![CBI issued notice to Sujana Chowdary to appear before the court - Sakshi](/styles/webp/s3/article_images/2019/04/30/SU%5D.jpg.webp?itok=MznfRE_D)
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ టీడీపీ ఎంపీ సుజనా చౌదరి హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ నోటీసులకు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ నిలిపేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐలను ప్రతివాదులుగా చేర్చారు. 2017లో నమోదు చేసిన కేసు దర్యాప్తులో భాగంగా స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు తమ ముందు హాజరు కావాలంటూ సీబీఐ ఈ నెల 22, 27 తేదీల్లో నోటీసులు జారీ చేసిందని సుజనా పిటిషన్‌లో పేర్కొన్నారు.
చెన్నైకి చెందిన బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్, ఆ కంపెనీ అధికారులతో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఆ కంపెనీపై నమోదు చేసిన కేసులో తనను హాజరు కావాలని సీబీఐ ఎందుకు నోటీసులు జారీ చేసిందో అర్థం కావట్లేదన్నారు. ఈ నోటీసుల ద్వారానే తనకు బెస్ట్ అండ్ క్రాంప్టన్‌తోపాటు మరికొందరు వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందన్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తప్పుడు ఖాతాలతో తరలించారన్న ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసిందన్నారు. కేవలం ఖాతా పుస్తకాల్లో అమ్మకాలు, కొనుగోళ్లు జరిగినట్లు చూపి బ్యాంకులను రూ.72 కోట్ల మేర మోసం చేసినట్లు సీబీఐ ఆరోపిస్తోందన్నారు. తన ప్రతిష్టను దెబ్బ తీసే చర్యల్లో భాగంగానే ఈ నోటీసులు జారీ చేశారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment