పోలీసు దొంగ..!
- విగ్రహాల కేసులో ఓ ఇంటెలిజెన్స్ పోలీస్‌ను అదుపులోకి తీసుకున్న పొలీసులు
- ఇంట్లోనే విగ్రహాలు అమ్ముతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన వైనం
- పోలీసుల అదుపులో మరో నలుగురు విగ్రహాల దొంగలు
కదిరి: ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుంటే అదుపు చేయాల్సిన పోలీసే పలు విగ్రహాల చోరీ కేసుల్లో నిందితుడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆలయాల్లో చోరీ చేసిన విగ్రహాలను ఆ పోలీస్ తన ఇంట్లో అమ్ముతూ రెండురోజుల క్రితం సీసీఎస్ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. జిల్లాలో ఎక్కడైనా మతపరమైన శాంతి భద్రతలకు విఘాతం కల్గుతుందనే సమాచారం ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ దృష్టికి చేరవేయడానికి కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. ఇందులో పనిచేసే పోలీసులు సివిల్ డ్రెస్‌లోనే ఉంటారు. నిత్యం ప్రజలతో మమేకమై తిరుగుతుంటారు.
ఈ విభాగంలో పని చేసే ఓ పోలీస్ జిల్లా కేంద్రంలోని కొవ్వూరు నగర్‌లో కాపురముంటున్నారు. ఇటీవల కాలంలో పలు ఆలయాల్లో విలువైన విగ్రహాల చోరీ అయ్యాయి. దీన్ని జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు సీరియస్‌గా తీసుకున్నా రు. దీని వెనుక ఎంతటి వ్యక్తులున్నా సరే వదిలిపెట్టకండని అన్ని పోలీస్ సబ్ డివిజన్‌లలో పనిచేసే డీఎస్పీలను ఆదేశించారు. రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు జిల్లా వ్యాప్తంగా సంచరించి ఇద్దరు విగ్రహాల దొంగలను అదుపులోకి తీసుకుని విచారిస్తే కౌంటర్ ఇంటెలిజె న్సీలో పని చేసే ఆ పోలీస్ పేరు వారు చెప్పారు. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. ఈ విషయం వెంటనే ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ పోలీస్‌పై నిఘా ఉంచారు.
రెండు రోజుల క్రితం ఆ పోలీస్ తన ఇంట్లో ఎంతో విలువైన సీతారామలక్ష్మణులతో పాటు ఆంజనేయుడి విగ్రహాలను అమ్ముతుంటే సీసీఎస్ పోలీ సులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతడిని విచారిస్తే తనకెలాంటి సంబంధం లేదని, తన బంధువులు ఒకరిద్దరు విగ్రహాల చోరీలలో సిద్ధహస్తులని, వారు తీసుకొచ్చిన విగ్రహాలు తన ఇంట్లో దాచి విక్రయించేవారని చెప్పినట్లు సమాచారం. అయితే ఆయన దగ్గర విగ్రహాల చోరీలకు సంబంధించిన కీలక విషయాలు రాబట్టినట్లు తెలిసింది. రాయచోటి రోడ్డులో ఓ బావిలో కూడా కొన్ని విగ్రహాలు దాచారని, వాటికోసం నేడో, రేపో సీసీఎస్ పోలీసులు కదిరికి రానున్నారని విశ్వసనీయ సమాచారం. సీసీఎస్ పోలీ సులు అదుపులోకి తీసుకున్న ఆ కౌంటర్ ఇంటిలిజెన్స్ పోలీస్ ఇటీవల పలు మార్లు కదిరిలో సంచరించారు. అదే సమయంలోనే మరకత మహాలక్ష్మి ఆలయంలో చోరీ జరిగింది. ఆ కేసులో కూడా ఇతని హస్తం ఉండవచ్చని అనుమానిస్తున్నారు.