
చంద్రబాబు చాలా బాగా కష్టపడ్డారు: వైఎస్ జగన్
విజయవాడ: ఓ ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడం చాలా పెద్ద విషయమని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం సాయంత్రమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం పదవిలో ఉన్న వ్యక్తులు ఆడియో, వీడియోలతో సహా దేశంలో ఎక్కడా దొరకలేదన్నారు. కానీ చంద్రబాబు మాత్రం అడ్డంగా దొరికిపోయినా పదవిలో కొనసాగుతున్నారన్నారు. మనవాళ్లు బ్రీఫ్‌డ్ మీ అన్న వాయిస్ తనది కాదని చంద్రబాబు ఇప్పటికీ చెప్పలేదన్న విషయాన్ని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఓటుకు కోట్లు కేసును పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు నానాతంటాలు పడ్డారని ఆయన అన్నారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం పూర్తి కాగానే అరగంటలోనే మళ్లీ చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి గవర్నర్ చెప్పిన విషయాన్ని మళ్లీ చెప్పారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. మీడియాలో ఎక్కడ ఓటుకు కోట్లు విషయం వస్తుందేమో అన్న భయంతో చంద్రబాబు ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి చాలా బాగా కష్టపడ్డారన్నారు. సరిగ్గా 11.06 నిమిషాలకు గవర్నర్ ప్రసంగం ప్రారంభమైతే 11.10 నిమిషాలకు చంద్రబాబు కేసును సుప్రీంకోర్టు విచారణకు చేపట్టిందన్నారు.
కేసును అడ్మిట్ చేసుకుని నోటీసులు ఇచ్చిందన్నారు. అయితే చంద్రబాబు మాత్రం అవన్నీ మామూలే అంటున్నారని, పైపెచ్చు తనపై 26 కేసులు పెట్టారని, అవన్నీ ఏమయ్యాయని ప్రశ్నించడం సిగ్గుచేటు అన్నారు. ఓటుకు కోట్లు కేసును పక్కదారి పట్టించే యత్నం చేస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు.