రాష్ట్రాలకు కేంద్రం షాక్‌! | Central Dispositions States On Power Issues | Sakshi
Sakshi News home page

రాష్ట్రాలకు కేంద్రం షాక్‌!

Published Wed, Jul 3 2019 1:51 AM | Last Updated on Wed, Jul 3 2019 1:51 AM

Central Dispositions States On Power Issues - Sakshi

సాక్షి, అమరావతి: విద్యుత్‌ సరఫరా విషయంలో కేంద్రం రాష్ట్రాలకు షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. ఇక మీదట విద్యుత్‌ను అప్పుగా ఇవ్వరాదని తీర్మానించింది. కేంద్రం నుంచి ఎంత విద్యుత్‌ తీసుకుంటారో అంత మొత్తానికి లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌(ఎల్‌సీ) విధిగా కలిగి ఉండాలని స్పష్టం చేసింది. అంటే...తీసుకునే విద్యుత్‌ మొత్తానికయ్యే సొమ్మును ముందే బ్యాంకులో డిపాజిట్‌ చేసి, బ్యాంకు నుంచి భరోసా ఇప్పించాలనే షరతు విధించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర ఇంధనశాఖ గత నెల 28న జారీ చేసింది. ఈ కొత్త నిబంధన వచ్చే నెల ఒకటవ తేదీ నుంచే అమలులోకి వస్తుందని వెల్లడించింది. కేంద్రం తాజా నిర్ణయంపై రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో ఉన్నామని, కేంద్ర నిర్ణయం పిడుగుపడ్డ చందంగా ఉందని అంటున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల పంపిణీ సంస్థలు ఏకమై దీనిపై పునరాలోచన చేయాలని కేంద్రాన్ని కోరేందుకు సిద్ధమవుతున్నాయి.

ఎల్‌సీ అస్త్రం.. కేంద్ర విద్యుత్‌ సంస్థ ఎన్టీపీసీకి దేశవ్యాప్తంగా విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలున్నాయి. అంతేగాక ప్రైవేటు విద్యుత్‌ను కూడా తీసుకుని డిస్కమ్‌లకు అందిస్తోంది. ఇప్పటిదాకా చెల్లింపుల విషయంలో చూసీచూడనట్టుగా వెళ్తోంది. డిస్కమ్‌లు ఆలస్యంగా చెల్లించినా ఉదాసీనంగానే ఉంటోంది. అయితే పలు డిస్కమ్‌ల నుంచి ఎన్టీపీసీకి రూ.45 వేల కోట్ల మేరకు బకాయిలు రావాల్సి ఉంది. వీటిని రాబట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండట్లేదు. ఈ నేపథ్యంలో లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఒక్కటే మార్గమని భావించింది. ముందుగా డిస్కమ్‌లు చెల్లించాల్సిన బకాయిలు మొత్తం ఇవ్వాలి. తర్వాత కేంద్రం నుంచి తీసుకునే విద్యుత్‌కు నెలకయ్యే ఖర్చును ముందే బ్యాంకులో డిపాజిట్‌ చెయ్యాలి. బ్యాంకు ఇచ్చే ఎల్‌సీని బట్టి క్రెడిట్‌ లిమిట్‌ ఉంచుతారు. దీనివల్ల ఒక్కపైసా కూడా ఎన్టీపీసీకి ఎవరూ బకాయి పడే అవకాశం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రీపెయిడ్‌ చెల్లింపులాంటిదేనని అధికారులం టున్నారు. ఎల్‌సీ లేని విద్యుత్‌ పంపిణీ సంస్థ దేశంలో మరెక్కడి నుంచి కూడా విద్యుత్‌ కొనుగోలు చేసే అవకాశం లేకుండా చేశారు. ఎల్‌సీ లేని డిస్కమ్‌లకు అనుమతి ఇవ్వొద్దని కేంద్రం రీజినల్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్లు(ఆర్‌ఎల్‌డీసీలు)కు స్పష్టమైన ఆదేశాలిచ్చింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement