సౌజన్య దూకేసిందా? ఎవరైనా తోసేశారా?
విజయవాడ : కృష్ణాజిల్లా విజయవాడలో సౌజన్య అనే నవ వధువు అనుమానాస్పద మృతికి సంబంధించి తాజా వివరాలు వెలుగులోకి వచ్చాయి. అజిత్సింగ్ నగర్ లోటస్ ల్యాండ్ మార్క్లోని అపార్ట్‌మెంట్ నుంచి ఆమె కిందకు పడుతున్న సీసీ కెమెరా పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే సౌజన్య ఆత్మహత్యకు ఒడిగట్టిందా? లేక ఎవరైనా కిందకు తోసేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈనెల 27న సౌజన్య మృతదేహం రోడ్డుపై పడి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించిన విషయం తెలిసిందే.
వివరాల్లోకి వెళితే రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు రెండో కుమార్తె సౌజన్యకు ఈ నెల 20వ తేదీన వివాహం జరిగింది. సాప్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న ఆమెకు కృష్ణలంకకు చెందిన దిలీప్ అనే సాప్ట్వేర్ ఇంజనీర్తో వివాహం అయింది. దంపతులు ఇద్దరూ హైదరాబాద్లోనే కాపురం పెట్టారు.
వారం రోజుల పాటు భర్తతో కలిసి పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్లి వచ్చింది. కాగా ఈ నెల 27వ తేదీన భర్తతో కలిసి హైదరాబాద్ కు వెళ్లాల్సి వుంది. అయితే అదే రోజు లోటస్ ల్యాండ్ మార్క్లోని అయిదో అంతస్తు నుంచి సౌజన్య కిందపడి మృతి చెందింది. ఆ సమయంలో తల్లిదండ్రులు తెనాలిలోని ఓ వివాహానికి వెళ్లారు.
అదేరోజు సౌజన్య ఎనిమిదో బ్లాక్లోకి వెళ్లినట్లు సీసీ టీవీ పుటేజ్ ద్వారా తెలుస్తోంది. తరవాత ఆమె అయిదో అంతస్తుకు చేరుకుని అక్కడి నుంచి కింది పడినట్లు దృశ్యాలు రికార్డు కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనితో అనుమానాస్పద మృతి కింద నమోదు చేసి కేసును మరింత లోతుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతురాలు ఉపయోగించిన సెల్ ఫోన్లోని డేటా ఆధారంగా విచారణను ముమ్మరం చేశారు. సౌజన్య తలకు స్కార్ఫ్ కట్టుకుని వుండటంతో ఆమె ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందిందా, లేక ఆత్మహత్యకు ప్రయత్నించిందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు దంపతుల మధ్య కలహాలే.. ఈ మరణానికి దారితీశాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగుతోంది. కాగా ఈ ఘటనపై సౌజన్య కుటుంబం మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. అసలే కూతురు చనిపోయిన బాధలో ఉన్న ప్రశ్నలతో వేధించవద్దంటూ సమాచారం ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు.