ఇప్పుడంతా వారసత్వ నటనే..
సినీ నటుడు కోట శంకర్రావు
నటనలో అన్నయ్యకు సాటి.. నాటకంలో మేటి.. ఏ క్యారెక్టర్‌కైనా సరిపోయే రూపం.. క్లిష్టమైన డైలాగులను సునాయూసంగా చెప్పగలిగే వ్యాఖ్యానం నటుడు కోట శంకర్రావుకు పెట్టని ఆభరణాలు. సోదరుడు కోట శ్రీనివాసరావుకు ఏమాత్రం తీసిపోని ఆయన నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. విలక్షణమైన అభినయంతో అటు వెండితెర వీక్షకులను, ఇటు బుల్లితెర ప్రేక్షకులను, నాటకరంగ అభిమానులను మెప్పిస్తున్న ఘనాపాఠి ఆయన. ఈ నేల-ఈ గాలి సీరియల్ షూటింగ్‌లో పాల్గొనేందుకు గుడ్లవల్లేరు మండలం కౌతవరం వచ్చిన ఆయన సోమవారం ‘సాక్షి’తో ముచ్చటించారు. తన స్వస్థలం జిల్లాలోని కంకిపాడు అని చెప్పారు.
- కౌతవరం (గుడ్లవల్లేరు)
సాక్షి : నటనకు ముందు మీరేం చేసేవారు?
శంకర్రావు : స్టేట్‌బ్యాంక్ మేనేజర్‌గా 30ఏళ్లు పనిచేశా.
సాక్షి : నాటకాల్లో ప్రవేశం ఉందా?
శంకర్రావు : 1965 నుంచి నాటకరంగంలో ఉన్నాను. ఆ అనుభవం వల్లే సినిమాల్లో అవకాశం వచ్చింది.
సాక్షి : సినీరంగ ప్రవేశం ఎప్పుడు జరిగింది?
శంకర్రావు : 1986లో ‘నాకూ పెళ్లాం కావాలి’ నా మొదటి సినిమా.
సాక్షి : ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించారు?
శంకర్రావు : 80 సినిమాలు చేశాను.
సాక్షి : మీకు పేరు తెచ్చిన సినిమాలు?
శంకర్రావు : అంకురం, సూత్రధారులు, హలోబ్రదర్, చీమలదండు మంచి పేరు తెచ్చాయి.
సాక్షి :: సీరియల్స్‌లోకి ఎప్పుడు అడుగుపెట్టారు?
శంకర్రావు : సినిమాల కంటే ముందే సీరియల్స్‌లోకి వచ్చాను. 1983లోనే సీరియల్స్‌లో నటించా. ఇప్పటివరకు 53 సీరియల్స్‌లో నటించే అవకాశం వచ్చింది.
సాక్షి : ప్రస్తుతం చేస్తున్న సినిమాలు?
శంకర్రావు : సినిమాలేమీ చేయట్లేదు. ఐదు సీరియల్స్ చేస్తున్నాను.
సాక్షి : ఏ సీరియల్స్‌లో మీకు పేరొచ్చింది?
శంకర్రావు : కలిసుందాం రా, జయం, శ్రీమతి, గాయత్రి, యోగి వేమన, విశిష్ట విశ్వామిత్ర సీరియల్స్‌లో మంచి పేరొచ్చింది.
సాక్షి : నటనా రంగానికి కొత్తగా వచ్చే వారికి మీరిచ్చేసలహా?
శంకర్రావు : సినిమాలు, సీరియల్స్‌లో నటించేందుకు కొండంత టాలెంట్ ఉంటే చాలదు. ఆవగింజంత అదృష్టం ఉండాలి. అదే ముఖ్యం. నటనలో ఏకే47లా పనిచేయాలి. అవకాశం ఎప్పుడు తలుపు తడుతుందో తెలియదు. కానీ, ఆ అవకాశం వస్తుంది. నిత్య సాధన చేస్తూ నటన అనే విద్యకు పదును పెట్టుకుంటూ ఉండాలి. సినీ సత్సంబంధాల్ని మెరుగు పరుచుకుంటూ వాటిని కొనసాగిస్తే, తప్పక లక్ష్యం సాధించవచ్చు.
సాక్షి : సినీ పరిశ్రమలో ప్రస్తుతం అవకాశాలు ఎలా ఉన్నాయి?
శంకర్రావు : అవకాశాలు ఇచ్చే విషయంలో కొందరు వారసత్వానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.