ఆళ్ల నాని పాదయాత్రకు బ్రహ్మరథం | Alla Nani padayatra Brahmaratham | Sakshi
Sakshi News home page

ఆళ్ల నాని పాదయాత్రకు బ్రహ్మరథం

Published Wed, Jan 29 2014 3:59 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM

ఆళ్ల నాని పాదయాత్రకు బ్రహ్మరథం

ఆళ్ల నాని పాదయాత్రకు బ్రహ్మరథం

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట), న్యూస్‌లైన్ : కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై ఇప్పటివరకూ ఒకే కుటుంబంలా ఉన్న తెలుగు ప్రజల మధ్య విభజన చిచ్చు పెట్టడంపై రాష్ట్ర ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ప్రజలకు అండగా నిలుస్తూ సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పోరాడుతోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆందోళనా కార్యక్రమాలు చేయించారు. దీనిలో భాగంగా ఏలూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని గడపగడపకూ సమైక్య శంఖారావం పేరిట నగరంలోని అన్ని డివిజన్లలో ప్రజలను స్వయంగా కలిసి ఉద్యమానికి మద్దతు కూడగట్టారు. గత డిసెంబర్ 5న నగరంలో ప్రారంభమైన నాని పాదయాత్ర కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రతిపక్ష టీడీపీ కుట్రలను బహిర్గతం చేస్తూ  45 రోజులుగా ముందుకు సాగుతోంది.
 
 పేదల సంక్షేమం కోసం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ఆయన మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్న వైనంపై ప్రజలకు వివరించారు. ప్రపంచ రాజకీయాలకే మార్గదర్శకంగా నిలిచిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలను అమలు చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసి ప్రజల నమ్మకంపై దెబ్బకొట్టిందని తెలిపారు. వైఎస్ మరణం తరువాత ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కంకణబద్ధుడై చేస్తున్న పోరాటాలను నాని ప్రజలకు గుర్తు చేశారు. ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ఆయనను జైలుపాలు చేసిన ఉదంతాన్నీ కళ్లకు కట్టినట్టు వివరించారు. అభిమాన బలంతోనే జగన్‌మోహన్‌రెడ్డి బయటకు వచ్చారని గుర్తుచేశారు.
 
   ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయమని పలు సర్వేల నివేదికలు స్పష్టం చేస్తుండడంతో మునిసిపాలిటీల పదవీ కాలం ముగిసి నాలుగేళ్లకు పైగా గడుస్తున్నా ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం జంకుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నగర, పట్టణ ప్రాంత ప్రజలు గత నాలుగేళ్లుగా అభివృద్ధికి దూరంగా కాలం వెళ్లదీయాల్సిన దారుణ పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. నాని పాదయాత్రకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పలుకుతూ వైసీపీకి తమ మద్దతును తెలుపుతున్నారు. నాని పాదయాత్ర నగరంలో ఈ నెలాఖరునాటికి పూర్తిచేసి, ఫిబ్రవరి ఒకటి నుంచి ఏలూరు మండలంలో కొనసాగించనున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement