యరపతినేని అక్రమ మైనింగ్‌పై సీబీ‘ఐ’ | CBI on Illegal Mining of Yarapatineni Srinivasarao | Sakshi
Sakshi News home page

యరపతినేని అక్రమ మైనింగ్‌పై సీబీ‘ఐ’

Published Thu, Sep 5 2019 4:47 AM | Last Updated on Thu, Sep 5 2019 12:21 PM

CBI on Illegal Mining of  Yarapatineni Srinivasarao - Sakshi

సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, నడికుడి, కేశానుపల్లి, దాచేపల్లి, కొండమోడులతో పాటు మరికొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీకి చెందిన గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు భారీ స్థాయిలో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని నిర్ధారణ అయిన నేపథ్యంలో.. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని సీబీఐని కోరాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావిం చారు. యరపతినేని మైనింగ్‌ అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారని, ఈ పిటిషన్‌పై తీర్పును వెలువరించాల్సి ఉందని ఆయన ధర్మాసనానికి గుర్తు చేశారు.

ఇప్పుడు ఈ కేసులో కోర్టు తీర్పు అవసరం లేదని, ప్రభుత్వమే యరపతినేని అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని నిర్ణయించిందని, ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తనకు అధికారిక సమాచారం ఇచ్చారని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. గత విచారణలో కోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలను.. ఈ కేసులో భారీ అక్రమాలు జరిగినట్లు లభించిన ప్రాథమిక ఆధారాలను.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కావడంతో సీఐడీ దర్యాప్తును కొనసాగిస్తే అది కక్ష సాధింపుగా భావించేందుకు అవకాశం ఉందని.. దీంతో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని నిర్ణయించిందని చెప్పారు.

అందువల్ల టీజీవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని రీ ఓపెన్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన హైకోర్టు కృష్ణారెడ్డి వ్యాజ్యాన్ని సోమవారం రీ ఓపెన్‌ చేస్తామని తెలిపింది. యరపతినేని ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా లైమ్‌స్టోన్‌ తవ్వకాలు చేస్తున్నారని, కోట్ల రూపాయల మేర ప్రభుత్వానికి పన్నులు, సీనరేజీ చార్జీలు ఎగవేశారంటూ మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి 2016లో హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అలాగే యరపతినేని అక్రమ మైనింగ్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఆయన హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం యరపతినేని అక్రమ మైనింగ్‌పై దర్యాప్తు జరపాలని కేంద్ర దర్యాప్తు సంస్థలను మీరే ఎందుకు కోరకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీబీఐ విచారణ కోరాలని నిర్ణయించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement