క్యాష్‌లెస్ విధానం అమలుపై అభిప్రాయాలు తెలుసుకుంటున్న ఆర్‌ఏం పీవీ రామారావు
బస్‌స్టేషన్ (విజయవాడ సెంట్రల్) : ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్‌కు, ప్రయాణికులకు మధ్య తలెత్తుతున్న చిల్లర సమస్యకు చెక్ పెట్టేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రయోగాత్మకంగా బస్సుల్లో క్యాష్‌లెస్ విధానం అమలు చేసేందుకు యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. సిటీ క్యాష్ సంస్థ ద్వారా క్యాష్ లెస్ విధానాన్ని ఆర్టీసీ బస్సుల్లో అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ విధానంపై ప్రయాణికుల్లో అవగాహన కల్పించేందుకు ఇటీవల ట్రయిల్‌రన్ నిర్వహించారు.
నగదు రహిత లావాదేవీలు
ప్రయాణికుడు ఆర్టీసీ నుంచి రూ.30కి కార్డు కొనుగోలు చేస్తాడు. దీన్ని తమ ప్రయాణాలకు అవసరమైన మేర నగదుతో రీచార్జ్ చేయించుకుంటారు. కార్డుతో బస్సు ఎక్కిన ప్రయాణికుడు కండక్టర్‌కు అందించగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసే స్వైప్ మిషన్ ద్వారా టికెట్టుకు తగిన నగదు కోట్ చేస్తాడు. తద్వారా టికెట్టును ప్రయాణికుడికి ఇస్తారు. ఈ ప్రకారం అమలు జరిగితే బస్సుల్లో నగదు రహిత లావాదేవీలు కొనసాగుతాయి. ఆ కార్డు తిరిగి ఆర్టీసీకి అప్పగిస్తే కార్డు కొనుగోలు చేసిన నగదు తిరిగి ఇస్తారు.
ఐదు రోజులుగా ట్రయిల్‌రన్..
తొలిసారిగా కృష్ణా రీజియన్‌లో ఈ క్యాష్‌లెస్ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించిన ఆర్టీసీ అధికారులు గవర్నర్‌పేట–2, విద్యాధరపురం డిపోల్లో పరిశీలన చేశారు. విజయవాడ–పామర్రు రూట్‌లో సిటీక్యాష్ సిబ్బంది, కండక్టర్, డ్రైవర్లతో బస్సులో ప్రయాణించి ప్రయాణికులకు అవగాహన కల్పించారు. దీనిపై ఆర్టీసీ అధికారులు సిబ్బంది అభిప్రాయాలు తెలుసుకోగా, ఈ విధానం సానుకూలంగా ఉందని తెలిసింది.
ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తే అమలు
క్యాష్‌లెస్ విధానంపై ప్రయాణికుల నుంచి అనుకూల స్పందన వస్తే అమలు చేస్తాం. ప్రస్తుతం నిర్వహించిన రూట్ సర్వేలో స్పందన బాగుంది. ఈ విధానం నగరంలో అమలు చేయాలంటే సాహసమనే చెప్పాలి. సిటీక్యాష్ సంస్థ నుంచి ఆర్టీసీ కార్డులు కొనుగోలు చేసి ప్రయాణికులకు విక్రయిస్తుంది. – పీవీ రామారావు, ఆర్‌ఏం, కృష్ణా రీజియన్
Comments
Please login to add a commentAdd a comment