
పోస్టాఫీసులో సీబీఐ దాడులు
సబ్ పోస్ట్‌మాస్టర్, ట్రెజరర్ అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి వ్యవహారంలో విశాఖ స్కేప్‌కు సంబంధాలు న్నాయంటూ రేగిన కలకలం మరువకముందే మరో సంచలనానికి నగరం వేదికైంది. పాత నోట్లను నిబంధనలకు విరుద్ధంగా మార్చారనే అభియోగాలపై ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని సబ్ పోస్టాఫీస్‌లో ఇద్దరు ఉన్నతోద్యోగులను సీబీఐ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మరో ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను సీబీఐ ఎస్పీ ఆర్.గోపాలకృష్ణారావు వెల్లడించారు. పాత నోట్ల రద్దు తర్వాత వాటిని మార్చుకునేందుకు బ్యాంకులతో పాటు పోస్టాఫీసుల్లోనూ అవకాశం కల్పించారు. ఇందులో అక్రమాలకు అవకాశం ఉండటంతో సీబీఐ నిఘా వేసింది.
ఈ క్రమంలోనే ఆంధ్ర విశ్వవిద్యాలయం సబ్ పోస్టాఫీస్ నుంచి రూ.20 లక్షలకుపైగా అక్రమంగా నోట్ల మార్పిడి జరిగినట్లు సమాచారం అందింది. రహస్య పరిశోధన అనంతరం సమాచారం నిజమేనని నిర్ధారించుకున్న అధికారులు ఈ నెల 14న ఆకస్మికంగా దాడి చేశారు. రికార్డులు తనిఖీ చేశారు.
బంధువుల కోసం అక్రమాలు
సబ్ పోస్టుమాస్టర్ కె.లలిత, ట్రెజరర్ షేక్ ఎస్ శామ్యూల్ జాన్‌లు తమ బంధువులు, స్నేహితులకు చెందిన రూ.21.73 లక్షల నగదును నిబంధనలకు విరుద్ధంగా మార్చినట్టు తనిఖీల్లో బయటపడింది. పాత నోట్లు తీసుకుని కొత్త రూ.2 వేల నోట్లు ఇచ్చినట్లు తేలింది. దీంతో వీరిపై పలు ఐపీసీ సెక్షన్లు, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇద్దరు పోస్టల్ అధికారుల నివాసాల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం సబ్ పోస్టాఫీసులోని మరో ఆరుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.