శ్రీకాకుళం పాతబస్టాండ్:జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ కేం ద్రాల్లో ధాన్యం అమ్మేందుకు రైతులు ముందుకు రావడం లేదు. జిల్లాలో ఇప్పటివరకు 74 కేంద్రాలు ప్రారంభం కాగా 450 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ధాన్యం తక్కువ ధర పలక డం, రవాణా చార్జీలు రైతులే భరించాల్సి ఉండటం రైతులకు ఇబ్బందికరంగా మారింది. పైగా బ్యాంకు ఖాతాల ద్వారానే చెల్లింపులు జరుపుతుండటంతో రుణ ఖాతాలకు ఈ నగదును బ్యాంకర్లు జమ చేస్తారన్న భయంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం అమ్మేందుకు ముందుకు రావడంలేదు.
అలాగే కొనుగోలు కేంద్రాల గురించి రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. జిల్లాలో ఈ ఏడాది వంద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు 74 కేంద్రాలు ప్రారంభమయ్యాయి. స్థానిక ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉన్న సమయంలో ఈ నెల 24 నుంచి వీటిలో కొనుగోళ్లు ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 450 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో సుమారు 2 లక్షల హెక్టార్లలో వరి వేశారు. అయితే హుద్‌హుద్ తుపాను, ఆ తర్వాత సుడిదోమ కారణంగా చాలావరకు పంట దెబ్బతింది. వీటన్నింటినీ తట్టుకొని సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి వస్తుందని అంచనా. ఇందులో కనీసం మూడు లక్షల టన్నులైనా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఈ ఏడాది 50 వేల టన్నులు కూడా కొనుగోలు చేసే అవకాశం లేదు.
ధరలోనూ తేడాలే
ఈ ఏడాది క్వింటాలు ధాన్యం ఎ-గ్రేడుకు రూ.1400, సాధారణ రకానికి రూ.1360 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిలో 17 శాతం వరకు తేమ, పొల్లు ధాన్యం ఇతర లోపాల పేరుతో ధర తగ్గించేస్తున్నారు.
చెల్లింపుల్లోనూ బ్యాంకు అకౌంట్లు ఇతరత్రా కారణాలతో కాలయాపన చేస్తున్నారు. దీంతో రైతులు గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారులనే ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ విషయాన్ని పౌరసరఫరా సంస్థ జిల్లా మేనేజర్ జె.సీతారామారావు వద్ద ప్రస్తావించగా ఇంకా కొన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉందన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు అందుబాటులో లేకపోవడంతో జాప్యం జరిగిందని తెలిపారు. కొనుగోళ్లపై దృష్టిపెట్టామని, రైతులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.
కొనుగోలు కేంద్రాల్లో దైన్యం శ్రీకాకుళం పాతబస్టాండ్:జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ కే
Published Thu, Dec 4 2014 2:06 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement