స్టాక్ వస్తే.. క్యాష్ కట్టాల్సిందే | cdpo's supervaisers force on aganwadi's | Sakshi
Sakshi News home page

స్టాక్ వస్తే.. క్యాష్ కట్టాల్సిందే

Published Thu, Jul 17 2014 3:48 AM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM

cdpo's supervaisers force on aganwadi's

- అంగన్‌వాడీలపై ఐసీడీఎస్ సీడీపీఓలు, సూపర్‌వైజర్ల ఒత్తిడి
- ఒక్కో కేంద్రం నుంచి రూ.400 చొప్పున బలవంతంగా వసూలు
- డబ్బులు కట్టలేమంటూ బెంబేలెత్తుతున్న అంగన్‌వాడీలు

 ఒంగోలు టౌన్ : సాధారణంగా షాపులకు స్టాక్ వచ్చిందంటే దానికి సంబంధించిన యజమాని క్యాష్ కట్టడం ఆనవాయితీ. ఏ రోజు స్టాక్ వస్తే ఆ రోజు క్యాష్ కట్టి వస్తువులను స్వాధీనం చేసుకుంటాడు. అయితే అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే పౌష్టికాహారం వచ్చిందంటే అంగన్‌వాడీలు క్యాష్ కట్టాల్సిందే. కొన్ని ప్రాజెక్టులకు చెందిన సీడీపీఓలు, సూపర్‌వైజర్లు కేంద్రాల ఆధారంగా రేట్ నిర్ణయించేశారు. ఒక్కో కేంద్రం నుంచి గరిష్టంగా రూ. 400 వరకు బలవంతంగా వసూలు చేస్తున్నారు. ఇందులో సీడీపీఓకు రూ.250, సూపర్‌వైజర్‌కు రూ.150 అందుతాయన్నది బహిరంగ రహస్యం. కొంతమంది అంగన్‌వాడీలు క్యాష్ కట్టేందుకు ఇష్టపడకపోతే వారిపై తనిఖీల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. పైఅధికారులు అడిగిన క్యాష్ ఇవ్వకుంటే ఎక్కడ కన్నెర్ర జేస్తారోనని అంగన్‌వాడీలు హడలిపోతూ వారు అడిగినంత చేతుల్లో పెట్టేస్తున్నారు. ఇదేదో ఒకటీ అరా నెల అయితే సర్దుకుపోవచ్చని, స్టాక్ వచ్చిన ప్రతిసారీ క్యాష్ కట్టాలంటే ఎక్కడ నుంచి తీసుకురావాలని కొంతమంది అంగన్‌వాడీలు ప్రశ్నిస్తున్నారు.
 
21 ప్రాజెక్టులు
 జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు పరిధిలో 21 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వాటి పరిధిలో 4300కుపైగా అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల ద్వారా గతంలో పౌష్టికాహారంతో పాటు కోడిగుడ్లు అందించేవారు. గతేడాది ద్వితీయార్థం నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోని హక్కుదారులైన చిన్నారులు, గర్భిణులు, బాలింతల సంఖ్య ఆధారంగా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. హక్కుదారుల సంఖ్యను ఆధారం చేసుకొని ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి బియ్యం, కందిపప్పు, వంట నూనె, తాలింపు గింజలు తదితర సరుకులను అందజేస్తున్నారు. దీంతో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన స్టాక్ వచ్చిందంటే క్యాష్ సిద్ధం చేసుకోవాల్సి వస్తోందని పలువురు అంగన్‌వాడీలు బహిరంగంగానే వాపోతున్నారు.
 
యూ టర్న్
మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన సరుకులు సరఫరా చేసిన సమయంలో గతంలో కొన్ని ప్రాజెక్టులకు చెందిన సీడీపీఓలు, సూపర్‌వైజర్లు కందిపప్పు, వంటనూనె ప్యాకెట్లు తీసుకెళ్లేవారు. వాటి నిల్వలు ఇళ్లల్లో పేరుకుపోవడంతో యూ టర్న్ తీసుకున్నారు. నిత్యావసరాల కంటే నగదు రూపంలో తీసుకుంటే వాటిని ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చన్న ఉద్దేశంతో ట్రెండ్ మార్చారు. ఒక్కో ప్రాజెక్టులో జనాభా ఆధారంగా అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాజెక్టులకు చెందిన సీడీపీఓలు, సూపర్‌వైజర్లు డబ్బులకు కక్కుర్తిపడి అంగన్‌వాడీలను టార్గెట్ చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

‘అమ్మ గార్లు’ అడిగినంత ఇవ్వాలంటే అడ్డదారులు తొక్కాల్సిందేనన్న నిర్ణయానికి కొంతమంది అంగన్‌వాడీలు వచ్చేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను సమర్థంగా నిర్వహించి హక్కుదారులకు మెరుగైన సేవలు అందించే విధంగా కార్యకర్తలు, ఆయాలను చైతన్యపరచాల్సిన అధికారులు వారిని పక్కదారి పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఆ శాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ‘స్టాక్‌కు క్యాష్’కు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement