సవాల్‌గా ‘ఎర్ర’దుంగల భద్రత
* ఇప్పటికే గోదాముల్లో సీసీ కెమెరాలు
* తాజాగా రేడియో ఫ్రీక్వెన్వీ సాఫ్ట్‌వేర్
* పోలీసుల సాయం కోరుతున్న వైనం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వేలానికి సిద్ధంగా ఉన్న ఎర్రచందనం దుంగలకు భద్రత కల్పించడం అటవీశాఖకు సవాల్‌గా మారింది. చిత్తూరు, వైఎస్సార్ కడప, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని అటవీశాఖ గోదాముల్లో వేలాది టన్నుల ఎర్రచందనం దుంగలున్నాయి. వీటిని లూటీ చేసేందుకు స్మగ్లర్లు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందడంతో భద్రత కల్పించే బాధ్య త అటవీశాఖపై పడింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 19న దుంగలను వేలం వేయాల్సి ఉంది. ఎక్కువ మంది బిడ్డర్లను ఆకర్షించే ప్రయత్నంలో వేలంను వచ్చేనెల 10వ తేదీకి వాయిదా వేశారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు గోదాముల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తాజాగా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా భద్రత కల్పిం చాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ప్రతి దుంగకు రేడియో ఫ్రీక్వెన్సీ పరికరంతో ఉన్న టాగ్ ఏర్పాటు చేయనున్నారు. దుంగలను కదిలిస్తే ‘బీప్’ శబ్దం వచ్చేలా ఈ సాఫ్ట్‌వేర్ రూపొందించారు. కంట్రోల్ యూనిట్‌ను ఒకే చోట కాకుండా పలుచోట్ల ఏర్పాటు చేసుకుని, కార్యాలయంతో అధికారుల వద్ద కూడా పెట్టుకుని నిరంతరం పర్యవేక్షించవచ్చని తెలిసింది.
అంతర్జాతీయ మార్కెట్ లో టన్ను ఎర్రచందనం ధర రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు పలుకుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఒక్క దుంగ పోయినా లక్షల్లో నష్టం వస్తుందని సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. గోదాముల వద్ద భద్రత కోసం పోలీసుల సాయం కూడా తీసుకునే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం దేశ విదేశాల నుంచి వస్తున్న వ్యాపారులు ఎర్ర చందనం గోదాముల్లో ఉన్న నిల్వలను చూసి వెళుతున్నారు.
జపాన్, చైనా, యునెటైడ్ ఎమిరేట్స్, సింగపూర్, ఆస్ట్రేలియా వ్యాపారులు దుంగలను చూసి సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ దేశాల నుంచి 123 కంపెనీలకు చెందిన ప్రతినిధులు వచ్చినట్లు అధికారులు ధ్రువీకరిస్తున్నారు. స్వదేశం నంచి దాదాపు 260 కంపెనీల ప్రతినిధులు వచ్చినట్లు చెబుతున్నారు. వేలం పూర్తయ్యే వరకు వీటి భద్రత కత్తిమీద సాములా తయారైంది.