సెప్టెంబర్ నుంచి నగదు బదిలీ
Published Sun, Aug 18 2013 4:04 AM | Last Updated on Thu, Mar 21 2019 8:22 PM
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : వచ్చే సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి గ్యాస్ కనెక్షన్లకు ప్రత్యక్ష లబ్ధి బదిలీ పథకం వర్తింపజేయనున్నట్లు కలెక్టర్ అహ్మద్ బాబు తెలిపారు. గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి ఆధార్ నంబర్లతో తమ బ్యాంక్ అకౌంట్‌ను అనుసంధానం చేసుకోవాలని పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, డీలర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాబు మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం నిర్ణయించిన విధంగా 35 జిల్లాలో నగదు బదిలీ పథకం గ్యాస్ కనెక్షన్లకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి నగదు బదిలీ పథకం వర్తింపజేయనున్నట్లు, అందులో మన జిల్లా కూడా ఉందని పేర్కొన్నారు.
సెప్టెంబర్‌లోగా తమ బ్యాంక్ ఖాతాలతో ఆధార్‌ను అనుసంధానం చేయకుంటే సబ్సిడీ రాదని పేర్కొన్నారు. ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేసిన వినియోగదారులకు రూ.450 జమ అవుతాయని వివరించారు. బ్యాంకులో డబ్బులు జమ అయిన తరువాత రెండు రోజుల్లో సిలిండర్ తీసుకోవాలన్నారు. జిల్లాలో 3.55 లక్షల మంది సాధారణ కనెక్షన్ వినియోగదారులు ఉండగా, 1.50 వేలు దీపం కనెక్షన్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు లక్ష మంది వరకు మాత్రమే అనుసంధానం చేసుకున్నారని, మిగతా వారు ఈ వారంలోగా అనుసంధానం చేసుకోవాలని సూచించారు. బ్యాంక్ అకౌంట్, ఆధార్ లెటర్, ఎస్వీ జిరాక్స్ కాపీలతో గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్, గ్యాస్ ఏజెన్సీ డీలర్లను, బ్యాంకులను సంప్రదించాలని సూచించారు.
అధికారులపై ఆగ్రహం
గ్యాస్ వినియోగదారుని ఆధార్‌తో బ్యాంక్ అకౌంట్‌కు అనుసంధానం చేయడం తెలియడం లేదని అధికారుల తీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చెప్పి 45 రోజులు గడుస్తున్నా ఇంత వరకు పట్టించుకోకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. జూలై 3వ తేదీ నుంచి ఇప్పటి వరకు 54 శాతం సీడింగ్ పూర్తి చేశారని, జూలై మొదటి వారంలో 10 శాతం అనుసంధానం చేస్తే 45 రోజుల్లో 44 శాతం ఆధార్‌తో అనుసంధానం చేశారని పేర్కొన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహశీల్దార్లు కూడా ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారని హెచ్చరించారు. వారం పది రోజుల్లో ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ సుజాత శర్మ, డ్వామా, డీఆర్డీఏ పీడీలు వినయ్‌కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, డీఎస్‌వో వసంత్‌రావు దేశ్‌పాండే, ఎఎస్‌వో సత్యనారయణ, ఎన్‌ఐసీ డీఐవో రాకేష్ బ్యాంకర్లు, డీలర్లు, అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement