సాక్షి ప్రతినిధి, ఏలూరు :
సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం అన్నివర్గాల ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమించినా కేంద్ర ప్రభుత్వం లెక్కచేయలేదు. ప్రజల మనోభావాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా తెలుగు జాతిని విడగొట్టాలని నిర్ణయించడంపై జిల్లాలో ఆందోళన వెల్లువెత్తుతోంది. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో విభజనపై ఏ నిర్ణయం తీసుకుం టారనే విషయంపై గురువారం రాత్రి వరకూ జిల్లా అంతటా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర విభజనవైపే కేంద్రం అడుగులు వేస్తున్నట్లు అర్థమవుతున్నా.. అనూహ్య మార్పులు ఏమైనా ఉంటాయేమోననే భావనతో అందరూ ఆ సమావేశ నిర్ణయం కోసం ఎదురుచూశారు. రాయల తెలంగాణ ఇస్తారనే ప్రచారం జరిగినా.. చివరకు 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వనున్నట్టు ప్రకటించడంతో రాష్ట్రం విడిపోతుందనే బాధ అన్నివర్గాల్లోనూ వ్యక్తమవుతోంది. రెండురోజుల నుంచి గ్రామాల్లో ఈ అంశంపైనే వాడీవేడి చర్చ నడుస్తోంది.
నోరు మెదపని కాంగీయులు
ఈ దశలోనూకాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు ఏమాత్రం స్పందించకుండా నిర్లక్ష్యంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మంత్రివర్గ సమావేశంలోనే ఉన్న కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు దీనిపై నోరు మెదపలేదు.
గురువారం ఒక దశలో ఆయన రాజీనామా చేస్తారనే వార్తలు వెలువడినా నిజం కాదని తేలిపోయింది. జిల్లాకు చెందిన మంత్రులు పితాని సత్యనారాయణ, వట్టి వసంత్‌కుమార్‌తోపాటు నరసాపురం ఎంపీ కనుమూరి బాపిరాజు, ఆ పార్టీ ఎమ్మెల్యేలెవరూ విభజనపై అత్యున్నత స్థాయిలో నిర్ణయం జరిగినా బయటకు రాలేదు. ఈ దశలోనూ నేతలంతా పదవులను పట్టుకుని వేలాడుతుండటాన్ని ప్రజలు సహించలేకపోతున్నారు. పదవుల్లో ఉండి ఏదో చేస్తామని అందరినీ భ్రమ పెట్టిన నేతలు ఇప్పటికీ అదే బాటలో పయనిస్తున్నారు.
తప్పని పరిస్థితుల్లో టీడీపీ
ప్రతిపక్ష స్థానంలో ఉన్న తెలుగుదేశం పార్టీ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉండగా, రాష్ట్ర విభజన అంశంపై స్పష్టమైన వైఖరి లేకుండా వ్యవహరించి అభాసుపాలైంది. ఆ పార్టీ స్థానిక నేతలు సమైక్యవాదాన్ని వినిపిస్తున్నా.. అధినాయకత్వంపై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నందుకు లోలోన మదనపడుతున్నారు. కేంద్ర మంత్రివర్గం నిర్ణయంపై చంద్రబాబు పెదవి విప్పకపోవడాన్ని ఆ పార్టీ నాయకులే జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవేళ ఆయన మాట్లాడినా స్పష్టత ఇచ్చే పరిస్థితి ఏమాత్రం ఉండదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తాజా ప్రకటన నేపథ్యంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో టీడీపీ కూడా బంద్ చేపట్టాలం టూ పార్టీ శ్రేణులకు సూచించింది.
ఉద్యమ దివిటీగా వైసీపీ
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విభజన నిర్ణయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. విభజనను తొలినుంచీ వ్యతిరేకిస్తూ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ముందుకెళుతున్న ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బంద్ విజయవంతానికి పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నా యి. శుక్రవారం జరగాల్సిన పార్టీ సమావేశాలను నిరసన కార్యక్రమాలుగా మార్పు చేస్తూ ఆ పార్టీ జిల్లా నాయకులు నిర్ణయం తీసుకున్నారు.
అదనపు బలగాలొచ్చాయ్
కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఆందోళనలు జరిగే అవకాశం ఉండటంతో జిల్లా అంతటా భద్రతను మరింత పటిష్టం చేశారు. అదనంగా ఒక కంపెనీ సీఆర్‌పీఎఫ్ బలగాలు జిల్లాకు వచ్చాయి. బలగాలను భీమవరం తరలించారు. ఇంతకుముందే రెండు కంపెనీల సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్ బలగాలు జిల్లాలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నాయకుల నివాసాల వద్ద వారిని నియమించారు. ఇప్పుడు వారిని మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఏలూరులో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసం వద్ద భద్రతను పెంచారు. జిల్లా అంతటా పోలీస్ పికెట్‌లు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఆందోళనలు పెద్దఎత్తున జరిగే అవకాశం ఉండటం, వైఎస్సార్‌సీపీ బంద్‌కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో భద్రతాపరంగా గట్టి చర్యలు తీసుకుంటున్నారు.
సమైక్యానికి రిక్త‘హస్తం’
Published Fri, Dec 6 2013 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM
Advertisement
Advertisement