రచ్చబండ దరఖాస్తులకు చెల్లుచీటి! | Celluciti applications gallery! | Sakshi
Sakshi News home page

రచ్చబండ దరఖాస్తులకు చెల్లుచీటి!

Published Mon, Oct 13 2014 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 2:44 PM

Celluciti applications gallery!

కర్నూలు(అర్బన్):
 రచ్చబండ దరఖాస్తులు బుట్టదాఖలు కానున్నాయి.  కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ఇళ్లు మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్న నిరుపేదలకు నిరాశ మిగలనుంది. జీయో ట్యాగింగ్ సర్వే పూర్తి అయ్యేవరకు  కొత్తగా ఎలాంటి ఇళ్లను మంజూరు చేసేది లేదని స్వయంగా రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి కిమిడి మృణాళిని పేర్కొనడమే అందుకు నిదర్శనం. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను వెలుగులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జియో ట్యాగింగ్ సర్వే నిర్వహిస్తానని పేర్కొంది.

ఈ సర్వే ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నా, ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకున్నట్టు కనిపించడం లేదు. కాగా ప్రస్తుతం ఇందిరమ్మ లబ్ధిదారుల ఆధార్‌కార్డులను అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన తరువాత  సర్వే నిర్వహించే అవకాశం ఉంది. అప్పటి వరకు కొత్తగా ఎలాంటి ఇళ్లను మంజూరు చేసేది లేదని స్వయంగా ఆశాఖ మంత్రి కిమిడి మృణాళిని ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో మూడు విడతలుగా జరిగిన రచ్చబండ కార్యక్రమంలో మంజూరైన గృహాల్లో నేటికి నిర్మాణాలు ప్రారంభించని గృహాలు, అర్హులుగా తేల్చి మంజూరు కాని ఇళ్లు కూడా రద్దు అయ్యే ప్రమాదం కనిపిస్తోంది.

మూడు విడతల్లో నిర్వహించిన రచ్చబండలో జిల్లా వ్యాప్తంగా 3,10,948 దరఖాస్తులు అందగా, వీటిలో 2,37,499 దరఖాస్తులు అర్హమైనవేనని అధికారులు తేల్చారు. వీటిలో 1,70,041 దరఖాస్తులకు మాత్రమే గృహాలు నిర్మించుకునేందుకు అనుమతి మంజూరు చేశారు. మిగిలిన 67,458 మంది నిరుపేదలు చేసుకున్న దరఖాస్తులకు నేటికి మోక్షం లభించలేదు.  

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సర్వే నిర్ణయంతో నిరుపేదల సొంత ఇంటి ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. జీఓ నెంబర్ 33 ప్రకారం మొదటి విడత రచ్చబండ కార్యక్రమంలో భాగంగా 2011-12లో జిల్లాకు 32,175 గృహాలు మంజూరు కాగా, వీటిలో నేటికి 776 గృహ నిర్మాణాల పనులు ప్రారంభం కాలేదు. అలాగే జీఓ నెంబర్ 44 మేరకు రెండో విడతలో 2012-13లో 25,618 గృహాలు మంజూరు కాగా, వీటిలో 565 గృహ నిర్మాణాల పనులు, జీఓ నెంబర్ 23 ప్రకారం 2013-14 సంవత్సరానికి సంబంధించి మూడో విడతలో 34,752 గృహాలు మంజూరు కాగా, వీటిలో నేటికి 698 ఇళ్ల నిర్మాణాల పనులు ప్రారంభం కాలేదు. ఈ లెక్కన మూడు విడతల్లో నిర్మాణాలు ప్రారంభించని 2039 గృహాలు కూడా రద్దు అయ్యే ప్రమాదం ఉంది.
 
 మూడు సెంట్ల స్థలంలో రూ.1.50 లక్షలతో ఇళ్లు హామీ తూచ్
 గడచిన సార్వత్రిక ఎన్నికల్లో అర్హులైన ప్రతి పేదవానికి మూడు సెంట్ల స్థలంలో రూ.1.50 లక్షల వ్యయంతో సొంత గృహాన్ని నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ఉత్తిదేననే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, వాటిని నిగ్గుతేల్చిన తరువాతే కొత్త గృహాల మంజూరు గురించి ఆలోచిస్తామని పేర్కొనడం అందుకు బలం చేకూరుస్తున్నాయి.  రైతు రుణాలు, డ్వాక్రా మహిళల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామనే హామీని నెరవేర్చేందుకే సవాలక్ష మార్గాలను అన్వేశిస్తున్న ముఖ్యమంత్రి ఇళ్లు లేని నిరుపేదలకు సొంత ఇళ్లను నిర్మించలేరనే భావనను ఆయా వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement