సీసీఐ మాయాజాలం | CCI | Sakshi
Sakshi News home page

సీసీఐ మాయాజాలం

Published Thu, Apr 23 2015 2:23 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

CCI

సాక్షి ప్రతినిధి, గుంటూరు : పత్తి కొనుగోళ్లలో అడుగడుగునా సీసీఐ అక్రమాల మాయాజాలం ప్రదర్శిస్తోంది. ఈ విషయంలో సీసీఐ అధికారులతోపాటు బయ్యర్లు, పాలకపార్టీ ప్రజాప్రతినిధుల పాత్ర అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. సీసీఐకి నాణ్యమైన పత్తిని సరఫరా చేయాల్సిన బయ్యర్లు, అధికారులకు  స్థానిక స్పిన్నింగ్ మిల్లుల్లో వాటాలు ఉండటంతో పత్తిరైతు చిత్తుగా మోసపోతున్నాడు. జిల్లాలోని 11 సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో ఈ ఏడాది పత్తి కొనుగోళ్లు జరిగాయి. పత్తి నాణ్యత, రేటు నిర్థారణ, గోడౌన్లు, స్పిన్నింగ్ మిల్లుల ఎంపికలో బయ్యర్లు కీలక బాధ్యత వహిస్తున్నారు.
 
 వీరిలో ఎక్కువ మందికి జిల్లాలోని స్పిన్పింగ్, జిన్నింగ్ మిల్లుల్లో వ్యాపార భాగస్వామ్యం ఉండటంతో ముఖ్య నిర్ణయాలప్పుడు ‘వ్యాపార భాగస్వామ్యాన్ని’ పరిగణనలోకి తీసుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి. తిమ్మాపురం పరిధిలోని ఒక స్పిన్నింగ్ మిల్లును సీసీఐ బయ్యర్లే స్వయంగా ఏర్పాటు చేసి బినామీల పేర్లతో నిర్వహిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు.
 
 గోడౌన్‌ల నిర్థారణలోనూ...
 కొంతకాలంగా అనుమానాస్పదంగా సీసీఐ గోడౌన్లలో జరుగుతున్న అగ్నిప్రమాదాల వెనుక వాస్తవాలు వెలుగులోకి రావడం లేదు. మార్కెట్‌యార్డుల్లో కొనుగోలు చేసిన తరువాత జిన్నింగ్ మిల్లులో జిన్నింగ్ చేయించిన పత్తిని బేళ్లుగా తయారుచేస్తారు. బేళ్లుగా తయారైన పత్తిని నేరుగా స్పిన్నింగ్, టెక్స్‌టైల్ మిల్లులకు పంపటానికి అనువుగా ఉంటుంది. జిన్నింగ్ మిల్లుల నుంచి వచ్చిన పత్తిబేళ్లను సీసీఐ నిర్ధారించిన గోడౌన్లలో నిల్వ చేస్తారు. అనంతరం వీటిని విదేశాలకు ఎగుమతి చేస్తారు.
 
  లేదా స్పిన్నింగ్ మిల్లులకు అమ్ముతారు. సీసీఐ అధికారులు నిర్దేశించిన గోడౌన్లలోనే వీటిని నిల్వ చేస్తారు. వీటిల్లో అగ్నిప్రమాదాలు వాటిల్లకుండా ఉండటానికి అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు. 2013 ఏప్రిల్ 13వ తేదీ రాత్రి యడ్లపాడు మండల పరిధిలో ఉన్న సీసీఐ నిల్వ ఉంచిన గోడౌన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. అందులో నిల్వ ఉన్న 2919 బేళ్లు దగ్ధమయ్యాయి. వీటి విలువ సుమారు రూ.8 కోట్లు ఉంటుందని అంచనా. సీసీఐకి చెందిన నాణ్యమైన పత్తిబేళ్ల స్థానంలో నాసిరకం బేళ్లను ఉంచి, అగ్నిప్రమాదం కథ అల్లారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.
 
 మంత్రిగారి కుమార్తె వివాహం కోసం...
 సీసీఐ అధికారుల తప్పుల్లో ఇక్కడ ప్రముఖపాత్ర పోషించేది మాత్రం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కంపెనీల ప్రతినిధులన్నది బహిరంగ రహస్యమే. అప్పట్లో అగ్నిప్రమాదం ద్వారా లబ్ధిపొందినా, సీసీఐ కొనుగోళ్లు ద్వారా రైతుల పేర్లతో జేబులు నింపుకున్నా స్థానిక  దళారీల పాత్ర కీలకం. ప్రతి ఏడాది రైతుల వద్ద నుంచి పత్తి కొనుగోలు చేస్తున్న దళారుల్లో ఎక్కువ మంది మంత్రి అనుచరులే.
 
  సీసీఐ పత్తి కొనుగోళ్లు 2014 సెప్టెంబర్‌లో ప్రారంభం కాగా చిలకలూరిపేటలో మాత్రం మంత్రి కుమార్తె వివాహ వేదిక మార్కెట్ యార్డు కావటంతో నవంబర్‌లో ప్రారంభించారు. ఇలా ప్రారంభించిన సీసీఐ కొనుగోళ్లు మందకొడిగాసాగాయి. అప్పటికే రైతులు ప్రైవేటు వ్యాపారుల పేరుతో చెలామణి అయిన మంత్రి అనుచరులకు క్వింటాలుకు రూ.3,000 నుంచి రూ. 3,200కు అమ్మేశారు. నవంబర్‌లో సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభం కావటంతో రైతువద్ద నుంచి కొనుగోలు చేసిన పత్తిని వారి పేర్లతో రూ 4050కు సీసీఐకు అమ్మి సొమ్ము చేసుకుని లబ్ధిపొందారు.
 
 ఏటా ఇదే తంతు....
 స్థానికంగా సీసీఐ కొనుగోళ్లలో దళారీలదే హవా. రైతులు నేరుగా కొనుగోలు కేంద్రాలకు చేరుకోకుండా దళారీలు సిండికేట్‌గా మారి ధర నిర్ణయిస్తారు. బయట నుంచి ఎవరైనా నియోజవర్గ పరిసరప్రాంతాల్లో పత్తి కొనుగోలు చేయటానికి వచ్చి అధిక ధర నిర్ణయిస్తే వారిని బెదిరించి పంపేస్తారు. గతంలో ఇలా బయట ప్రాంతాల నుంచి వచ్చి రైతుల వద్ద పత్తి కొనుగోలు చేసిన వ్యాపారులు స్థానిక సిండెకేట్ దళారీలకే అమ్మి పలాయనం చిత్తగించారు. సీసీఐ అధికారుల అందదండలతో ఏటా కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యవహారాలపై సీబీఐచే విచారణ జరిపితే మరెన్ని వాస్తవాలు వెలుగు చూసే  అవకాశం ఉంది.
 
 దుకాణాలు తెరిచిన టీడీపీ నేతలు
 తమ నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటైన పత్తికొనుగోలు కేంద్రాల నుంచి టీడీపీ పాలకులు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ జరిగే అక్రమాల గురించి తమకంతా తెలుసని సీసీఐ, మార్కెటింగ్‌శాఖల అధికారులను బెదిరించి ఆ మొత్తాలను గుంజారనే ఆరోపణలు లేకపోలేదు. రైతుల పొలాల నుంచి మార్కెట్‌యార్డుకు కాకుండా నేరుగా మిల్లులకు చేరిన పత్తికి రవాణా బిల్లులు పెట్టి రెండుశాఖల అధికారులు అవినీతికి పాల్పడితే, వాటిలోనూ ఈ పాలకులు వాటాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement