అక్రమార్కుల గుండెల్లో వణుకు
తప్పించుకునే మార్గాల కోసం అన్వేషణ
ఫోన్ కాల్స్‌కూ స్పందించని వైనం
సాక్షి ప్రతినిధి, గుంటూరు : సీసీఐలో చోటు చేసుకున్న భారీ అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టడంతో అవినీతి అధికారులు వణికిపోతున్నారు. గుంటూరులోని సీసీఐ కార్యాలయంలో బుధవారం సీబీఐ అధికారులు నిర్వహించిన విచారణలో కీలక సమాచారాన్ని సేకరించారు. కొన్ని రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు నామ్‌కే వాస్తే దర్యాప్తు కొనసాగుతుందని, విచారణ సమయానికి రికార్డులు తారుమారు చేసి గండం నుంచి బయటపడవచ్చని భావించిన వీరంతా కలవరం చెందుతున్నారు.
ఈ అక్రమాల్లో సీసీఐ, మార్కెటింగ్ శాఖలు, దళారులు, బయ్యర్లు, స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్లుల యజమానులు భాగస్వాములుగా ఉన్నారు. ప్రజాప్రతినిధుల బంధువులమని, అనుచరులమని పనులు చేయించుకున్న వారంతా సీబీఐ రంగ ప్రవేశంతో సెల్‌ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు.
రైతుకు దక్కని మద్దతు ధర..
రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 43 సీసీఐ కోనుగోలు కేంద్రాల్లో భారీ అవినీతి చోటు చేసుకుంది. మొత్తం 93 లక్షల క్వింటాళ్లను కొనుగోలు కేంద్రాల ద్వారా సీసీఐ కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. టీడీపీలో సర్పంచ్ నుంచి రాష్ట్ర మంత్రి వరకు భారీగా వ్యాపారం కొనసాగించారు. రైతుల నుంచి క్వింటాలు రూ.3000కు కొనుగోలు చేసి రూ.4000కు సీసీఐ కొనుగోలు కేంద్రానికి విక్రయించి క్వింటాకు వెయ్యి రూపాయల లాభం పొందారు.
వీటితోపాటు రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తిని కొనుగోలు కేంద్రాలకు తరలించకుండా నేరుగా జిన్నింగ్ మిల్లులకు తరలించి రవాణా చార్జీలను స్వాహా చేశారు. ఈ రెండు వ్యవహారాల్లో రూ.400 కోట్ల అవినీతి జరగడంతో ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర సామాన్యరైతుకు దక్కకుండా పోయింది. కృష్ణా జిల్లా నందిగామ సీసీఐ కొనుగోలు కేంద్రానికి రాష్ట్రమంత్రి పత్తిపాటి పుల్లారావు అనుచరులు లక్ష క్వింటాళ్లకు పైగా విక్రయించినట్లు విశ్వసనీయ సమాచారం.
అక్కడి కొనుగోలు కేంద్రంలో 1.46 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేస్తే, మంత్రి అనుచరులే లక్ష క్వింటాళ్లను అమ్మారు. వీరంతా తెలంగాణ రాష్ట్రం నుంచి క్వింటా రూ. 2700 నుంచి రూ.3000 వరకు కొనుగోలు చేసి నందిగామ సీసీఐ కేంద్రానికి క్వింటా రూ. 4000 చొప్పున అమ్మినట్లు సమాచారం.
మంత్రి మిల్లును అద్దెకు తీసుకున్న సీసీఐ..
గణపవరం వేలూరు డొంకలో ఉన్న మంత్రి పుల్లారావుకు చెందిన స్పిన్నింగ్ మిల్లులో జిన్నింగ్, టీఎంసీ యూనిట్లను సీసీఐ అద్దెకు తీసుకొని పెద్ద ఎత్తున పత్తిని జిన్నింగ్ చేశారు. మంత్రి అనుచరులు రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తిని కొనుగోలు కేంద్రానికి తరలించకుండా ఈ మిల్లుకే తరలించి రవాణా చార్జీలు స్వాహా చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్, సీసీఐ అధికారులు కీలకంగా వ్యవహరించారు. ఈ వ్యవహారంలో మార్కెటింగ్‌శాఖ జేడీ నుంచి యార్డు కార్యదర్శుల వరకు పెద్ద ఎత్తున ముడుపులు అందాయి.
మార్కెటింగ్‌శాఖ మంత్రి జిల్లాలో అధికారుల లీలలు
మార్కెటింగ్ శాఖ అధికారులు సైతం దోపిడీకి పాల్పడ్డారు. క్వింటా పత్తికి ప్రభుత్వం నిర్ణయించిన సెస్ రూ.10 నుంచి రూ.13 ఉంటే, మార్కెట్ యార్డు అధికారులు నియమించిన వ్యక్తులు క్వింటాకు రూ. 40 నుంచి 50 వరకు వసూలు చేస్తున్నారు. సీసీఐ బయ్యర్లు నేరుగా పత్తిని జిన్నింగ్ మిల్లులకు తరలించినా యార్డు అధికారులకు మామూళ్లు అందజేయాల్సిందే.
ఇలా వసూలు చేసిన నగదును రోజూ యార్డు ఉన్నతాధికారి మొదలు కిందస్థాయి అధికారి వరకు పంచుకుంటారు. ఇలా జిల్లాలోని 11 సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో మార్కెటింగ్ శాఖ అధికారులు చక్రం తిప్పుతున్న వ్యవహారంపైనా సీబీఐ అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది.
సీసీఐ అవినీతిపై సీబీఐ విచారణ
Published Fri, May 1 2015 12:02 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement
Advertisement