4న కేబినెట్ భేటీ
మర్నాడే రాష్ట్రపతి పరిశీలనకు?
నేడు కోర్‌కమిటీ ముందు టీ ముసాయిదా
100 పేజీల జీవోఎం నివేదిక సిద్ధం
విభజన ప్రక్రియ అమల్లో మార్పులు
వెనకబడ్డ ప్రాంతాలన్నింటికీ ప్యాకేజీ
చివరి నిమిషం దాకా మార్పులు: షిండే
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ప్రక్రియను ఎప్పుడు పూర్తి చేయాలనే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం రూపొందించుకున్న ప్రణాళికలో స్వల్ప మార్పులు జరిగినట్టు తెలుస్తోంది. తెలంగాణ ముసాయిదా బిల్లు, కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం) నివేదికపై శుక్రవారం కాంగ్రెస్ కోర్‌కమిటీ సోనియాగాంధీ అధ్యక్షతన సమావేశమై చర్చించనుంది. కోర్ కమిటీ ఆమోదం పొందాకే వాటిని కేంద్ర కేబినెట్‌కు పంపాలని హస్తిన పెద్దలు నిర్ణయించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో తెలంగాణ బిల్లు, జీవోఎం నివేదిక వంటివేవీ చర్చకు రాలేదని తెలిసింది. భేటీ ఎజెండాలో ఇవేవీ లేని విషయం తెలిసిందే. హోంశాఖ వర్గాలు చెబుతున్న ప్రకారం డిసెంబర్ 4న జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో విభజన బిల్లును, జీవోఎం నివేదికను ప్రవేశపెడతారు. కేబినెట్‌లో ఆమోదం పొందిన మర్నాడే దాన్ని రాష్ట్రపతి పరిశీలనకు నివేదించే అవకాశాలున్నాయి. అయితే విభజన ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అంశంపై శుక్రవారం కోర్‌కమిటీ చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
చిదంబరంతో షిండే, జైరాం భేటీ
కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరంతో గురువారం ఉదయం 11.30 గంటలకు మంత్రులు సుశీల్‌కుమార్ షిండే, జైరాం రమేశ్ సమావేశమయ్యారు. సుమారు 45 నిమిషాలు జరిగిన ఈ భేటీలో తెలంగాణ, సీమాంధ్రలోని వెనకబడిన ప్రాంతాలకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీంతోపాటు బుధవారం నాటి జీవోఎం భేటీ అనంతరం 11 అంశాలకు సంబంధించి జైరాం రూపొందించిన 100 పేజీల నివేదికలోని మంచిచెడులు, అందులో పొందుపరచాల్సిన ఇతరత్రా అంశాలను పరిశీలించారు. కోస్తా, రాయలసీమలతో పాటు తెలంగాణలోని వెనకబడ్డ ప్రాంతాలకు కూడా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే అంశాలు నివేదికలో ఉన్నట్టు చెబుతున్నా, నిజానికి నివేదికలో ఏమేమున్నాయన్నది మాత్రం చిదంబర రహస్యంగానే ఉంది. భేటీ అనంతరం షిండే తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ‘‘హైదరాబాద్ గానీ, భద్రాచలం గానీ జీవోఎంకు ప్రతిబంధకాలు కానే కావు. ఇతర సమస్యలేమిటనేది చెప్పలేను. ముసాయిదా బిల్లులో లోపాల్లేకుండా చర్చిస్తున్నాం. సూక్ష్మస్థాయి లోపాలపైనా దృష్టి పెట్టాం. నివేదికను వీలైనంత తొందరగా కేబినెట్‌లో ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెడతాం’’ అని పేర్కొన్నారు. చివరి నిమిషం దాకా మార్పుచేర్పులుండవచ్చని సూచనప్రాయంగా తెలిపారు.
న్యాయశాఖ పరిశీలనలో టీ బిల్లు
హోం శాఖ రూపొందించిన విభజన బిల్లు గురువారం కేంద్ర న్యాయ శాఖకు వెళ్లింది. శాఖలోని లెజిస్లేచర్ విభాగం అధికారులు బిల్లును నిశితంగా పరిశీలిస్తున్నారు. బిల్లు డిసెంబర్ 3న సాయంత్రం జరిగే జీవోఎం సభ్యుల సమావేశం ముందుకు రానుంది. సభ్యుల ఆమోదం అనంతరం ముసాయిదా బిల్లు, జీవోఎం సిఫార్సులను 4న జరిగే కేబినెట్‌లో ప్రవేశపెడతారు. అయితే తెలంగాణ బిల్లును వీలైనంత తొందరగా పార్లమెంటులో ప్రవేశపెట్టాలని సోనియాగాంధీ భావిస్తున్నందున శని లేదా సోమవారాల్లో కేంద్ర కేబినెట్ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశాలు కూడా లేకపోలేని హోం శాఖ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
జైపాల్‌తో శీలం, దిగ్విజయ్‌తో మర్రి భేటీలు
విభజన అనివార్యమైనందున హైదరాబాద్‌ను కొద్ది కాలమైనా కేంద్రపాలిత ప్రాంతం చేయాలని అధిష్టానం పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్న కేంద్ర మంత్రి జేడీ శీలం గురువారం కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డిని కలిశారు. హైదరాబాద్‌ను యూటీ చేసేలా సోనియాకు సూచించాలని కోరినట్టు తెలిసింది. మరోవైపు జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి గురువారం ఉదయం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కలిశారు. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను పెంచాల్సిన ఆవశ్యకతను వివరించారు. రాజకీయ అస్థిరత ఉండొద్దంటే వాటిని 119 నుంచి 153కు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దీన్ని సోనియా దృష్టికి తీసుకెళ్లి ముసాయిదా బిల్లులో పొందుపరిచేలా చూడాలన్నారు.
తెలంగాణకు సోనియా పేరు: శంకర్రావు
తెలంగాణ రాష్ట్రానికి సోనియాగాంధీ పేరు పెట్టాలని మాజీ మంత్రి పి.శంకర్‌రావు డిమాండ్ చేశారు. ఆమె వల్లే రాష్ట్రం ఏర్పడుతోందని మీడియాతో ఆయనన్నారు. విభజనను అడ్డుకుంటానని ప్రగల్భాలు పలుకుతున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చరిత్రహీనుడిగా మిగులుతారన్నారు.