అయ్యో..వార్లు! | Categories of schools as a scientific division | Sakshi
Sakshi News home page

అయ్యో..వార్లు!

Published Fri, Aug 14 2015 3:25 AM | Last Updated on Sat, Sep 15 2018 7:22 PM

అయ్యో..వార్లు! - Sakshi

అయ్యో..వార్లు!

చక్రాయపేట మండలం కల్లూరుపల్లె సుగాలి తాండా జిల్లాలో  మారుమూల కుగ్రామం. అనంతపురం జిల్లా సరిహద్దుల్లో ఉన్న ఈ పల్లెకు రహదారి కూడా సరిగా లేదు. బస్సు కాదు కదా.. ఆటోలు సైతం ఆవైపు తొంగి చూడవు. ఆ పల్లె వాసులకు జ్వరమొచ్చి టౌన్‌కు వెళ్లాలంటే నాలుగు కిలోమీటర్లు నడిచి క్రాస్ వద్దకు వెళ్లాలి. అక్కడి నుంచి వేంపల్లె 42 కిలోమీటర్లు, కదిరి 48, పులివెందుల 56, రాయచోటి 65 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ తాండాలో ఓ సర్కారు బడి ఉంది. ఆ బడిలో చదివే పిల్లలంతా గిరిజనులే. ఈ బడి మూడో కేటగిరిలో ఉంది. అంటే ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలకు సంబంధించి సంవత్సరానికి మూడు పాయింట్లు మాత్రమే వెయిటేజీ ఇస్తారు. మైదుకూరు, యర్రగుంట్ల, రైల్వేకోడూరు లాంటి పట్టణాల్లోని పాఠశాలలకూ మూడు పాయింట్లే. ఇదెక్కడి న్యాయం?
 
- అశాస్త్రీయంగా పాఠశాలల కేటగిరీల విభజన
- బదిలీల్లో నష్టపోనున్న మారుమూల ప్రాంత టీచర్లు
- పట్టణాలు, పల్లెల పాఠశాలలకు సమాన పాయింట్లు
- నాలుగో కేటగిరీకి నోచుకోని తాండా బడులు
సాక్షి ప్రతినిధి, కడప :
పాఠశాలల కేటగిరీల విభజనలో శాస్త్రీయత లోపించడం వల్ల త్వరలో చేపట్టనున్న ఉపాధ్యాయుల బదిలీల్లో గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న వారికి అన్యాయం జరగనుంది.ఉపాధ్యాయ బదిలీల్లో వెయిటేజీ ఎన్‌టైటిల్ పాయింట్లు కీలకమైనవి. బదిలీ లు నిర్వహించినప్పుడు వీటి ఆధారంగా ఉపాధ్యాయులకు సీనియారిటీ ర్యాంకులు కేటాయిస్తారు. ఒక ఉపాధ్యాయుడు ఒక పాఠశాలలో ఎంత కాలం నుంచి పనిచేస్తున్నాడన్న అంశంతోపాటు ఆ పాఠశాల ఏ కేటగిరీలో ఉంది.. అన్నదాన్ని బట్టి ఎన్‌టైటిల్ పాయింట్లు నిర్ణయిస్తారు. ఈ విధానం వల్ల మారుమూల ప్రాంతాల్లో పనిచేసే అయ్యవార్లు ఎక్కువ పాయింట్లు సాధించి సీనియారిటీ జాబితాలో ముందు వరసలో ఉంటారు. ఫలితంగా వీరు బదిలీల్లో మంచి స్థానాలు కోరుకునే అవకాశం ఉంది. అయితే కేటగిరీల విభజన పూర్తి అశాస్త్రీయంగా ఉండడంతో గ్రామీణ ప్రాంతాల ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారు.
 
ముమ్మాటికీ ఆశాస్త్రీయమే
రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలను నాలుగు కేటగిరీలుగా విభజించి  పాయింట్లు కేటాయించారు. మొదటి కేటగిరీ కింద ఉన్న పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు సంవత్సరానికి ఒక పాయింటు మాత్రమే వెయిటేజీ ఇస్తున్నారు. రెండో కేటగిరీకి రెండు పాయింట్లు, మూడో కేటగిరీకి మూడు, నాలుగో కేటగిరీకి ఐదు పాయింట్లు ఇస్తున్నారు. కడప, ప్రొద్దుటూరు పట్టణాల్లోని పాఠశాలలను మొదటి కేటగిరీలో ఉంచిన యంత్రాంగం జమ్మలమడుగు, పులివెందుల, రాయచోటి, రాజంపేట, బద్వేల్ పట్టణాలల్లోని పాఠశాలలను రెండో కేటగిరీ కింద చేర్చారు. జిల్లాలో అత్యంత మారుమూల ప్రాంతాలల్లో ఉన్న 24 పాఠశాలలు మాత్రమే నాలుగో కేటగిరీ కింద ఉన్నాయి.

ఇంతవరకూ బాగానే ఉన్నా మూడో కేటగిరీ పాఠశాలలను గుర్తించే విషయంలోనే అధికారులు తప్పుటడుగు వేశారని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక్కడ పట్టణాలు, పల్లెలను ఒకే గాటికి కట్టేశారు. మైదుకూరు, యర్రగుంట్ల మున్సిపాలిటిలతోపాటు, నియోజకవర్గ కేంద్రాలైన రైల్వేకోడూరు, కమలాపురంలతో సహా మండల కేంద్రానికి 35 కిలోమీటర్లు దూరంలో ఉన్న కల్లూరుపల్లె తాండా, సిద్దవాండ్లపల్లె, కెకెవారిపల్లె, ఉక్కుశిలవాండ్లపల్లె, దిద్దికుంటపల్లెలాంటి మారుమూల పల్లెల్లోని వందలాది పాఠశాలలను సైతం మూడో కేటగిరీలోనే ఉంచారు. నివాస యోగ్యమైన పెద్ద పట్టణాలకు వాహన సౌకర్యం లేని సుదూర గ్రామాలకు సమాన పాయింట్లు ఇస్తున్నారు. ఈనెల చివ రిలో నిర్వహించనున్న బదిలీలకు ముందే మూడో కేటగిరీని సవరించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
 
మార్పులు అత్యవసరం..  కేటగిరీలను విభజించే విషయంలో అధికారులు ఇంటి అద్దె అలవెన్సును ఆధారం చేసుకోవడం వల్లే బదిలీలల్లో గ్రామీణ ప్రాంత అయ్యవార్లు తీవ్రంగా నష్టపోతున్నారన్నదీ నిర్వివాదాంశం. హెచ్‌ఆర్‌ఏతో సంబంధం లేకుండా పట్టణం నుంచి ఆయా పల్లెలు ఎంతదూరంలో ఉన్నాయన్నదాన్ని బట్టి కేటగిరీలను విభజించి ఉంటే సముచితంగా ఉండేదని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉపాధ్యాయులు ఎవరూ పల్లెల్లో నివసించడం లేదు. 95 శాతం మంది అయ్యవార్లు ప్రతిరోజు పట్టణాల నుంచే ఏదో ఒక వాహనంలో పాఠశాలలకు వచ్చి వెళ్లుతున్నారు. బదిలీల్లో ఉపాధ్యాయులందరూ టౌన్‌కు దగ్గరలో ఉన్న పాఠశాలలనే కోరుకుంటున్నారు. అలాం టప్పుడు పట్టణానికి దూరంగా ఉన్న పాఠశాలలకు అధిక పాయింట్లు కేటాయించడం ద్వారా అసమానతలను రూపు మాపవచ్చన్నది మేధావుల అభిప్రాయం.
 
పల్లెలోనే నివాసం ఉంటున్నా..
మా సొంత ఊరు జమ్మలమడుగు దగ్గర వద్దిరాల. ఐదేళ్లుగా తాండా బడిలో పనిచేస్తున్నా. పల్లెలోనే నివాసం ఉంటూ పిల్లలకు చదువు చెబుతున్నా. మా పాఠశాల మూడో కేటగిరీలో ఉండడంతో బదిలీల్లో వెయిటేజీ పాయింట్లు తక్కువగా వస్తున్నాయి. దీంతో మరో ఐదేళ్లు పనిచేసినా మా ఏరియాకు వెళ్లలేని పరిస్థితి.    
-   దైవచిత్తం, సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుడు, ఎంపీపీ స్కూల్, కల్లూరుపల్లె  
 
నాలుగో కేటగిరీలోకి చేర్చాలి..
ఏ సౌకర్యాలు లేని కల్లూరుపల్లె సుగాలితాండా లాంటి అత్యంత మారుమూల పాఠశాలలను నాలుగో కేటగిరీలో చేర్చాలి. పాయింట్లు ఎక్కువ ఉంటే సౌకర్యాలు లేకున్నా కొందరు ఉపాధ్యాయులైనా బదిలీల్లో ఇక్కడికి రావడానికి ఉత్సుకత చూపుతారు. పాయింట్లు పెంచకపోతే బదిలీల్లో ఇలాంటి పాఠశాలలను ఏ ఉపాధ్యాయుడూ కోరుకోరు. చివరకు పాఠశాల మూత పడే ప్రమాదం ఉంది. - బి.నాగేశ్వరరావు, ప్రధానోపాధ్యాయుడు, ఎంపీపీ స్కూల్, కల్లూరుపల్లె తాండా.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement