Spinning Mills
-
స్పిన్నింగ్ మిల్లులపై విద్యుత్ భారమంటూ 'ఈనాడు' అసత్య కథనం
-
గ్రేట్ జర్నీ..పత్తి రైతుల కాగడా..
ఆమె ఓ ఉద్యమజ్యోతి. తాను వెలుగుతూ... పదిమందికి వెలుగులు పంచే కాగడా. ‘ఏ ఫ్రేడ్ హిస్టరీ – ద జర్నీ ఆఫ్ కాటన్ ఇన్ ఇండియా’లో వత్తిలా కాలిపోతున్న పత్తి రైతు జీవితాన్ని రాశారు. ఇంగ్లిష్ లిటరేచర్ చదివిన ఓ యువతి సామాజిక కార్యకర్తగా, మల్కా పరిరక్షకురాలిగా రూపాంతరం చెందడానికి దారి తీసిన పరిస్థితులను వివరిస్తుందా పుస్తకం. డెబ్బై ఐదేళ్లు దాటిన ఉజ్రమ్మ లైఫ్ జర్నీతోపాటు పెట్టుబడిదారుల గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా ఆమె తన ఉద్యమాన్ని మౌనంగా విస్తరింపచేస్తున్న వైనం కనిపిస్తుంది. అభ్యుదయ హైదరాబాదీ ఉజ్రమ్మ హైదరాబాద్‌లో అభ్యుదయ కుటుంబంలో పుట్టారు. నానమ్మ ఉద్యమస్ఫూర్తి వల్ల తమ కుటుంబంలో ఆడపిల్లల చదువుకు మార్గం సుగమమైందని చెప్పారామె. చిన్నాన్న సజ్జత్ జహీర్ కమ్యూనిస్ట్ భావాల ప్రభావం తన మీద ఉందంటారామె. సామాజికాంశాల మీద స్పందించే తత్వం చిన్నాన్న నుంచే వచ్చిందని చెప్పే వజ్రమ్మ ఉద్యమపోరు బ్రిటిష్ కాలంలోనే మొదలైంది. విదేశాల స్పిన్నింగ్ మిల్లులు సూచించిన పత్తి వంగడంతో మనదేశంలో పంట పండించడం మొదలైననాడే ఆమె పత్తి రైతుల ఆత్మహత్యలను ఊహించగలిగారు. ఆ దోపిడీ పత్తితో ఆగదని, దానికి అనుబంధ రంగమైన చేనేతకు కూడా ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. కష్టం మనది... లాభం వాళ్లది ‘‘మనదేశంలో రకరకాల వాతావరణం, భౌగోళిక వైవిధ్యతల కారణంగా ప్రాంతానికి ఒక రకం పత్తి పండుతుంది. ఆ పత్తి నుంచి వచ్చే దారం, ఆ దారంతో నేసే దుస్తులలోనూ భిన్నత్వం ఉంటుంది. ఇంతటి వైవిధ్యతను కాలరాసింది ఒక్క స్పిన్నింగ్ యంత్రం. విదేశాల్లో ఏర్పాటైన వస్త్ర పరిశ్రమలకు ముడిసరుకు కావాలి. ఆ ముడిసరుకు వాళ్లు తయారు చేసుకున్న యంత్రాలకు అనుగుణంగా ఉండాలి. అందుకోసం మన రైతులకు పత్తి గింజలనిచ్చి... ‘పంట పండించండి, ఉత్పత్తిని మేమే కొంటాం’ అని చెప్పారు. అలా పత్తి గింజ వాళ్లదైంది, దారం వాళ్లదే అయింది. దారం ధరను నిర్ణయించే అధికారమూ వాళ్లదే అయింది. దాంతో చేనేత రంగం ముడిసరుకు సమస్యలో పడిపోయింది. మనది కాని వంగడం తో తెగుళ్లు ఎక్కువ. దాంతో పత్తిని పండించే రైతు బతుకుకు లాభాలు వస్తాయనే భరోసా లేదు. దారం ధర నిర్ణయించేది వాళ్లే... దాంతో చేనేత మగ్గం అంధకారంలో మగ్గిపోయింది. లాభాలు మాత్రం స్పిన్నింగ్ మిల్లులవి. లాభాలను బట్టే సమాజంలో గౌరవాల స్థాయిలో కూడా ఎంతో తేడా. పత్తి రైతు, చేనేతకారుడు ఈ విషవలయం నుంచి బయటపడి ఆర్థికంగా బలపడాలి. దేశంలో అనేక ప్రాంతాల్లో పత్తి రైతులను, చేనేత పరిశ్రమలను స్వయంగా చూశాను. చేనేతకారులు తమ ఉత్పత్తులు మార్కెట్ చేసుకోవడానికి ‘దస్తకార్ ఆంధ్ర’ రూపకల్పనలో పనిచేశాను. పదమూడేళ్లు గా మల్కా పరిరక్షణ మీద దృష్టి పెట్టాను. మల్కా అంటే ఖాదీ వంటి ఒక వస్త్ర విశేషం. ఇలాంటిది ప్రపంచంలో మరెక్కడా ఉండదు. సిరిసిల్లలో డెబ్బై కుటుంబాలు మల్కా పరిరక్షణలో పని చేస్తున్నాయి. యూరప్, యూఎస్‌లు తాము అనుసరిస్తున్న సైన్స్‌కి మోడరన్ సైన్స్ అని ఒక ముద్ర వేసుకుని, థర్డ్ వరల్డ్ కంట్రీస్‌ని తమ గుత్తాధిపత్యంలోకి తెచ్చుకోవడానికి కుట్ర పన్నాయి. మన యువతకు చెప్పేది ఒక్కటే. విదేశాల మీద ఆధారపడే పరిస్థితి నుంచి మనం బయట పడాలి. మన పత్తి నుంచి దారం తీయడానికి అధునాతన యంత్రాలను కనిపెట్టండి. మన పత్తి, మన దారం, మన నేత... వీటన్నింటికీ మనమే ధర నిర్ణయించగలిగిన వాళ్లమవుతాం’’ అంటారామె. సెలబ్రిటీల సెలబ్రిటీ ఉజ్రమ్మ నిరాడంబరంగా ఉంటారు. సెలబ్రిటీలు ఆమెతో ఫొటో తీసుకోవాలని ముచ్చటపడతారు. చేనేత అనగానే ముఖం చిట్లించే వారి చేత ‘ఐ లైక్ హ్యాండ్ వీవెన్ ఇండియన్ కాటన్’ అని స్టైలిష్‌గా పలికిస్తున్నారామె. పత్తి రైతు బతుకుకు కొరివి పెడుతున్న కంపెనీల బారి నుంచి రైతు జీవితానికి కాగడా పట్టే ప్రయత్నం చేస్తున్నారు. తన ఉద్యమానికి వారసులుగా కొత్తతరం చేనేతకారులను తయారు చేస్తున్నారు. వారి కోసం మెహిదీపట్నంలో మల్కా మార్కెటింగ్ ట్రస్ట్ ద్వారా మార్కెటింగ్ మెళకువలు నేర్పిస్తున్నారు ఉజ్రమ్మ. – వాకా మంజులారెడ్డి -
ఏపీలో స్పిన్నింగ్ మిల్లులను ఆదుకోండి..
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని స్పిన్నింగ్ మిల్లులను కేంద్ర ప్రభుత్వమే సంక్షోభం నుంచి గట్టెక్కించాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన బుధవారం జీరో అవర్ సమయంలో ఈ ప్రతిపాదనను రాజ్యసభలో ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలోని స్పిన్నింగ్ మిల్లులు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయని తెలిపారు. మిల్లులుకు సరఫరా చేసే పత్తి ధర అమాంతంగా పెరిగిపోవడం, సేకరించిన పత్తి నిల్వలను సీసీఐ దాచేస్తుందని ఆరోపించారు. దీంతో టెక్స్టైల్ రంగం విపరీతమైన నష్టాలలో కూరుకుపోతుందని వెల్లడించారు. కాగా, భారమవుతున్న ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడానికి ప్రొడక్షన్ హాలిడే ప్రకటించాల్సిన దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోతున్న స్పిన్నింగ్ మిల్లులను కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. -
మహిళల శ్రమ దోపిడీకి ‘పిల్స్’
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణాదిలోనే వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన తమిళనాడులో దాదాపు నాలుగువేల ఫ్యాక్టరీలు, స్పిన్నింగ్ మిల్లులు ఉండగా, వాటిల్లో దాదాపు మూడు లక్షల మంది మహిళలు పనిచేస్తున్నారు. వారు రోజంతా పది గంటలపాటు అవిశ్రాంతంగా పనిచేస్తేనే వారికి పూర్తి వేతనం వస్తుంది. మహిళలు రుతుస్రావం సమయంలో కనీసం మూడు రోజులపాటు సెలవు పెట్టాల్సి వస్తుంది. అలా చేస్తే ఉద్యోగాలే పోతాయి. అందుకని వారు ఆ సమయాల్లో కూడా ఫ్యాక్టరీల్లో పనికి హాజరవుతున్నారు. రుతుస్రావం సందర్భంగా వచ్చే నీరసం, బలహీనత పది గంటల పాటు పనిచేయనీయదు. వారి పనిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే ‘టైమ్‌కీపర్’ వారికి గంట విశ్రాంతి కూడా ఇవ్వరు. మూత్రానికి వెళ్లిన పది నిమిషాల్లో తిరిగి రావాలి. మూత్రానికి కూడా ఎక్కువ సార్లు పోనీయరు. పోతే గంటకింతా, అరగంటకింతా అని వేతనాలు కట్ చేస్తారు. మరి రుతుస్రావం సమయంలో మహిళలు పనిచేసేది ఎలా ? దీనికి సులభమైన మార్గాన్ని ఫ్యాక్టరీ యాజమాన్యాలే కనిపెట్టాయి. రుతుస్రావం సమయంలో మహిళలకు పెయిన్ కిల్లర్స్ లాంటి మాత్రలను టైమ్ కీపర్ల ద్వారా యాజమాన్యాలే సరఫరా చేస్తున్నాయి. ‘థామ్సన్ రాయటర్స్ ఫౌండేషన్’ ఇటీవల వస్త్ర పరిశ్రమల్లో పనిచేస్తోన్న వంద మందికి పైగా మహిళా కార్మికులను ఇంటర్వ్యూ చేయగా వారిలో 90 శాతం మంది ఇలాంటి పిల్స్ తీసుకొని పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇది చాలా భయంకరమైన విషయం. తరచుగా ఈ పిల్స్‌ను వాడడం వల్ల మహిళల్లో మానసిక ఒత్తిడి, గాబరా పెరుగుతుంది. గర్భాశయం వద్ద క్యాన్సర్ రహిత కణతులు ఏర్పడతాయి. ఇతర ఇన్ఫెక్షన్లూ వస్తాయి. కొందరిలో గర్భస్రావం కూడా జరుగుతుంది. ఫ్యాక్టరీలు సరఫరా చేస్తున్న ఈ పిల్స్‌పై ఓ కాగితంగానీ, బ్రాండ్ నేమ్‌గానీ, ఆఖరికి అది ఎక్స్పైర్ అయిందా, లేదా కూడా తెలియడం లేదని దర్యాప్తులో తేలింది. ఈ పిల్స్ కారణంగా తాను తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సుధా అనే 17 ఏళ్ల యువతి తెలిపింది. చిత్తు కాగితాలు ఏరుకుని బతికే తన తల్లికి తోడుగా ఉండేందుకు తానీ పనిలో చేరానని, నెలకు ఆరు వేల రూపాయలు వస్తాయని, వారానికి ఒక్క రోజు మినహా ఎలాంటి సెలవులు ఉండవని, సెలవు పెడితే జీతం కట్ చేస్తారని తెలిపింది. తమ కుటుంబానికి లక్షన్నర రూపాయల అప్పు ఉండడం వల్ల తప్పనిసరిగా తానీ పనిలో కొనసాగాల్సి వస్తోందని వాపోయారు. మరో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కనగ మరిముత్తు అనే 21 ఏళ్ల యువతి పిల్స్ కారణంగా తన ఆరోగ్యం పాడవుతోందని, తీసుకోకపోతే పనిచేసే పరిస్థితి ఉండడం లేదని చెప్పారు. ఈ పిల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న విషయం తెలియదని, తమకు ఎవరు ఆ విషయం తెలపలేదని చెప్పారు. ఐబ్రూఫెన్, అడ్విల్ లాంటి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ డ్రగ్స్‌ను మహిళలకు ఇస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయని వైద్యులు అంటున్నారు. రుతుస్రావాన్ని అరికట్టేందుకు మందులు ఇస్తున్న మాట వాస్తవమేనని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ టైమ్ కీపర్ తెలిపారు. యాజమాన్యమే వాటిని తమకు సరఫరా చేస్తోందని, అయితే వాటి పేరేమిటో, వాటి వల్ల లాభమా, నష్టమా కూడా తనకు తెలియదని, తాను వాటిని వాడాల్సిన అవసరం రాలేదని మధ్యవయస్కురాలైన ఆమె చెప్పారు. తమ దృష్టికి ఈ విషయం రాలేదని, ఇలాంటి అనైతిక చర్యలకు తాము పాల్పడమని 500 వస్త్ర కంపెనీలకు సభ్యత్వం కలిగిన ‘సదరన్ మిల్లర్స్ అసోసియేషన్’ ప్రధాన కార్యదర్శి సెల్వరాజు కందస్వామి చెప్పారు. ఈ డ్రగ్స్ తీసుకొని బాధ పడుతున్న వస్త్ర ఫ్యాక్టరీల మహిళలు తమ వద్దకు పదుల సంఖ్యలో వస్తున్నారని దిండిగుల్లో క్లినిక్ నడుపుతున్న డాక్టర్ పీ. నళిన కుమారి తెలిపారు. కార్మిక చట్టాల ప్రకారం అర్హులైన నర్సులు, డాక్టర్లతో కంపెనీలే స్వయంగా డిస్పెన్సరీలను ఏర్పాటు చేయాలి. ఎక్కువ ఫ్యాక్టరీలను కలిగిన అతికొద్ది మంది మాత్రమే డిస్పెన్సరీలను నడుపుతున్నారు. చాలా కంపెనీలు ఫ్యాక్టరీల్లో టైమ్ కీపర్ల ద్వారా కడుపు నొప్పికి, తల నొప్పికి, నడుము నొప్పులకు సాధారణ మాత్రలను సరఫరా చేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలియజేశారు. -
సీసీఐ మాయాజాలం
సాక్షి ప్రతినిధి, గుంటూరు : పత్తి కొనుగోళ్లలో అడుగడుగునా సీసీఐ అక్రమాల మాయాజాలం ప్రదర్శిస్తోంది. ఈ విషయంలో సీసీఐ అధికారులతోపాటు బయ్యర్లు, పాలకపార్టీ ప్రజాప్రతినిధుల పాత్ర అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. సీసీఐకి నాణ్యమైన పత్తిని సరఫరా చేయాల్సిన బయ్యర్లు, అధికారులకు స్థానిక స్పిన్నింగ్ మిల్లుల్లో వాటాలు ఉండటంతో పత్తిరైతు చిత్తుగా మోసపోతున్నాడు. జిల్లాలోని 11 సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో ఈ ఏడాది పత్తి కొనుగోళ్లు జరిగాయి. పత్తి నాణ్యత, రేటు నిర్థారణ, గోడౌన్లు, స్పిన్నింగ్ మిల్లుల ఎంపికలో బయ్యర్లు కీలక బాధ్యత వహిస్తున్నారు. వీరిలో ఎక్కువ మందికి జిల్లాలోని స్పిన్పింగ్, జిన్నింగ్ మిల్లుల్లో వ్యాపార భాగస్వామ్యం ఉండటంతో ముఖ్య నిర్ణయాలప్పుడు ‘వ్యాపార భాగస్వామ్యాన్ని’ పరిగణనలోకి తీసుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి. తిమ్మాపురం పరిధిలోని ఒక స్పిన్నింగ్ మిల్లును సీసీఐ బయ్యర్లే స్వయంగా ఏర్పాటు చేసి బినామీల పేర్లతో నిర్వహిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. గోడౌన్ల నిర్థారణలోనూ... కొంతకాలంగా అనుమానాస్పదంగా సీసీఐ గోడౌన్లలో జరుగుతున్న అగ్నిప్రమాదాల వెనుక వాస్తవాలు వెలుగులోకి రావడం లేదు. మార్కెట్‌యార్డుల్లో కొనుగోలు చేసిన తరువాత జిన్నింగ్ మిల్లులో జిన్నింగ్ చేయించిన పత్తిని బేళ్లుగా తయారుచేస్తారు. బేళ్లుగా తయారైన పత్తిని నేరుగా స్పిన్నింగ్, టెక్స్టైల్ మిల్లులకు పంపటానికి అనువుగా ఉంటుంది. జిన్నింగ్ మిల్లుల నుంచి వచ్చిన పత్తిబేళ్లను సీసీఐ నిర్ధారించిన గోడౌన్లలో నిల్వ చేస్తారు. అనంతరం వీటిని విదేశాలకు ఎగుమతి చేస్తారు. లేదా స్పిన్నింగ్ మిల్లులకు అమ్ముతారు. సీసీఐ అధికారులు నిర్దేశించిన గోడౌన్లలోనే వీటిని నిల్వ చేస్తారు. వీటిల్లో అగ్నిప్రమాదాలు వాటిల్లకుండా ఉండటానికి అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు. 2013 ఏప్రిల్ 13వ తేదీ రాత్రి యడ్లపాడు మండల పరిధిలో ఉన్న సీసీఐ నిల్వ ఉంచిన గోడౌన్లో అగ్నిప్రమాదం సంభవించింది. అందులో నిల్వ ఉన్న 2919 బేళ్లు దగ్ధమయ్యాయి. వీటి విలువ సుమారు రూ.8 కోట్లు ఉంటుందని అంచనా. సీసీఐకి చెందిన నాణ్యమైన పత్తిబేళ్ల స్థానంలో నాసిరకం బేళ్లను ఉంచి, అగ్నిప్రమాదం కథ అల్లారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. మంత్రిగారి కుమార్తె వివాహం కోసం... సీసీఐ అధికారుల తప్పుల్లో ఇక్కడ ప్రముఖపాత్ర పోషించేది మాత్రం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కంపెనీల ప్రతినిధులన్నది బహిరంగ రహస్యమే. అప్పట్లో అగ్నిప్రమాదం ద్వారా లబ్ధిపొందినా, సీసీఐ కొనుగోళ్లు ద్వారా రైతుల పేర్లతో జేబులు నింపుకున్నా స్థానిక దళారీల పాత్ర కీలకం. ప్రతి ఏడాది రైతుల వద్ద నుంచి పత్తి కొనుగోలు చేస్తున్న దళారుల్లో ఎక్కువ మంది మంత్రి అనుచరులే. సీసీఐ పత్తి కొనుగోళ్లు 2014 సెప్టెంబర్‌లో ప్రారంభం కాగా చిలకలూరిపేటలో మాత్రం మంత్రి కుమార్తె వివాహ వేదిక మార్కెట్ యార్డు కావటంతో నవంబర్‌లో ప్రారంభించారు. ఇలా ప్రారంభించిన సీసీఐ కొనుగోళ్లు మందకొడిగాసాగాయి. అప్పటికే రైతులు ప్రైవేటు వ్యాపారుల పేరుతో చెలామణి అయిన మంత్రి అనుచరులకు క్వింటాలుకు రూ.3,000 నుంచి రూ. 3,200కు అమ్మేశారు. నవంబర్‌లో సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభం కావటంతో రైతువద్ద నుంచి కొనుగోలు చేసిన పత్తిని వారి పేర్లతో రూ 4050కు సీసీఐకు అమ్మి సొమ్ము చేసుకుని లబ్ధిపొందారు. ఏటా ఇదే తంతు.... స్థానికంగా సీసీఐ కొనుగోళ్లలో దళారీలదే హవా. రైతులు నేరుగా కొనుగోలు కేంద్రాలకు చేరుకోకుండా దళారీలు సిండికేట్‌గా మారి ధర నిర్ణయిస్తారు. బయట నుంచి ఎవరైనా నియోజవర్గ పరిసరప్రాంతాల్లో పత్తి కొనుగోలు చేయటానికి వచ్చి అధిక ధర నిర్ణయిస్తే వారిని బెదిరించి పంపేస్తారు. గతంలో ఇలా బయట ప్రాంతాల నుంచి వచ్చి రైతుల వద్ద పత్తి కొనుగోలు చేసిన వ్యాపారులు స్థానిక సిండెకేట్ దళారీలకే అమ్మి పలాయనం చిత్తగించారు. సీసీఐ అధికారుల అందదండలతో ఏటా కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యవహారాలపై సీబీఐచే విచారణ జరిపితే మరెన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. దుకాణాలు తెరిచిన టీడీపీ నేతలు తమ నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటైన పత్తికొనుగోలు కేంద్రాల నుంచి టీడీపీ పాలకులు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ జరిగే అక్రమాల గురించి తమకంతా తెలుసని సీసీఐ, మార్కెటింగ్‌శాఖల అధికారులను బెదిరించి ఆ మొత్తాలను గుంజారనే ఆరోపణలు లేకపోలేదు. రైతుల పొలాల నుంచి మార్కెట్‌యార్డుకు కాకుండా నేరుగా మిల్లులకు చేరిన పత్తికి రవాణా బిల్లులు పెట్టి రెండుశాఖల అధికారులు అవినీతికి పాల్పడితే, వాటిలోనూ ఈ పాలకులు వాటాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. -
ప్రత్తిపాటిపై గట్టి బాధ్యత
సాక్షి, గుంటూరు : గుంటూరు జిల్లాకు గత ఆనవాయితీ కొనసాగింది. రాష్ట్ర కేబినెట్లో ఈ సారీ జిల్లాకు వ్యవసాయశాఖ దక్కింది. స్వతహాగా వ్యవసాయ కుటుంబానికి చెందిన చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు ఈ శాఖ లభించింది. కోటి ఆశలతో ఎదురుచూస్తున్న రైతాంగానికి న్యాయం చేయాలంటే పుల్లారావుపై గట్టి బాధ్యతే పడిందని చర్చజరుగుతోంది. కుటుంబ నేపథ్యం వ్యవసాయసంబంధమైనదే అయినా ఈయన మొదటి నుంచి వ్యాపారవేత్తగానే కొనసాగారు. అయితే ఆయన పత్తి మిల్లులు, స్పిన్నింగ్ మిల్లులే నిర్వహిస్తుండటంతో వ్యవసాయంపై కొంత అవగాహన ఉందనే చెప్పవచ్చు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రైతులు ఎదుర్కోబోయే సమస్యలు, రైతు రుణమాఫీ హామీ అమలు, జిల్లాకు అతిముఖ్యమైన వరి, వేరుశనగ విత్తనాలపై సబ్సిడీ ఎత్తివేస్తున్నట్టు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో తలెత్తే సమస్యను ప్రత్తిపాటి ఏవిధంగా పరిష్కరిస్తారోననేది అందరిలోనూ ఆసక్తికలిగించే అంశం. రుణమాఫీ అమలు ఎలావుంటుందో.: ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు బ్యాంకు రుణాలపై ఆధారపడతారు. అయితే అధికారం చేపట్టగానే రుణమాఫీ చేస్తామని ప్రకటించిన చంద్రబాబునాయుడు కేవలం కమిటీ ఏర్పాటు చేస్తామని తేల్చేశారు. కమిటీ నివేదిక వచ్చి రుణమాఫీపై నిర్ణయం తీసుకోవాలంటే సుమారు రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ విషయంలో కొత్తగా బాద్యతలు చేపట్టనున్న ప్రత్తిపాటి ఏం చేస్తారనేదే తేలాల్సి ఉంది. తైవాన్స్ప్రేయర్లు... టార్పాలిన్ పట్టలపై సబ్సిడీ ఉంటుందా? రైతులకు సబ్సిడీ ధరల్లో అందించాల్సిన తైవాన్ స్ప్రేయర్లు, టార్పాలిన్ పట్టలు, గత ఏడాది నుంచి ఇంత వరకు రైతులకు అందకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. నూతన ప్రభుత్వంపై వారు ఆశలు పెట్టుకున్నారు. 2007కు ముందు వరి, వేరుశనగ విత్తనాల ధరలు మండిపోతూ రైతులకు భారంగా మారడంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి కేంద్రంతో మాట్లాడి రైతులకు వరి విత్తనాలు కిలో రూ. 5లు, వేరుశనగ విత్తనాలకు కిలోకు రూ. 18 లు చొప్పున సబ్సిడీ ఇప్పించే ఏర్పాటు చేశారు. దీంతో రైతులకు కొంత ఊరట కలిగింది. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం ఆ సబ్సిడీని ఎత్తివేస్తున్నట్లు వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించింది. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీనిపై కొత్త వ్యవసాయ శాఖ మంత్రి సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాగర్ ఆయకట్టుపై ఆందోళన రాష్ట్ర విభజన నేపధ్యంలో నాగార్జునసాగర్ ఆయకట్టు కింద ఉన్న రైతులకు వరి పండించేందుకు నీటి విడుదల ఆశించిన స్థాయిలో రాదనే ఆపోహలతో వీరంతా మెట్టపంటలైన ప్రత్తి, మిర్చి పంటలు వేసేందుకు సిద్దమయ్యారు. మరోవైపు ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణశాఖ అధికారులు ముందే వెల్లడించారు. దీంతో వర్షాలపై ఆధాపడే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. వీటన్నింటిని ఎదుర్కొని వ్యవసాయశాఖామంత్రిగా పుల్లారావు ఏ మేరకు సఫలీకృతమవుతారో వేచి చూడాలి. -
తెలంగాణ పునర్నిర్మాణంలో యువతే కీలకం
మోమిన్‌పేట, న్యూస్‌లైన్: అన్ని వర్గాల ప్రజలు కలసికట్టుగా పనిచేస్తేనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభం, మేకవనంపల్లి, అంరాధికలాన్, అంరాధికుర్దు, కొత్తకొల్కుందలలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. పాత కొల్కుందలో రూ.5లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసినందున తెలంగాణ పునర్నిర్మాణంలో యువత కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు, బంగారు తల్లి పథకానికి చట్టబద్ధత కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. దళిత, గిరిజనుల అభివృద్ధికి, బాలికల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అంతకుముంది చీమల్‌ధరి సర్పంచ్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో 100మంది గ్రామస్తులు మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం రాళ్లగుడుపల్లి సమీపంలో ఉన్న రామలింగేశ్వరస్వామిని మంత్రి దర్శించుకున్నారు. కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు వేమారెడ్డి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు నర్సింహారెడ్డి, సర్పంచ్‌లు శంకర్, మల్లారెడ్డి, మోతిలాల్, పర్మయ్య, పార్టీ నాయకులు భుజంగ్‌రెడ్డి, బుచ్చిరాంలు, మల్లేష్, మహిపాల్, కార్యకర్తలు పాల్గొన్నారు.