సెల్ టవర్లు...‘హెల్’ టవర్లే!
సెల్ టవర్లు...‘హెల్’ టవర్లే!
Published Wed, Oct 16 2013 11:24 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
‘సెల్ టవర్లతో రేడియేషన్ దారుణంగా విస్తరిస్తోంది. దాంతో మానవుల ఆరోగ్యం దెబ్బ తింటోంది. జనావాసాల నడుమ సెల్ టవర్ల ఏర్పాటును నిరోధించండి.’ అంటూ కొంతకాలంగా నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు మొరపెడుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. పెపైచ్చు కోర్టుల్ని కూడా తప్పుదోవ పట్టించి, సెల్ టవర్లతో రేడియేషన్ ప్రభావం పెద్దగా ఉండబోదంటూ వక్రభాష్యాలు చెప్పారన్న ఆరోపణలున్నాయి. సెల్ టవర్ల వల్ల కలిగే దుష్పరిణామాలపై ముంబై ఐఐటీకి చెందిన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం ఆచార్యుడు గిరీష్ కుమార్ ఓ సమగ్ర నివేదిక పొందించారు. ఈ నివేదికలను ప్రస్తావిస్తూ, తమ నివాస ప్రాంతాల్లో ఎదురవుతున్న రేడియేషన్ దుష్పరిణామాలపై న్యూ రేసపువానిపాలెం నివాసులు జీవీఎంసీ కమిషనర్ ఎం.వి.సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు.
నిబంధనల సడలింపు
సెల్ టవర్ల ఏర్పాటు నిబంధనలు గత కొన్నాళ్లుగా సరళీకృతమవుతూ వస్తున్నాయి. జీవీఎంసీలో నివాస ప్రాంతాల్లో సెల్ టవర్ల ఏర్పాటుపై గత కొన్నేళ్లుగా స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరాలున్నా, కోర్టు ఉత్తర్వులను సాకుగా చూపించి అధికారులు తప్పించుకుంటున్నారని నగరవాసులు ఆరోపిస్తున్నారు.
రేడియేషన్ ప్రభావం ఎంత?
జీవీఎంసీలో 584 సెల్ టవర్లున్నట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. సెల్ టవర్ నుంచి వచ్చే రేడియేషన్ జేబులోని మొబైల్ ఫోన్ రింగయినపుడు వచ్చేంత మాత్రమే ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిర్ధారించినట్టు జీవీఎంసీ అధికారులు గతంలోనే వెల్లడించారు. సుప్రీం కోర్టు అభిప్రాయాన్ని కూడా పొందుపరిచారు. తమ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సెల్‌టవర్లపై మూడు మాసాల కిందట నాతయ్యపాలెం ప్రజలు కమిషనర్‌కు మొరపెట్టుకుంటే.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో తాము చేసేదేం లేదని జీవీఎంసీ అధికారులు స్పష్టం చేశారు. అయితే న్యూరేసపువానిపాలెంలోని ఓ అపార్టుమెంట్‌వాసులు తమ అపార్ట్‌మెంట్‌పై ఏర్పాటు చేసిన సెల్‌టవర్లపై ఫిర్యాదు చేశారు. వీటివల్ల కొందరు తీవ్ర అనారోగ్యం పాలైనట్టు తెలిపారు. ఇందుకు సెల్ టవర్ల రేడియేషనే ప్రధాన కారణమంటూ ముంబయిలోని టాటా మెరియల్ హాస్పిటల్ అండ్ కేన్సర్ రీసెర్చ్ సంస్థ నిర్ధారించినట్టు పేర్కొన్నారు. ముంబయి ఐఐటీ ఆచార్యుడు గిరీష్ కుమార్ పరిశోధన నివేదికను కూడా జత చేశారు.
బాధితులు ఎందరో..
నివాస భవనాలపై సెల్ టవర్ల వల్ల రేడియేషన్ మితిమీరి చాలా మంది రోగాలకు గురవుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. మా అపార్ట్‌మెంట్‌పైనే రెండు టవర్లున్నాయి. ఇప్పటి వరకు సుమారు 20 మంది రేడియేషన్ ప్రభావానికి లోనయ్యారు. ముగ్గురు తీవ్ర వ్యాధిగ్రస్తులయ్యారు. ఓ మహిళలకు బ్రెస్ట్ కేన్సర్ వచ్చింది. తక్షణమే వీటిని నివాస ప్రాంతాల నుంచి తొలగించాలి.
- జి.ఎస్.సిద్దార్థ, ఫిర్యాది, న్యూ రేసపువానిపాలెం
ప్రభుత్వానికి నివేదిస్తాం
అపార్టుమెంట్‌వాసుల ఫిర్యాదును, ముంబయి ఐఐటీ ప్రొఫెసర్ గిరీష్ కుమార్ పరిశోధన బుక్‌లెట్‌ను ప్రభుత్వానికి అందిస్తాం. హైకోర్టు, సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు వీటిపై చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇపుడీ పరిశోధన పత్రం ఆధారంగా మరోసారి రేడియేషన్ ప్రభావంపై పరిశోధన చేయాల్సిందిగా ప్రభుత్వానికి నివేదించనున్నాం.
- ఎం.వి.సత్యనారాయణ, జీవీఎంసీ కమిషనర్
Advertisement
Advertisement