వీరిమాటేమి! | cash transfer scheme to district new year gift | Sakshi
Sakshi News home page

వీరిమాటేమి!

Published Sun, Jan 5 2014 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM

cash transfer scheme to district new year gift

కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ఆధార్ నమోదు అస్తవ్యస్తం. బ్యాంకులో ఖాతాలు తెరవాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వానికి ఇవేవీ పట్టవు. అధికారులకు ఈ సమస్యలు కానరావు. కొత్త సంవత్సరం కానుకగా జిల్లాలో నగదు బదిలీ పథకానికి శ్రీకారం చుట్టేశారు. గ్యాస్‌కు, ప్రభుత్వ పథకాలకు ఆధార్ లింకప్ చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించుకోక ముందుకు సాగడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గ్యాస్ వినియోగదారుల అవస్థలు వర్ణనాతీతం. ఏడాది నుంచి ఆధార్ నెంబర్లు, బ్యాంకు ఖాతాలు సేకరిస్తున్నా ఇప్పటికీ ఆ ప్రక్రియ ఓ కొలిక్కి రాలేదు.

జిల్లాలో 5,52,576 గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. ఆధార్‌తో బ్యాంకు ఖాతాలు, సెల్‌ఫోన్ నెంబర్ల అనుసంధానం పూర్తయిన కనెక్షన్లు 1.40 లక్షలే కావడం గమనార్హం. మరో నెల రోజుల సమయం పొడిగించినా.. ఆధార్ నమోదు తీరును పరిశీలిస్తే ఇప్పుడప్పుడే యూఐడీ నెంబర్లు అందే పరిస్థితి లేదు. ఆధార్ పురోగతి ఇంత అధ్వానంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నగదు బదిలీ పేరిట ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తుంది. జిల్లా జాయింట్ కలెక్టర్ కన్నబాబు ఆధార్ నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు. సేకరించిన వివరాలను ఎస్‌ఆర్‌డీహెచ్ సైట్‌లో డేటా ఎంట్రీ చేయడాన్ని ముమ్మరం చేశారు. అయితే సీఎస్‌డీటీలు, గ్యాస్ డీలర్ల అలసత్వంతో ఆశించిన ఫలితం కరువైంది.

 ఇప్పటివరకు 4,19,372 మంది గ్యాస్ వినియోగదారుల నుంచి యూఐడీ, ఈఐడీ నెంబర్లు, బ్యాంకు అకౌంట్ నెంబర్లు, సెల్‌ఫోన్ నెంబర్లు సేకరించారు. వీటని గ్యాస్ డీలర్లు, ఎస్‌ఆర్‌డీహెచ్ సైట్‌లో నమోదు చేయాల్సి ఉండగా.. 3 లక్షల మంది వివరాలను మాత్రమే నమోదు చేశారు. ఇదిలాఉండగా నగదు బదిలీ పథకం కారణంగా గ్యాస్ వినియోగదారులకు బ్యాంకు ఖాతా అత్యవసరం. ఈ విషయానికొస్తే జిల్లాలో లక్ష మందికి పైగా వినియోగదారులకు బ్యాంకు ఖాతాలే లేవు. తాజాగా వీరంతా బ్యాంకులకు వెళితే అక్కడి అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పత్తికొండ, వెల్దుర్తి, డోన్, ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు ప్రాంతాల్లోని బ్యాంకర్లు ఖాతాలు ప్రారంభించడంలో వినియోగదారులకు చుక్కలు చూపుతున్నారు. మరో నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే పరిస్థితి లేకపోవడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement