటనపై సీబీఐ విచారణ జరిపించి, బాబును అరెస్ట్ చేయాలి’ అంటూ వైఎస్‌ఆర్ సీపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రజా మద్దతుతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ర్యాలీలు, రాస్తారోకోలు, బైఠాయింపు, మానవహారం, ధర్నాలతో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా పోలీసులు 206 మంది నేతలను అరెస్టు చేశారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఎండను సైతం లెక్క చేయకుండా జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు చంద్రబాబుకు వ్యతిరేకంగా మంగళవారం గంటలు తరబడి నిరసన తెలియజేశారు. సీఎం చంద్రబాబు డౌన్‌డౌన్... టీడీపీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి... అవినీతి సీఎంను అరెస్టు చేయాలి... అంటూ ప్లకార్డులు పట్టుకుని, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
విజయనగరంలో....
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి నాయకత్వంలో స్థానిక మయూరీ జంక్షన్‌వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్నికలకు ముందు టీడీపీ నాయకులు రూపొందించిన మేనిఫెస్టోను దహనం చేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబునాయుడును ఎ-1 నిందితునిగా చేర్చాలని ఎమ్మెల్సీ కోలగట్ల. వీరభద్రస్వామి డిమాండ్‌చేశారు. నిరసనలో యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్, సీనియర్ నాయకులు యడ్ల.రమణమూర్తి, పిళ్లా.విజయ్‌కుమార్, కాళ్ల గౌరీశంకర్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు సంగిరెడ్డి బంగారునాయుడు, జిల్లా సేవాదల్ అధ్యక్షుడు మారం బాలబ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కురుపాంలో...
చంద్రబాబు తీరును ఖండిస్తూ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి ఆధ్వర్యంలో కురుపాంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కురుపాం బస్‌స్టాండ్‌లో బైఠాయించారు. ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ అధికార దాహంతో ఇతర రాష్ట్రాల ప్రజా ప్రతినిధులను డబ్బుతో కొనాలని చూసిన చంద్రబాబు అడ్డంగా దొరికారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కురుపాం జెడ్పీటీసీ సభ్యురాలు శెట్టి పద్మావతి, ఎంపీపీ ఆనిమి ఇందిరాకుమారి తదితరులు పాల్గొన్నారు.
గజపతినగరంలో...
గజపతినగరం నాలుగు రోడ్ల జంక్షన్ వద ్దగజపతినగరం, బొండపల్లి, దత్తిరాజేరు, గంట్యాడ మండలాలకు చెందిన మండలపార్టీ అధ్యక్షులు బూడి వెంకటరావు, ఈదుబిల్లి కృష్ణ, కడుబండి రమేష్ నాయుడు , వర్రి నరిసింహమూర్తిల ఆధ్వర్యంలో వందలాదిమందితో ఆందోళన చేశారు. తొలుత స్థానిక నాలుగు రోడ్ల జంక్షన్ వద్దకు ర్యాలీగా తరలి వచ్చారు. ఈకార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు కరణం ఆదినారాయణ, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ జైహింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌కోటలో...
నియోజకవర్గ ఇన్‌చార్జ్ నెక్కల నాయుడు బాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తొలుత దేవి జంక్షన్ నుంచి శ్రీనివాస్ థియేటర్ వరకు ర్యాలీగా వెళ్లి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడి నుంచి కాంప్లెక్స్‌కు చేరుకుని మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రం అందచేశారు. అనంతరం దేవి జంక్షన్‌కు చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేచలపు చిన రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.
పార్వతీపురంలో...
స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ వద్ద వైఎస్‌ఆర్ సీపీ పార్వతీపురం నియోజకవర్గం సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్, పట్టణ అధ్యక్షుడె మజ్జి వెంకటేష్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గర్భాపు ఉదయభాను తదితరుల ఆద్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. చంద్రబాబు, పరకాల ప్రభాకర్ సిగ్గుమాలిన మాట్లాడుతున్నారని విమర్శించారు.
బొబ్బిలిలో..: బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు, బేబినాయన సూచన మేరకు మున్సిపల్ ప్లోర్ లీడర్ రౌతు రామ్మూర్తినాయుడు, కౌన్సిలర్లు రాంబార్కిశరత్,మరిపి తిరుపతినాయుడు తదితరుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీసులు ముందస్తు అరెస్టులకు సిద్ధమవడంతో తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు.
బాబే బాస్..
స్థానిక మొయిద జంక్షన్లో పార్టీనేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు మాట్లాడుతూ నోటుకునోటు వ్యవహారంలో చంద్రబాబు ప్రమేయమున్నట్లు బయటపడినా ఏసీబీ ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ళ శ్రీరాములనాయుడు, ఏఎంసీ మాజీ చైర్మన్లు కాకర్లపూడి శ్రీనివాసరాజు, ఉప్పాడ సూర్యనారాయణ , డీసీసీబీ వైస్ చైర్మన్ చనుమల్ల వెంకటరమణ, నెల్లిమర్ల జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు, పతివాడ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. నేతల అరెస్టును తెలుసుకుని అక్కడికొచ్చిన కోలగట్ల వీరభద్రస్వామి పోలీసుల తీరుపై విరుచుకుపడ్డారు. పోలీసులకు దమ్ముంటే ఓటుకు నోటు కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయాలన్నారు.
రాష్ట్రం అబాసుపాలు
Published Tue, Jun 9 2015 11:49 PM | Last Updated on Fri, Aug 10 2018 7:48 PM
Advertisement
Advertisement