Teachers Transfer
-
Telangana: అందరు టీచర్లకు బదిలీ అవకాశం ఇవ్వాలి
తెలంగాణ ప్రభుత్వం దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు అనుమతి ఇచ్చింది. దాదాపు 25 వేల నుండి 30 వేల మంది ఉపాధ్యాయులు ఇప్పుడు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం గత సంవత్సరం 317 జీవో ద్వారా కొత్త జిల్లాలకి సీనియర్, జూనియర్ లిస్టుల పేరుతో ఉపాధ్యా యులను కేటాయించింది. మొత్తం లక్ష 5 వేల మందిలో 25 వేల మంది ఒక జిల్లా నుండి మరొక జిల్లాకి బదిలీ అయ్యారు. మిగతా 80 వేల మంది పని చేసే చోటే మళ్ళీ పోస్టింగ్ పోందినారు. ఇప్పుడు అందరు టీచర్లకు బదిలీ అవకాశం ఇవ్వాలి. నచ్చిన చోట ఖాళీ ఉంటే వెళ్ళే వెసులు బాటు ఇవ్వాలి. కొందరి లబ్ధి కోసం 317 జీవో అమలు చేసి మళ్ళీ ఇప్పడు వేరే జిల్లాలకి బదిలీ అయిన టీచర్లకు 2 సంవత్సరాల సర్వీస్ రూల్ ఉండాలనడం అర్థం లేని నిబంధన. ఇక 80 వేల ఉద్యోగాల్లో భాగంగా ఇప్పటికే వివిధ ఉద్యోగాలకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడం, నోటిఫికేషన్లు జారీ కావడం జరుగుతోంది. కానీ టెట్ ముగిసి 8 నెలలు అవుతున్నా ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి టీఆర్టీ నోటిఫికేషన్ జారీకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వకపోవడం వల్ల 4 లక్షల మంది అభ్యర్థులు నిరాశలో ఉన్నారు. టెట్‌లో ఉత్తీర్ణత పొందనివారూ, కొత్తగా డీఎడ్, బీఎడ్ పూర్తి చేసిన బ్యాచులవారూ మరో టెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఖాళీల వివరాలు వెల్లడి అవుతాయి. సంవత్సరం క్రితం ఆర్థిక శాఖ అనుమతి కోసం 9,600 పోస్టులతో విద్యాశాఖ అధికారులు ఫైల్ పంపినారు. అది ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. ఇప్పుడు టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏర్పడే 10 వేల ఖాళీలను కూడా పాత ఖాళీల్లో కలిపి భారీ డీఎస్సీ విడుదల చేయాలని నిరుద్యోగులు కోరు కుంటున్నారు. – రావుల రామ్మోహన్ రెడ్డి, తెలంగాణ డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు -
AP: గుడ్‌న్యూస్.. టీచర్ల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్ శనివారం ఈ మేరకు జీఓ–187ను విడుదల చేశారు. ఈనెల 12 నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. వివిధ దశల అనంతరం 2023 జనవరి 12న టీచర్లకు బదిలీ ఉత్తర్వులు విడుదలవుతాయి. 2021–2022 విద్యా సంవత్సరం నాటికి ఒకే పాఠశాలలో ఐదేళ్ల సర్వీసును పూర్తిచేసిన ప్రధానోపాధ్యాయులు (గ్రేడ్–2) ఎనిమిది విద్యా సంవత్సరాల సర్వీసు పూర్తిచేసిన ఉపాధ్యాయులకు తప్పనిసరిగా బదిలీ ఉంటుంది. అలాగే విధివిధానాల్లోని ముఖ్యాంశాలు ఏమిటంటే.. – 2024 ఆగస్టు 31 లేదా అంతకు రెండేళ్లలోపు పదవీ విరమణ చేయబోయే వారిని వారు కోరుకుంటే తప్ప బదిలీ చేయరు. – బదిలీ దరఖాస్తుకు ఎలాంటి సర్వీసు నిబంధన లేదు. – 2022 ఆగస్టు 31 నాటికి 50 ఏళ్లలోపు వయసున్న బాలికల హైస్కూల్లోని పురుష హెచ్ఎం టీచర్లకు బదిలీ తప్పనిసరి. – బాలికల ఉన్నత పాఠశాలల్లో పనిచేయడానికి మహిళా ప్రధానోపాధ్యాయులు (గ్రేడ్–2), ఉపాధ్యాయులు అందుబాటులో లేకుంటే 50 ఏళ్లు దాటిన పురుష హెచ్ఎంలు, టీచర్లను పరిగణనలోకి తీసుకుంటారు. – విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. – దృష్టిలోపం ఉన్న ఉపాధ్యాయులకు బదిలీల నుంచి మినహాయింపు ఉంది. 80 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న ఆర్థోపెడికల్ ఛాలెంజ్డ్ టీచర్లకు కూడా బదిలీల నుండి మినహాయింపు ఉంది. అయితే, అటువంటి ఉపాధ్యాయులు బదిలీని కోరుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చు. – పేరెంట్ మేనేజ్మెంట్కి వెళ్లాలని కోరుకునే వారు ఆ మేనేజ్మెంట్లో అందుబాటులో ఉన్న ఖాళీలకు మాత్రమే బదిలీని ఎంచుకోవాలి. – ఏజెన్సీ మైదాన ప్రాంతాల వారికి బదిలీ అవకాశం ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు భర్తీకాకపోతే ఇతర ప్రాంతంలోని జూనియర్ మోస్ట్ మిగులు టీచర్లను బదిలీ కౌన్సెలింగ్ తర్వాత తాత్కాలికంగా నియమిస్తారు. ఆన్లైన్లో బదిలీల కౌన్సెలింగ్ బదిలీలు ఆన్లైన్ ప్రక్రియ ద్వారా మాత్రమే జరుగుతాయి. గతంలో ఉన్న పాత జిల్లాలను జిల్లాగా పరిగణించాలి. ప్రతి జిల్లా, జోన్లో ఏర్పాటుచేసిన కమిటీల ఆమోదంతో విద్యాశాఖ బదిలీ ఉత్తర్వులు జారీచేస్తుంది. హెచ్ఎం, టీచర్ల వెబ్అప్షన్ల ఆధారంగా బదిలీ పోస్టింగ్ ఆర్డర్లను జారీచేస్తారు. బదిలీల కోసం పాయింట్లను గణించేందుకు కమిటీ నివాసాల జాబితాను కొత్తగా ప్రకటిస్తుంది. మెరిట్, సర్వీసు, ప్రత్యేక పాయింట్ల కేటాయింపు, మినహాయింపు వంటి అంశాలను జీఓలో వివరంగా పొందుపరిచారు. అంతేకాక.. 2022 నవంబర్ 30 నాటికి అన్ని ఖాళీలను కౌన్సెలింగ్‌లోకి తీసుకుంటారు. నిర్బంధ బదిలీల కారణంగా ఏర్పడే అన్ని ఖాళీలు, కౌన్సెలింగ్ సమయంలో అయ్యే ఖాళీల్లోకి బదిలీలు ఉంటాయి. అడహక్ ప్రాతిపదికన పదోన్నతిపై కేటాయించిన హెచ్ఎంలు, టీచర్ల స్థానాలు ఖాళీగా చూపిస్తారు. ఏడాదికి పైగా అధికారికంగా లేదా అనధికారికంగా రాని వారి స్థానాలు ఖాళీలుగా పరిగణిస్తారు. ప్రసూతి సెలవులు, వైద్య సెలవులు లేదా సస్పెన్షన్‌లో ఉన్న వారి ఖాళీలను కౌన్సెలింగ్‌లో చూపించరు. నాలుగు వారాలకు మించి ఖాళీగా ఉంటే పని సర్దుబాటు ద్వారా వాటిని భర్తీచేయాలి. పూర్వపు జిల్లాల్లో మంజూరు పోస్టుల్లో భర్తీ అయినవి కాకుండా మిగిలిన పోస్టులను బ్లాక్ చేయాలని ఆదేశించారు. ఖాళీలు, సీనియారిటీ జాబితాలను కౌన్సెలింగ్ వెబ్సైట్లో సంబంధిత జిల్లాల వెబ్సైట్లో కూడా పొందుపరుస్తారు. వెబ్ కౌన్సెలింగ్‌కు ఆన్లైన్లోనే దరఖాస్తులు.. – ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నిర్దేశిత వెబ్సైట్ ద్వారా బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇలా అందిన దరఖాస్తులను మాత్రమే బదిలీకి పరిగణిస్తారు. – ఆన్లైన్ సమర్పించాక దరఖాస్తుదారులు నిర్దిష్ట వెబ్సైట్ నుండి అప్లికేషన్ ప్రింట్‌ను తీసుకోవాలి. – వాటిపై సంతకంచేసి మండల విద్యాధికారి, హైస్కూల్ హెడ్మాస్టర్, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లకు అందజేయాలి. – దరఖాస్తుల స్వీకరణ తర్వాత, సంబంధిత అధికారులు తాత్కాలిక సీనియారిటీ జాబితాలను ప్రదర్శించాలి. – అభ్యంతరాలుంటే వాటిని స్వీకరించాలి. అవి పరిష్కరించిన తర్వాత, అధికార వెబ్సైట్లో తుది సీనియారిటీని ఎన్టైటిల్మెంట్ పాయింట్లతో చూపించాలి. – తప్పనిసరిగా బదిలీ అయ్యేవారు అన్ని అప్షన్లను ఎంచుకోవాలి. ఇలాంటి హెచ్ఎం, టీచర్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోకపోతే 3, 4 కేటగిరీల్లోని పాఠశాలల్లో ఉన్న ఖాళీలకు బదిలీచేస్తారు. – దరఖాస్తు చేసి ఆపై వారికి సమర్పించకపోతే, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు. ఆన్లైన్లో రూపొందించిన తుది జాబితాల ఆధారంగా సంబంధిత కమిటీల ఆమోదంతో బదిలీ ఉత్తర్వులు జారీ అవుతాయి. తప్పుడు సమాచారమిస్తే చర్యలు ఇక కమిటీ ఆమోదంతో బదిలీ ఉత్తర్వులు జారీచేసిన తర్వాత, కమిటీ కాంపిటెంట్ అథారిటీ ఆర్డర్లను సమీక్షించడం, సవరించడానికి వీల్లేదు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల ఫలితాలకు లోబడి ఉత్తర్వుల్లో షరతును చేర్చాలి. బదిలీ ఆర్డర్లు అందిన తర్వాత ప్రస్తుతం పనిచేస్తున్న ప్రదేశం నుండి తక్షణమే రిలీవ్ అవుతారు. తదుపరి తేదీన వారు కొత్త పాఠశాల్లో చేరాలి. పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు (సబ్జెక్ట్ టీచర్లతో సహా) పనిచేస్తూ బదిలీని పొందినట్లయితే, ప్రత్యామ్నాయం లేకుండా రిలీవ్ చేయరాదు. అలాగే, ఇతర స్థానాల విషయంలో కూడా ప్రత్యామ్నాయం తర్వాతే రిలీవ్ చేస్తారు. తప్పుడు సమాచారమిచ్చి, మార్గదర్శకాలు ఉల్లంఘిస్తే ప్రాసిక్యూషన్‌తో పాటు క్రమశిక్షణా చర్యలు తప్పవు. తప్పుడు సమాచారంపై సంతకం చేసిన హెచ్ఎం ఇతర అధికారులపైనా ఇవే చర్యలు ఉంటాయి. బదిలీ ఉత్తర్వులు అందిన అనంతరం ఎటువంటి ఆలస్యం లేకుండా పోస్టింగ్ స్థానంలో చేరాలి. అనధికారికంగా గైర్హాజరైతే మార్గదర్శకాల ప్రకారం క్రమశిక్షణా చర్యతో పాటు ‘నో వర్క్ నో పే’ నిబంధన వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీల షెడ్యూల్ ఇలా.. – ఖాళీల వివరాలు వెబ్సైట్లో ప్రదర్శన : డిసెంబర్ 12, 13 – బదిలీలకు దరఖాస్తు : డిసెంబర్ 14 నుండి 17 వరకు – దరఖాస్తుల వెరిఫికేషన్ : డిసెంబర్ 18, 19 – సీనియారిటీ జాబితాల ప్రదర్శన, అభ్యంతరాల అప్లోడ్ : డిసెంబర్ 20 నుండి 22 వరకు – అభ్యంతరాల పరిశీలన, ఫైనల్ చేయడం : డిసెంబర్ 23, 24 – ఫైనల్ సీనియారిటీ జాబితాల ప్రదర్శన : డిసెంబర్ 26 – వెబ్ఆప్షన్లు : డిసెంబర్ 27 నుండి జనవరి 1 వరకు – బదిలీ కోరుకున్న వారికి పాఠశాలల కేటాయింపు : జనవరి 2 నుండి 10 వరకు – కేటాయింపులో తేడాలుంటే అభ్యంతరాలు : జనవరి 11 – బదిలీ ఉత్తర్వులు డౌన్లోడ్ చేసుకోవడం : జనవరి 12 -
టీచర్ల బదిలీల షెడ్యూల్ ఖరారు
హైదరాబాద్ : టీచర్ల బదిలీల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 4,5 తేదీల్లో టీచర్ల ఖాళీల ప్రకటన వెలువడనుంది. జూన్ 5న ప్రభుత్వం, టీచర్ల నుంచి అభ్యంతరాలు స్వీకరించనుంది. జూన్ 6 నుంచి 10 వరకు దరఖాస్తు స్వీకరణ జరుగుతుంది. జూన్ 20 కల్లా టీచర్ల బదిలీల ప్రక్రియ పూర్తి అవుతుందని ప్రభుత్వం తెలిపింది. అలాగే ఆగస్టులో అంతర్ జిల్లా బదిలీలు ఉంటాయని పేర్కొంది. -
అయ్యో..వార్లు!
చక్రాయపేట మండలం కల్లూరుపల్లె సుగాలి తాండా జిల్లాలో మారుమూల కుగ్రామం. అనంతపురం జిల్లా సరిహద్దుల్లో ఉన్న ఈ పల్లెకు రహదారి కూడా సరిగా లేదు. బస్సు కాదు కదా.. ఆటోలు సైతం ఆవైపు తొంగి చూడవు. ఆ పల్లె వాసులకు జ్వరమొచ్చి టౌన్‌కు వెళ్లాలంటే నాలుగు కిలోమీటర్లు నడిచి క్రాస్ వద్దకు వెళ్లాలి. అక్కడి నుంచి వేంపల్లె 42 కిలోమీటర్లు, కదిరి 48, పులివెందుల 56, రాయచోటి 65 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ తాండాలో ఓ సర్కారు బడి ఉంది. ఆ బడిలో చదివే పిల్లలంతా గిరిజనులే. ఈ బడి మూడో కేటగిరిలో ఉంది. అంటే ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలకు సంబంధించి సంవత్సరానికి మూడు పాయింట్లు మాత్రమే వెయిటేజీ ఇస్తారు. మైదుకూరు, యర్రగుంట్ల, రైల్వేకోడూరు లాంటి పట్టణాల్లోని పాఠశాలలకూ మూడు పాయింట్లే. ఇదెక్కడి న్యాయం? - అశాస్త్రీయంగా పాఠశాలల కేటగిరీల విభజన - బదిలీల్లో నష్టపోనున్న మారుమూల ప్రాంత టీచర్లు - పట్టణాలు, పల్లెల పాఠశాలలకు సమాన పాయింట్లు - నాలుగో కేటగిరీకి నోచుకోని తాండా బడులు సాక్షి ప్రతినిధి, కడప : పాఠశాలల కేటగిరీల విభజనలో శాస్త్రీయత లోపించడం వల్ల త్వరలో చేపట్టనున్న ఉపాధ్యాయుల బదిలీల్లో గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న వారికి అన్యాయం జరగనుంది.ఉపాధ్యాయ బదిలీల్లో వెయిటేజీ ఎన్టైటిల్ పాయింట్లు కీలకమైనవి. బదిలీ లు నిర్వహించినప్పుడు వీటి ఆధారంగా ఉపాధ్యాయులకు సీనియారిటీ ర్యాంకులు కేటాయిస్తారు. ఒక ఉపాధ్యాయుడు ఒక పాఠశాలలో ఎంత కాలం నుంచి పనిచేస్తున్నాడన్న అంశంతోపాటు ఆ పాఠశాల ఏ కేటగిరీలో ఉంది.. అన్నదాన్ని బట్టి ఎన్టైటిల్ పాయింట్లు నిర్ణయిస్తారు. ఈ విధానం వల్ల మారుమూల ప్రాంతాల్లో పనిచేసే అయ్యవార్లు ఎక్కువ పాయింట్లు సాధించి సీనియారిటీ జాబితాలో ముందు వరసలో ఉంటారు. ఫలితంగా వీరు బదిలీల్లో మంచి స్థానాలు కోరుకునే అవకాశం ఉంది. అయితే కేటగిరీల విభజన పూర్తి అశాస్త్రీయంగా ఉండడంతో గ్రామీణ ప్రాంతాల ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముమ్మాటికీ ఆశాస్త్రీయమే రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలను నాలుగు కేటగిరీలుగా విభజించి పాయింట్లు కేటాయించారు. మొదటి కేటగిరీ కింద ఉన్న పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు సంవత్సరానికి ఒక పాయింటు మాత్రమే వెయిటేజీ ఇస్తున్నారు. రెండో కేటగిరీకి రెండు పాయింట్లు, మూడో కేటగిరీకి మూడు, నాలుగో కేటగిరీకి ఐదు పాయింట్లు ఇస్తున్నారు. కడప, ప్రొద్దుటూరు పట్టణాల్లోని పాఠశాలలను మొదటి కేటగిరీలో ఉంచిన యంత్రాంగం జమ్మలమడుగు, పులివెందుల, రాయచోటి, రాజంపేట, బద్వేల్ పట్టణాలల్లోని పాఠశాలలను రెండో కేటగిరీ కింద చేర్చారు. జిల్లాలో అత్యంత మారుమూల ప్రాంతాలల్లో ఉన్న 24 పాఠశాలలు మాత్రమే నాలుగో కేటగిరీ కింద ఉన్నాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా మూడో కేటగిరీ పాఠశాలలను గుర్తించే విషయంలోనే అధికారులు తప్పుటడుగు వేశారని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక్కడ పట్టణాలు, పల్లెలను ఒకే గాటికి కట్టేశారు. మైదుకూరు, యర్రగుంట్ల మున్సిపాలిటిలతోపాటు, నియోజకవర్గ కేంద్రాలైన రైల్వేకోడూరు, కమలాపురంలతో సహా మండల కేంద్రానికి 35 కిలోమీటర్లు దూరంలో ఉన్న కల్లూరుపల్లె తాండా, సిద్దవాండ్లపల్లె, కెకెవారిపల్లె, ఉక్కుశిలవాండ్లపల్లె, దిద్దికుంటపల్లెలాంటి మారుమూల పల్లెల్లోని వందలాది పాఠశాలలను సైతం మూడో కేటగిరీలోనే ఉంచారు. నివాస యోగ్యమైన పెద్ద పట్టణాలకు వాహన సౌకర్యం లేని సుదూర గ్రామాలకు సమాన పాయింట్లు ఇస్తున్నారు. ఈనెల చివ రిలో నిర్వహించనున్న బదిలీలకు ముందే మూడో కేటగిరీని సవరించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. మార్పులు అత్యవసరం.. కేటగిరీలను విభజించే విషయంలో అధికారులు ఇంటి అద్దె అలవెన్సును ఆధారం చేసుకోవడం వల్లే బదిలీలల్లో గ్రామీణ ప్రాంత అయ్యవార్లు తీవ్రంగా నష్టపోతున్నారన్నదీ నిర్వివాదాంశం. హెచ్ఆర్ఏతో సంబంధం లేకుండా పట్టణం నుంచి ఆయా పల్లెలు ఎంతదూరంలో ఉన్నాయన్నదాన్ని బట్టి కేటగిరీలను విభజించి ఉంటే సముచితంగా ఉండేదని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉపాధ్యాయులు ఎవరూ పల్లెల్లో నివసించడం లేదు. 95 శాతం మంది అయ్యవార్లు ప్రతిరోజు పట్టణాల నుంచే ఏదో ఒక వాహనంలో పాఠశాలలకు వచ్చి వెళ్లుతున్నారు. బదిలీల్లో ఉపాధ్యాయులందరూ టౌన్‌కు దగ్గరలో ఉన్న పాఠశాలలనే కోరుకుంటున్నారు. అలాం టప్పుడు పట్టణానికి దూరంగా ఉన్న పాఠశాలలకు అధిక పాయింట్లు కేటాయించడం ద్వారా అసమానతలను రూపు మాపవచ్చన్నది మేధావుల అభిప్రాయం. పల్లెలోనే నివాసం ఉంటున్నా.. మా సొంత ఊరు జమ్మలమడుగు దగ్గర వద్దిరాల. ఐదేళ్లుగా తాండా బడిలో పనిచేస్తున్నా. పల్లెలోనే నివాసం ఉంటూ పిల్లలకు చదువు చెబుతున్నా. మా పాఠశాల మూడో కేటగిరీలో ఉండడంతో బదిలీల్లో వెయిటేజీ పాయింట్లు తక్కువగా వస్తున్నాయి. దీంతో మరో ఐదేళ్లు పనిచేసినా మా ఏరియాకు వెళ్లలేని పరిస్థితి. - దైవచిత్తం, సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుడు, ఎంపీపీ స్కూల్, కల్లూరుపల్లె నాలుగో కేటగిరీలోకి చేర్చాలి.. ఏ సౌకర్యాలు లేని కల్లూరుపల్లె సుగాలితాండా లాంటి అత్యంత మారుమూల పాఠశాలలను నాలుగో కేటగిరీలో చేర్చాలి. పాయింట్లు ఎక్కువ ఉంటే సౌకర్యాలు లేకున్నా కొందరు ఉపాధ్యాయులైనా బదిలీల్లో ఇక్కడికి రావడానికి ఉత్సుకత చూపుతారు. పాయింట్లు పెంచకపోతే బదిలీల్లో ఇలాంటి పాఠశాలలను ఏ ఉపాధ్యాయుడూ కోరుకోరు. చివరకు పాఠశాల మూత పడే ప్రమాదం ఉంది. - బి.నాగేశ్వరరావు, ప్రధానోపాధ్యాయుడు, ఎంపీపీ స్కూల్, కల్లూరుపల్లె తాండా.