ఆధార్ అయోమయం
Published Mon, Feb 3 2014 2:33 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు :నగదు బదిలీ పథకం పేరిట గ్యాస్ సరఫరాలో కొత్త విధానాన్ని అమలుచేసిన కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటనలతో గందరగోళంలో పడేసింది. గ్యాస్ కావాలంటే ఆధార్ అనుసంధానం అనివార్యమంటూ నాలుగు నెలల పాటు ఊదరగొట్టి బోలెడు డబ్బు ఖర్చు చేసిన ప్రభుత్వం నాలుగు రోజుల కిందటే నిర్ణయాన్ని మార్చుకుంది. ఆదివారం నుంచి సబ్సిడీ సిలిండర్లను ఏడాదికి 9 నుంచి 12కు పెంచుతూ...ఆధార్ లింకును కూడా ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. అయితే సబ్సిడీ సిలిండరు ధరను మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. దీనిపై సర్వత్రా సందిగ్ధత నెలకొంది. ఇంటికొచ్చిన గ్యాస్ సిలిండరుకు ఎంత చెల్లించాలో తెలియక వినియోగదారులు సతమతమవుతున్నారు. మరో వైపు శనివారం నుంచి జిల్లాలోని అన్ని గ్యాస్ ఏజెన్సీల్లోనూ సిలిండర్ బుకింగులు సగానికి పైగా తగ్గాయి. జిల్లాలోని 11.72 లక్షల మంది వినియోగదారుల్లో 9.05 లక్షల మంది(77 శాతం) గ్యాస్ నంబరును ఏజెన్సీల్లో అనుసంధానం చేసుకున్నారు. కానీ 7,08, 978 మందికి మాత్రమే సబ్సిడీ సొమ్ము బ్యాంకుల్లో జమవుతోంది.
అటు గ్యాస్ ఏజెన్సీల్లోనూ, ఇటు బ్యాంకుల్లోనూ ఆధార్ లింకు ప్రక్రియ పూర్తి కాని వినియోగదారులు కూడా ఈ మధ్య సిలిండరు తీసుకుని సబ్సిడీయేతర ధరను చెల్లించారు. గడచిన వారం రోజుల్లో జిల్లాలోని.1.20 లక్షల మంది వినియోగదారులు రూ.1325 చొప్పున సబ్సిడీ ధరను చెల్లించారు. వీరికి ఇంకా సబ్సిడీ మొత్తాలు బ్యాంకుల్లో జమకావాల్సి ఉంది. వీరికి కచ్చితంగా జమ చేస్తామని పౌరసరఫరాల శాఖ అధికారి రవితేజనాయక్ చెబుతున్నారు. మారిన విధానంవల్ల ఆధార్‌తో పని లేకుండా గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో వినియోగదారులకు ఆయా పాత సబ్సిడీ సొమ్ము సక్రమంగా అందుతుందో,లేదోనన్న గందరగోళం నెలకొంది. రోజుకో కొత్త పద్ధతి అనుసరిస్తుండటంతో జిల్లాలోని 84 గ్యాస్ ఏజెన్సీ డీలర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమపై కేసులు నమోదుచేయడం తప్ప తామెదు ర్కొంటున్న ఇబ్బందులపై సమీక్షించిన అధికారే లేరని డీలర్లు వాపోతున్నారు.
Advertisement
Advertisement