అశ్వత్థామ కేసులో ప్రముఖుల హస్తం?
నరసాపురం (రాయపేట) : భూస్వామి అశ్వత్థామ నాయుడి కిడ్నాప్.. ఆస్తుల బదలాయింపు కేసులో ప్రముఖుల హస్తం ఉన్నట్టు తెలిసింది. ఈ కేసులో నిందితులు ఇటీవల పండగకు లక్ష్మణేశ్వరం గ్రామంలోనే రెండు రోజులు మకాం ఉన్నారని, ప్రధాన సూత్రధారిగా పేర్కొంటున్న రౌడీ షీటర్ కారిచర్ల మోహనరావు రెండురోజుల క్రితం గ్రామంలోనే మకాం ఉన్నాడని, అలాగే మరో నిందితుడు దీపావళి రోజున షిరిడీ ఎక్స్‌ప్రెస్‌లో నరసాపురం వచ్చి రెండురోజులు గ్రామంలోనే గడిపి వెళ్లినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీసులు గ్రామంపై నిఘా ఉంచారు. నిందితులు పక్కా ప్రణాళికతో కిడ్నాప్ చేసి ఆస్తులను రాయించుకున్నారని నిర్ధారణకు వచ్చిన పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. కిడ్నాప్‌కు ముందు, తరువాత నిందితులు ఎవరెవరితో సంభాషించారనే సమాచారాన్ని సేకరిస్తున్నారు. రూ.కోట్ల విలువైన ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే లక్షలు అవసరం కావడంతో అంత మొత్తం ఎవరు ఇచ్చారు, నిందితులు స్థానికంగా ఒక సెల్‌షాపు నిర్వాహకుడి నుంచి కొన్న కొత్త సిమ్‌ల వివరాలపై ఆరా తీస్తున్నారు. మంగళవారం సీఐ భాస్కరరావు లక్ష్మణేశ్వరం గ్రామానికి వెళ్లి నిందితుల వివరాలు, కుటుంబం, స్నేహితుల సమాచారాన్ని సేకరించారు.
మొత్తం నాలుగు రిజిస్ట్రేషన్లు
ఆస్తుల రిజిస్ట్రేషన్లలో పలు లోపాలను పోలీసులు కనుగొన్నారు. భీమవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజులు 7,568, 7,569, 7,570, 7,571 నంబర్లుగా సెప్టెంబర్ 29న రిజిస్ట్రేషన్ అయ్యాయి. కారిచర్ల మోహనరావు పేరున రెండు దస్తావేజులు, చాగంటి గోపికృష్ణ, గుబ్బల వెంకటేశ్వరరావు పేరున చెరొక దస్తావేజు చొప్పున మొత్తం నాలుగు రిజస్ట్రేషన్లు జరిగాయి. దస్తావేజులో విక్రయదారుడు కరుకువాడ బేతపూడి అని ఉదహరించి నరసాపురానికి చెందిన అడ్రస్‌ప్రూఫ్‌ను జతచేయడం గమనార్హం. అలాగే గుబ్బల వెంకటేశ్వరరావు పేర చేయించినరిజిస్ట్రేషన్ దస్తావేజులోని ఏజెంట్ ఫొటోఫారమ్‌పై అతని సంతకాలు లేవు.
ఇంటికి వెళ్లి మరీ రిజిస్ట్రేషన్
కరుకువాడ బేతపూడిలో ఇంటికి సబ్ రిజిస్ట్రార్‌ను తీసుకువెళ్లి మరీ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించిన వైనంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విధానంలో ముందుగా సబ్ రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు ఆస్తి విక్రయదారుడు అనారోగ్యపరిస్థితిని తెలియజేసే వైద్యుడి ధ్రువీకరణపత్రం, ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేయాలో ఆ ఇంటి డోర్ నంబర్ ఐడీ ప్రూఫ్ జతచేయాల్సి ఉంటుంది. అయితే కిడ్నాప్‌కు గురైన అశ్వద్ధామనాయుడు అనారోగ్యవంతుడని ఎవరు ధృవీకరించారు ? రెసిడెన్స్ సర్టిఫికెట్ ఎవరిచ్చారు ? అనే వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. వీటి దస్తావేజుల నకళ్లు, క్రయ, విక్రయదారుల వేలిముద్రలను పోలీసులు సేకరించారు.
కీలకంగా సబ్ రిజిస్ట్రార్ స్టేట్‌మెంట్
ఈకేసులో భీమవరం జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ శారదాదేవి స్టేట్‌మెంట్ కీలకంగా మారనుంది. అయితే ఇప్పటికే పోలీసులు ఆమెను ఒకసారి విచారణ చేశారు. అయితే దస్తావేజుల రిజిస్ట్రేషన్‌లో లోపాలపై కూడా ఆమెను మరోసారి ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆమె ఇచ్చే స్టేట్‌మెంట్ కీలకంగా మారనుంది. అయితే ఆమె ప్రస్తుతం అందుబాటులో లేనట్లుగా పోలీసు వర్గాలు తెలిపాయి. కార్యాలయంలో కాకుండా కరుకువాడ బేతపూడి గ్రామంలో ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించారన్నదే మిస్టరీగా మారింది. ఆ ఇంటి యజమాని చిక్కితేగాని తెరవెనుక ఎవరున్నారనేది తెలిసే అవకాశాలు లేవంటున్నారు. నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.