మన రాజ్యాంగానికి కొత్త ప్రమాదం
భారత ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి చేసే ఏ ప్రయత్నమైనా ప్రమాదకరమే. అణచివేతకు గురైన, పీడిత వర్గాల ప్రజలు ఇంతకాలం పొందుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ దీంతో కోల్పోతారు. కులవ్యవస్థ, అంటరానితనం, ఆదిమతత్వం కారణంగానే భారతదేశంలో 1950కి ముందు సార్వత్రిక విద్య అనే భావనే ఉనికిలో లేదు. ప్రస్తుత రాజ్యాంగాన్ని అమలుపరచడం వల్లే పీడిత ప్రజలు అంతవరకు తమకు తెలీని ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకున్నారు. కాబట్టి ఏ రాజకీయ, సైద్ధాంతిక భావజాలం ఉన్న నాయకులైనా సరే... ఈ రాజ్యాంగాన్ని వెనక్కు నెట్టడాన్ని మనం ఎన్నటికీ అనుమతించకూడదు. భారత రాజ్యాంగం నిరవధికంగా పనిచేయాల్సిన అవసరం ఉంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రెండు వ్యతిరేక రంగాల్లో పోరాటాన్ని ప్రారంభించారు. ఒకటి: బీజేపీ గద్దె దిగేంత వరకూ వారితో పోరా డుతూ ఉంటానన్నారు. రెండు: ఆరెస్సెస్, బీజేపీ వ్యతిరేకించిన 1950 నాటి రాజ్యాంగం స్థానంలో కొత్త రాజ్యాంగాన్ని ఆయన కోరు కున్నారు. పూర్తిగా విరుద్ధమైన రెండు యుద్ధరంగాలను అయన ఏక కాలంలో ఎందుకు ప్రారంభించినట్లు అనేది అసలు ప్రశ్న.
ఆర్ఎస్ఎస్ మూలాలు సనాతన బ్రాహ్మణవాద ఆధ్యాత్మిక వ్యవస్థలో పాతుకుని ఉన్నాయి కాబట్టి దాన్నుంచి భారత రాజ్యాం గానికి ప్రమాదం ఉండేదనీ, ఇప్పటికీ ఉంటోందనీ మనకు తెలుసు. డాక్టర్ అంబేడ్కర్ నేతృత్వంలోని డ్రాఫ్ట్ కమిటీ ముసాయిదా రచనా ప్రక్రియను రూపొందించడం ప్రారంభించినప్పటి నుంచి కూడా ఆరెస్సెస్ సిద్ధాంతకర్తలు, దాని సంస్థాపక నాయకులు... రాజ్యాంగ సభ భావనను అంగీకరించేవారు కాదు. భారతీయతపై వారి భావన కానీ, వారు సమ్మతిస్తున్న తరహా రాజ్యాంగం కానీ... వర్ణ కుల వ్యవస్థను బలపరుస్తాయి. భారతీయ కమ్యూనిస్టులు కూడా రాజ్యాంగసభ ఏర్పాటును తోసిపుచ్చి ప్రజాస్వామిక రాజ్యాంగ ముసాయిదాను వ్యతిరేకించడానికి ప్రయత్నించారు. అది ఒక బూర్జువా రాజ్యాంగ రచనకు ప్రయత్నమని వారి భావం. అదృష్ట వశాత్తూ వీరు కూడా తమ ప్రయత్నంలో విఫలమయ్యారు. చివరకు 1950 జనవరి 26న ప్రస్తుత రాజ్యాంగం ఉనికిలోకి వచ్చింది.
రాజ్యాంగంలోని కొన్ని సెక్షన్లను మాత్రమే కాకుండా మొత్తం రాజ్యాంగాన్నే సమీక్షించడానికి అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వం లోని నాటి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం జస్టిస్ వెంకటాచలయ్య నేతృత్వంలో ఒక సమీక్షా కమిటీని ఏర్పర్చింది. కేవలం రాజ్యాంగాన్ని సవరించడం కాకుండా మారుతున్న సమాజ అవసరాలకు అను గుణంగా దాన్ని మార్చాలన్నదే నాటి ప్రభుత్వ ఉద్దేశం. కానీ ఆ ప్రయ త్నాన్ని దేశంలోని పలు వర్గాల ప్రజలు తిరస్కరించారు. దీంతో రాజ్యాంగ సమీక్షా కమిటీ సహజంగానే మరుగున పడిపోయింది. (చదవండి: కాంగ్రెస్కు చన్నీ చూపిన బాట)
తగని వైఖరి
ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కె. చంద్రశేఖర రావు కేంద్ర బడ్జెట్ గురించి ఫిబ్రవరి 1న మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను మాత్రమే కాకుండా ప్రస్తుత రాజ్యాంగాన్ని కూడా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. కొందరు మీడియా వ్యక్తులు దీన్ని పెద్దగా పట్టించుకోనప్పుడు, ఈ అంశంపై తాను చాలా సీరియస్గా ఉన్నట్లు నొక్కి చెప్పారు. ‘మొత్తం రాజ్యాంగాన్ని మార్చడంపై చర్చిద్దాం. మనకు ఇప్పుడు కొత్త రాజ్యాంగం కావాలి’ అన్నారు. ఒక చిన్న ప్రాంతీయ పార్టీ నేతకు దేశానికి కొత్త రాజ్యాంగం కావాలి అనే ప్లాన్ ఉంటే దాన్ని ఎవరైనా పట్టించుకోవలసిన అవసరం లేదు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దీని గురించి మాట్లాడటమే కలవరపెడుతోంది. వాస్తవానికి కేసీఆర్లో అనేక రకాలుగా హిందుత్వ ఆలోచనా విధానం గూడుకట్టుకుని ఉంది. స్వతహాగా ఆయన మతావేశపరుడు. యాగాలు, యజ్ఞాలు, క్రతువులు, ఆలయాలపై మెండుగా ఖర్చు పెడ తారు. వైష్ణవ పీఠాధిపతి చిన జీయర్ని సకల వేళల్లో అనుసరిస్తారు.
యాదగిరి ఆలయ పునరుద్ధరణకు రూ. 130 కోట్లు ఖర్చు పెట్టారు. పూర్తిగా మతపరమైన విశ్వాసాలతో కూడిన వ్యక్తిత్వం కాబట్టే ఇలా రాజ్యాంగ వ్యతిరేక ప్రకటనలకు కేసీఆర్ పాల్పడు తున్నారు. బీజేపీపై కేసీఆర్ చేస్తున్న పెనుదాడి తెలంగాణ మనోభావాలను తిరిగి ప్రేరేపిస్తుంది కాబట్టి ఇది ఆయనకు లబ్ధి చేకూర్చవచ్చు. కానీ ఆయన ప్రదర్శిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక వైఖరి అటు తెలంగాణ ప్రజలకు గానీ, ఇటు తన సొంత ప్రయోజనానికి గానీ ఏమాత్రం సమ్మతమైనది కాదు. ఎందుకంటే రాజ్యాంగం పట్ల వ్యతిరేకత అనేది నేరుగా ఆరెస్సెస్, బీజేపీతో ముడిపడి ఉన్న విషయం. ఇలాంటి పాలకులను, వ్యక్తులను సంస్కరించడమే భారత రాజ్యాంగ విధి. ఒక వ్యక్తిగా ఇలాంటి అభిప్రాయాలు కలిగి ఉండే హక్కు కేసీఆర్కు లేదని చెప్పలేం.
కానీ రాజ్యాంగం ముందు ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అదే రాజ్యాంగాన్ని మార్చడానికి ఉద్యమాన్ని ప్రారంభించకూడదు. భారత స్వాతంత్య్రం కోసం మన దేశ నిర్మాతలు సంవత్సరాల కొద్దీ జైళ్లలో గడిపారు. వారు రాజ్యాంగ ముసాయిదాను రచించిన రాజ్యంగ సభలో భాగమయ్యారు. దేశం చారిత్రకంగా ఎదుర్కొన్న ప్రతి కీలక సమస్యపై సుదీర్ఘ చర్చ జరిపిన తర్వాతే వీరు రాజ్యాంగ ముసాయిదాను రచించారు. ఇన్నేళ్ల తర్వాత ప్రతి ముఖ్యమంత్రీ లేక మంత్రీ, దేశానికి సర్వశక్తులూ కల్పించిన భారత రాజ్యాంగాన్నే రద్దు చేయాలని మాట్లాడితే దేశం కల్లోలంలో కూరుకుపోక తప్పదు. రేపు ప్రధానమంత్రి, ఆయన మంత్రివర్గ సభ్యులు కూడా ప్రజాస్వామిక వ్యవస్థను సంస్థాగతం చేసిన రాజ్యాంగాన్ని త్యజించడం లేదా రద్దు చేయడం గురించి మాట్లాడటం మొదలెడితే, భారతదేశం ధ్వంసమై పోతుంది. ప్రస్తుత పాలకులను నాటి స్వాతంత్య్ర వీరులు, వారి త్యాగాలతో ఏమాత్రం సరిపోల్చలేమనే చెప్పాలి. (చదవండి: మూడో ఫ్రంట్ మనగలిగేనా?)
గణరాజ్య వ్యవస్థ ఆచరణీయమేనా?
మరో సందర్భంలో ఆరెస్సెస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్, ప్రాచీన గణరాజ్య వ్యవస్థలో ఉత్తమమైన ప్రజాస్వామ్యం ఉండేదని సూచించారు. ఇది జాతీయవాద ప్రచారంలో బాగా వ్యాప్తిలో ఉన్న కొత్త భ్రమ మాత్రమే. పైగా మనది వలసవాద రాజ్యాంగ నమూనా అంటూ చాలాసార్లు పరోక్షంగా వ్యాఖ్యానాలు చేశారు. ప్రాచీన గణ రాజ్యాలు చిన్న చిన్న గిరిజన విభాగాలు. స్థానిక విభాగాల స్థాయిలో గిరిజన సమానత్వ పంపిణీ పద్ధతిలో నడిచేవి. దీనికి చక్కటి ఉదా హరణ వజ్జియన్ గిరిజన గణరాజ్య ప్రజాస్వామ్యం. బుద్ధుడి జీవిత కాలంలోనే ఇది ఉనికిలో ఉండేది. మగధ రాజ్య ఆక్రమణ నుంచి బుద్ధుడు దీన్ని కాపాడాడు. ఇలాంటి గణరాజ్య ప్రజాస్వామ్యాన్ని ఆధునిక భారత రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగానూ పోల్చి చూడలేం (నా పుస్తకం ‘గాడ్ యాజ్ పొలిటికల్ ఫిలాసపర్ – బుద్ధాస్ ఛాలెంజ్ టు బ్రాహ్మిణిజం’లో నేను గతంలోనే దీన్ని చర్చించాను).
మన రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని ప్రయోగమని చెప్పాలి. పైగా జనాభా అధికంగా ఉన్న ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఇంతటి బృహత్తర రాజ్యాంగం ఉనికిలో లేదు. ఇటువంటి ప్రజాస్వామ్యాన్ని రద్దు చేయడానికి చేసే ఏ ప్రయత్నమైనా ప్రమాదకరమే. అణచివేతకు గురైన, పీడిత వర్గాల ప్రజలు ఇంత కాలం పొందుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ దీంతో కోల్పోతారు. కుల వ్యవస్థ, అంటరానితనం, ఆదిమతత్వం కారణంగానే భారత దేశంలో 1950కి ముందు సార్వత్రిక విద్య అనే భావనే ఉనికిలో లేదు. ప్రస్తుత రాజ్యాంగాన్ని అమలుపరచడం వల్లే పీడిత ప్రజలు అంతవరకు తమకు తెలీని ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నేతృత్వంలో భారత రాజ్యాంగ ముసాయిదా పూర్తి కావడం, దాన్ని మన దేశ నిర్మాతలు ఆమోదించినందుకు మనం ఎంతో అదృష్టవంతులం. కేసీఆర్ వంటి అధికార తృష్ణ కలిగిన నేతలు, హిందుత్వ భావజాలం ప్రభావంతో వ్యవహరిస్తున్నవారు లేక మరే ఇతర సైద్ధాంతిక దృక్పథం కలిగినవారైనా సరే ఈ రాజ్యాంగాన్ని వెనక్కు నెట్టడాన్ని మనం ఎన్నటికీ అనుమతించకూడదు. (చదవండి: పరాయీకరణ దిశలో మేడారం జాతర)
ఒక దశలో నేను కూడా రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య రద్దు కోసం పనిచేస్తున్న వామపక్ష భావజాల శక్తుల్లో భాగంగా ఉండేవాడిని. అయితే చాలా త్వరగానే నేను వాస్తవం గుర్తించి, ‘నేను హిందువు నెట్లయిత’ పుస్తకాన్ని రచించిన 1980లలోనే, అలాంటి వామపక్ష శక్తులనుంచి బయటపడ్డాను. అందుకు నేను చాలా అదృష్టవంతుడిని. ఆ విధంగా రాజకీయ స్వీయ విధ్వంసక సైద్ధాంతిక క్రమం నుంచి నేను బయటపడ్డాను. అమెరికన్ రాజ్యాంగం వందల సంవత్సరా లుగా పనిచేస్తున్న విధంగా భారత రాజ్యాంగం కూడా నిరవధికంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగంపై కేసీఆర్ అభిప్రాయాలను తెలంగాణ ప్రజలు మొత్తంగా తిరస్కరించినం దుకూ, ప్రతిపక్ష పార్టీలు, సామాజిక సంస్థలు అలాంటి ఆలోచననే ఖండించినందుకూ నేనెంతో సంతోషపడుతున్నాను.
- ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్
ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త